చంద్రబాబు.. ఆంధ్రా భజన్‌లాల్ అవుతారా?

1) ఆగస్టు 28,2012:
స్థలం: హైదరాబాద్
వ్యాఖ్య: బొగ్గు గనుల కేటాయింపును సీఏజీ తప్పు పట్టినందున ప్రధాని రాజీనామా చేయాలి.
2) సెప్టెంబర్ 6,2012
స్థలం: న్యూఢిల్లీ
వ్యాఖ్య: ప్రధాని రాజీనామా చేసినా ఒరిగేదేముంది.. ఆయన రాజీనామా చేయనక్కరలేదు.
సమయానుకూలంగా మాట్లాడడం, తారసపడిన వారిని ఉపయోగించుకోవడం, తన పనులు చేయించుకోవడం.. ఆ పై ఆ వైపే చూడకపోవడం  ఇవన్నీ ఓ వ్యక్తికి పెట్టని ఆభరణాలు.. ఎవరా అని అంత బుర్ర పగులగొట్టుకోవాల్సిన పనిలేదు. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట.. ఈయనకి అంతే. ఆయన అనుకున్నట్లుగా ఆ నాలుక అప్రయత్నంగా తిరిగిపోతుంది. ఇంతటి విశేష లక్షణం ఒక్క మన చంద్రబాబుకే ఉంది. పై రెండు స్టేట్‌మెంట్లు ఆయన చేసినవే. కేవలం 9 రోజుల వ్యవధిలో ఆయన అభిప్రాయం నెగటివ్ కాస్తా పాజిటివ్‌గా మారిపోయింది. 
ప్రధానిని కలిసిన ఆ ఐదు నిమిషాల్లో బాబు వైఖరే మారిపోయింది. కోల్ గేట్ స్కామ్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాల్సిందేనని ఈ నెల 28న పట్టుబట్టిన ఆయన తొమ్మిది రోజుల్లో 'ఏకాంత' సమావేశం తర్వాత అబ్బే అక్కర్లేదు. ఆయన రాజీనామాచేస్తే ఏ వస్తుందంటూ నవ్వుతూ తేల్చేశారు.
ఇంతలో ఇంత మార్పునకు కారణం ఏమై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.  ఎందుకిలా బాబు మారిపోయారో వారికి అంతుపట్టలేదు. బుర్రలు గోక్కుని, ఆయన చెప్పింది రాసుకుని వెళ్ళిపోయారు. దీనికి సమాధానం దొరకాలంటే కొన్నేళ్ళుగా చంద్రబాబు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలిస్తే చాలు. తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఆయన మహా ఇబ్బంది పడుతున్నారు. రెండు కళ్ళ సిద్ధాంతం అభాసుపాలై, అంతా ఆట పట్టించేశారు. అక్కడక్కడా రాళ్ళు కూడా విసిరారు. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా పరిస్థితి మారి, తెలంగాణపై నోరు మెదపడం మానేశారు.  
ఈ మధ్యనే మళ్ళీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేయాలని తెలుగుదేశం అధినేత ఉవ్విళ్ళూరడం మొదలుపెట్టారు. దానివల్ల కొంత కాకపోతే కొంత పరువు నిలబడుతుందేమోనని ఆయన ఆశిస్తున్నారు. ఎందుకైనా మంచిదని  ఢిల్లీ వెళ్ళినప్పుడు  ప్రధానిని కలిసినప్పుడు ఇదే అంశం ప్రస్తావించి ఉంటారనీ, ఆ నేపథ్యంలో వచ్చిన సమాధానంతో మనసు తేలిక పడి ఉంటుందనీ రాజకీయ పరిశీలకులు ఓ విశ్లేషణ చేశారు. అదే స్పీడుతో హైదరాబాద్ వచ్చిన ఆయన తెలంగాణ అంశంపై తన పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ఒప్పించే పనిలో పడ్డారనీ కూడా భావిస్తున్నారు.
మరికొందరు ఇంకొక వాదన చేస్తున్నారు.  అందుకో ఉదాహరణ కూడా ఇస్తున్నారు. 1990 దశకంలో హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్న భజన్‌లాల్ భారతీయ జనతా పార్టీకి చెందిన వారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు  ఆకర్షితులై మొత్తం పార్టీని అందులో కలిపేశారు. 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కడుదయనీయంగా ఉంది. నడిపించే నాయకుడు కరవై అల్లాడుతోంది. ఆదుకుంటాడనుకున్న చిరంజీవి, సంఖ్యాపరంగా తప్ప నాయకత్వ లక్షణాన్ని కనబరచలేడనే విషయం అధిష్ఠానానికి తేట తెల్లమైపోయింది.  ఈ క్రమంలో కొత్త నాయకుడి కోసం అన్వేషిస్తోంది. ఎలాగూ చంద్రబాబు కాంగ్రెసుకు పాతకాపే కాబట్టి, ఆయనకు గాలం వేస్తే మరో భజన్‌లాల్ కాకపోడనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. జూన్ ఉప ఎన్నికలలో నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాలలో చేసిన కుమ్మక్కు ప్రయోగాన్ని రాష్ట్రమంతా అమలుచేసి ప్రయోజనం పొందాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. 

Back to Top