అమరావతి: అమరావతి శంకుస్థాపన వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనస్సులో మాట బయట పెట్టేసుకొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు పడాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే అని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకొంటున్నారు. అప్పుడే పరిశ్రమలు తరలి వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని అంతా ఆశలు పెట్టుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బహిరంగ వేదిక మీద కలిసే అవకాశం దొరికినప్పుడు చంద్రబాబు దాన్ని సద్వినియోగం చేసుకొంటారని భావించారు.<br/>కానీ చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. పార్లమెంటు వేదికగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ గురించి ప్రస్తావించలేదు. హైదరాబాద్ దూరం కావటంతో 90 శాతం సాఫ్ట్ వేర్ పరిశ్రమలు, 70 శాతం మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లు కోల్పోవటం, తద్వారా ఉద్యోగ అవకాశాలు పోవటం గురించి ప్రస్తావించనే లేదు. వేల కో్ట్ల రూపాయిల ఆర్థిక లోటు గురించి నామ మాత్రంగా చెప్పనేలేదు.<br/>తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా ప్రత్యేక ప్యాకేజీ గురించి మాత్రం పదే పదే మనవి చేసుకొన్నారు. తెలంగాణకు హైదరాబాద్, కర్నాటక కు బెంగళూరు, తమిళనాడుకు చెన్నయ్ ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోయిందని బాధ పడిపోయారు. రాజధాని కట్టుకొనేందుకు సహకరించాలని మాత్రం చెప్పారు. ప్యాకేజీల విషయం మరిచిపోవద్దని మాత్రం చెప్పారు.