ఈ సారి మోసపోవటం ఉత్తరాంధ్ర వంతు

ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసగించేందుకు కొత్త అవకాశం పుట్టుకొని వచ్చింది. భావనపాడు పోర్టు పేరుతో చంద్రబాబు ఈ కొత్త టెక్నిక్ కు పని పెడుతున్నారు.


మొన్న తెలుగుదేశం జన చైతన్య యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు... అక్కడి వాళ్లను మభ్య పెట్టేందుకు లోతుగా ప్రయత్నించారు. భావనపాడు పోర్టు నిర్మాణానికి సహకరించి అంతా భూములు ఇవ్వాలని కోరారు. అలా ఇచ్చినట్లయితే ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆశలు చూపించారు. గతంలో అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన వారు ఎంతో ఎదిగిపోయారని, సంతోషంతో తులతూగుతున్నారని కోతలు కోశారు. భూములు ఇస్తే శ్రీకాకుళం జిల్లా ను ఎక్కడికో తీసుకెళ్లతామని ప్రగల్బాలు పలికారు.


వాస్తవానికి భావనాపాడు పోర్టు నిర్మాణంతో ఎన్ని అనర్థాలో అందరికీ తెలిసిందే. అక్కడ సముద్ర తీరంలో 149 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వాటిలో పెద్దది భావనపాడు. ఈ గ్రామాల ప్రజలందరికీ ప్రధాన వ్రత్తి చేపల వేట. పోర్టు నిర్మాణం అంటూ జరిగితే స్థానికులు చేపల వేటకు వెళ్లేందుకు వీలు కుదరదు. వేల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. ఇక్కడ జీడి, కొబ్బరి తోటలు అధికం. ఖరీఫ్ లో వరి పుష్కలంగా పండుతుంది. వేల ఎకరాల్లో రబీ సీజన్ లో జీడి ని సాగు చేస్తారు. పోర్టు పేరు చెప్పి ఈ పంట పొలాలన్నీ నాశనం అవుతాయి. పెద్ద ఎత్తున ఆహార దిగుబడి తగ్గిపోతుంది. పైగా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న కొబ్బరి చెట్లు, ఇతర పెద్ద చెట్లను నరికివేయటం ద్వారా తుపానులు వంటి ప్రక్రతి భీభత్సాల్ని అడ్డుకోవటం కుదరని పని అవుతుంది. దీంతో ఈ ప్రాంతం అంతా పర్యావరణ పరంగా తీవ్రంగా నష్టపోతుంది. పోర్టు ని తగినంత స్థలంలో నిర్మించుకొంటే ఎవరూ కాదనరు కానీ, ఈ పేరు చెప్పి వేల ఎకరాలు దోచుకోవటం మాత్రం నిజంగా సిక్కోలు వాసుల్ని మోసం చేయటమే అవుతుంది.


మరో వైపు రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి రాజధాని పేరు చెప్పి అక్కడ పచ్చటి పంట పొలాల్ని బలవంతంగా లాక్కొన్నారు. ఈ భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటి దాకా ఇవ్వనే లేదు.  దీంతో రైతులు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వ్యవసాయ కూలీలైతే ఉపాధి కోల్పోయి ఇతర జిల్లాలకు వలస వెళ్లిపోతున్నారు. అటు, రైతులు, కూలీల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశలు కల్పించారు. మొన్నటికి మొన్న ఉద్యోగాలు ఇవ్వటం లేదని అక్కడి విద్యావంతులు క్రీడా సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.


మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న ఈస్టు కోస్టు థర్మల్ ప్రాజెక్టు కోసం సంకల్పించిన భావనాపాడు పోర్టుపేరతో తెలుగు తమ్ముళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేల మంది సామాన్యుల్ని బలి చేస్తున్నారని అర్థం అవుతోంది. ముఖ్యంగా మత్స్యకారులు ఉపాధి కోల్పోయే పరిస్థితితో పాటు వేలాది ఎకరాల్లో పచ్చటి పంట పొలాలు నాశనం కాబోతున్నాయి. 

Back to Top