రాజధాని పనులన్నీ రహస్యంచంద్రబాబు కోటరీకే పరిమితంమిగిలిన యంత్రాంగమంతా దూరం మాస్టర్ ప్లాన్ లో మార్పులుఅందుకు అనుగుణంగా చెల్లింపులువేగంగా జరిగిపోతున్న నిర్ణయాలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేక రాచరిక భూస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అన్న అనుమానం కలుగక మానదు. రాజధాని నిర్మాణం గురించి తలపెట్టినది లగాయతు అన్ని పనులూ కోటరీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అంతే కానీ, దీనిపై బహిరంగ చర్చ కానీ, సంప్రదింపులు కానీ లేనే లేవు. తాజాగా మాస్టర్ ప్లాన్ లో జరుగుతున్న మార్పులు, చేర్పులు మీద కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు, కోటరీ మనుషులే దగ్గర ఉండి వీటిని ముందుకు తీసుకొని వెళుతున్నారు. మాస్టర్ ప్లాన్ మహాత్మ్యంరాజధాని ఏర్పాటు లో మాస్టర్ ప్లాన్ కీలకం అన్నది అందరికీ తెలిసినదే. దీని ఆధారంగానే నవ్యాంధ్ర ప్రదేశ్‌కు నూతన రాజధాని రూపురేఖలు వెల్లడవుతాయి. అంతటి కీలకమైన అంశం మీద చర్చ మాత్రం పారదర్శకంగా లేనే లేదు. చెప్పింది వేదం, చేసేది మార్గం అన్నట్లుగా పాలన సాగుతోంది. ఈ విషయంలో సీనియర్ మంత్రులకు కూడా ప్రమేయం కనిపించటం లేదు. కోటరీ నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా పనులు జరిగిపోతున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ ను మూడు దశల్లో ప్రణాళికల రూపంలో అందిస్తున్నారు. ఇందులో మొదటి ప్రతి ఇప్పటికే చంద్రబాబు చేతికి చేరింది. దీని ఆధారంగా రెండు, మూడు దశల ప్రణాళికల్లో ఏమేం ఉండవచ్చు అన్నది అంచనా వేస్తున్నారు. రాజధానిలో కీలక నిర్మాణాలు ఎక్కడెక్కడ రావాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏం కోరుకొంటోంది అన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే ఈ చర్చల్లో మొత్తంగా కోటరీ టీమ్ మాత్రమే పాల్గొంటోంది తప్పితే దీంట్లో ఇతరులకు ప్రవేశం ఉండటం లేదు. ఏకో నారాయణ..!సర్వ సాధారణంగా ఒక అంశం మీద ప్రభుత్వం తరపున సమీక్ష జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల లేదా విభాగాల ఉన్నతాధికారులను పిలుస్తారు. ఆ స్థాయిని బటి సంబంధిత మంత్రి తప్పనిసరిగా పాల్గొంటారు. ముఖ్యమైన అంశం మీద అధ్యయనం చేయాలంటే క్యాబినెట్ సబ్ కమిటీ వేసే సాంప్రదాయం కూడా ఉంది. కానీ, రాజధాని అనే ఇంతటి కీలక విషయంలో కూడా ఎక్కడ ఇతర ఉన్నతాధికారులు ప్రమేయం కనిపించదు. మంత్రులకు పిలుపు వెళ్లనే వెళ్లదు. కేవలం కోటరీ కి చెందిన ఒకరు ఇద్దరు మంత్రులు, ఆపై నిర్ణయించిన ఉన్నతాధికారులే మొత్తం నడిపించేస్తున్నారు. పైగా ముఖ్యమంత్రి దగ్గర సమాలోచనలు జరపటం, ఆ సారాంశాన్ని సింగపూర్ కంపెనీలకు చేరవేయటం, సింగపూర్ కంపెనీల నుంచి వచ్చిన విషయాల్ని ముఖ్యమంత్రికి అందించటం, ఆయనతో సంప్రదించటం అంతా మునిసిపల్ మంత్రి నారాయణ నడిపిస్తున్నారన్న గుసగుసలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. ఉచితంగా ఉచిత కేటాయింపులుఇదంతా ఒక ఎత్తయితే, ఈ ప్లాన్ ను ఉచితంగా అంద చేస్తారని తొలి దశలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అంతర్గతంగా ప్రభుత్వం చేస్తున్న ఆర్బాటం మరోలా ఉంది. కన్సల్టెన్సీ ఛార్జెస్ ఫర్ మాస్టర్ ప్లానింగ్ అండ్ డీపీఆర్ ప్రిపరేషన్ కోసం అంటూ రూ.500 కోట్లు కేటాయించింది. దీని మీద సింగపూర్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రణాళికలు అన్ని అందచేసిన తర్వాత మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక రాచబాట వేసుకొని ఉంచుకొంది. కావాల్సిన సంస్థల్నే ఎంచుకొనేందు కోసం స్విస్ ఛాలెంజ్ పద్దతిని అనుసరించేందుకు మంత్రి మండలి ఇప్పటికే పచ్చ జెండా ఊపింది. అయిన వారికోసమే అన్నీ..!స్విస్ చాలెంజ్ మీద అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం పట్టుదల గా ముందుకు వెళుతుంది. ఈ పద్దతిన అయిన వారి సంస్థల నుంచి ప్రతిపాదనలు అందుతాయి. అప్పుడు ఈ వివరాల ప్రకారం ఎవరైనా మెరుగైన విధానంలో ముందుకు వస్తారా అని అడగటం, ఎవరైనా వచ్చినట్లయితే ఆ వివరాలు సదరు సంస్థలకు ఇవ్వటం, ఇంత క ంటా మెరుగ్గా ముందుకు వస్తారా అని అడగటం, అవును అన్న సమాధానం రాగానే ఆ సంస్థలకే అన్నీ కట్టబె ట్టడం ..అంతా సినిమా స్క్రిప్టుపద్దతి మాదిరిగా కథ ను నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ద పడుతోంది. దీని మీద ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా చంద్రబాబు సర్కారు వెనుకంజ వేయటం లేదు. సర్వం సింగపూర్ మయంమాస్టర్ ప్లాన్ ఇప్పటికే తుది దశకు చేరుకొన్న దశలో అన్ని లావాదేవీలు ప్రభుత్వం నుంచి నేరుగా సింగపూర్‌సంస్థలతో జరుగుతున్నాయి. ఇందుకోసం మంత్రి నారాయణ అంబాసిడర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. సింగపూర్ కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపటం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వివరాలు మాట్లాడటం అన్నీ నారాయణ కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఇందుకు వీలుగా నారయణ, ఆయనతో పాటు నమ్మిన బంటు ల్లాంటి ఉన్నతాధికారులు తరచు సింగపూర్ వెళ్లి రావాలని నిర్ణయించారు. ఇందుకోసం మునిసిపల్ వ్యవహారాల శాఖ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. ఇతరులకు ప్రవేశం లేదుఈ మొత్తం వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి నారాయణ తీరు సీనియర్ మంత్రులకు మింగుడు పడటం లేదు. సీనియర్ ఉన్నతాధికారుల్ని కూడా పక్కన పెట్టేసి నిర్ణయాలు జరిగిపోతున్నాయి. సంబంధిత శాఖలకు సంబంధించి నిర్ణయాలు తీసుకొంటున్నప్పుడు లేదా సంబంధిత శాఖల వ్యవహారాల్ని పరిశీలిస్తున్నప్పుడు కూడా మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల వాదనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదన్న మాట వినిపిస్తోంది. రాజధాని పనుల వరకు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ మధ్యనే లావాదేవీలు మొత్తం జరుగుతున్నాయన్న గుసగుసలు ఉన్నాయి. దీంతో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో తల దూర్చటం లేదు. ఒక వేళ జరగరానిది ఏదైనా జరిగినా అప్పుడు ఆ ఇద్దరే చూసుకొంటారు అన్న ట్లుగా వ్యవహరిస్తున్నారు.