బినామీకి ముట్టిన నజరానాయేనా?

మంచికో చెడ్డకో వార్తల్లో కొనసాగడం ఓ కళ. మెగాస్టార్ చిరంజీవి ఆ కళలో ఆరితేరినట్లు కనిపిస్తోంది.తాజాగా భవానీద్వీపం లీజు వ్యవహారం పుణ్యమాని ఆయన మళ్లీ వార్తల్లోకొచ్చారు. 1340 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో ‘అభివృద్ధి’ పనులు చేయడానికి సంబంధించిన 30 ఏళ్ల లీజును మంత్రి గంటా శ్రీనివాసరావుకు కట్టబెట్టడంపై పది మాసాల కిందటే వివాదం చెలరేగింది. వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ సభ్యుడు ఈ విషయాన్ని లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లిన సంగతీ- గురువారం నాడు ఈ కేసు విచారణ నవంబర్ 16కు వాయిదా పడిన సంగతీ తెలిసిందే. కాగా, ఈ ద్వీపం అభివృద్ధి పనుల లీజు విషయంలో ఇంతవరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదని టూరిజం శాఖ న్యాయస్థానంలో ప్రకటించింది.కొణిదెల శివశంకరప్రసాద్ అనే చిరంజీవి ఏ ముహూర్తంలో రాజకీయ రంగంలో అడుగుపెట్టి, ప్రజారాజ్యం పార్టీ దుకాణం తెరిచారో యేమోగానీ ఆదినుంచీ హంసపాదాలే ఎదురవుతున్నాయి. మదర్ థెరిసా సూక్తులకూ, బొమ్మలకూ పేటెంట్ కొట్టేసి, రాత్రికి రాత్రే మెగాస్టార్ పదవినుంచి ముఖ్యమంత్రి గద్దె మీదికి గెంతెయ్యాలని చిరంజీవి కన్న కల ఘోరంగా చెదిరిపోయింది. 17 శాతం ఓట్లు సంపాదించుకున్నా 17 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పుట్టిన జిల్లాలో పోటీచేసి ఓడిపోయిన అపఖ్యాతి మూటకట్టుకోవలసి వచ్చింది. ఏ కాంగ్రెస్ వాళ్లనయితే, పంచెలూడదీసి కొట్టాలని తమ్ముడు పవన్ కళ్యాణ్ పబ్లిగ్గా దూషించాడో అదే కాంగ్రెస్ పంచన దప్పిక్కి చేరాల్సి వచ్చింది.
చిట్టచివరికి చిరంజీవి బినామీగా జనం చెప్పుకునే ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాసరావుకు విజయవాడ భవానీ ద్వీపం లీజు కట్టబెట్టడం గురించిన వివాదం కూడా ప్రజారాజ్యం అసంతృప్తివాదుల పుణ్యమానే రచ్చకెక్కింది. మొదట్లో ఇదేదో గంటా కుదుర్చుకున్న వ్యవహారమేనని మీడియాలో ఒకవర్గం ప్రచారం చేసింది. ఢిల్లీదాకా వెళ్లి బేరసారాల్లో తన అనుభవసారాన్ని రంగరించి మరీ కాంగ్రెస్-పీఆర్పీ డీల్ కుదిర్చిపెట్టినందుకు గంటాకే భవానీ ద్వీపం లీజు ఇప్పిస్తున్నట్లు ఆ వర్గం -ఎందుకో మరి- ప్రచారంలో పెట్టింది. కానీ పీఆర్పీ అసంతృప్తులు మరోసారి ఇంటిగుట్టు బయటపెట్టేశారు. సొంతపార్టీని కాంగ్రెస్ పార్టీకి గుండుగుత్తగా అమ్మేసుకోడానికి అంగీకరించినందుకు ‘టిప్’గానో, నజరానాగానో ఈ భవానీద్వీపం లీజు చిరంజీవికే దయచేయించడం జరిగిందని వాళ్లు వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేసుకుని, చేతికి చిక్కిన రాజ్యసభ సభ్యత్వాన్ని తనివితీరా అనుభవించడానికి వీల్లేకుండా ప్రత్యర్థి పక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. సోనియా మేడమ్ దయవల్ల త్వరలో తనకు దక్కుతుందని ఆశిస్తున్న కేంద్రమంత్రి పదవి గురించి కమ్మగా కల కనడానికి వీల్లేకుండా వైరిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తనను నమ్ముకున్నవారికి అమ్ముకున్న అసెంబ్లీ టిక్కెట్ల తాలూకు సొమ్మును ఏ రియల్ ఎస్టేట్ రంగంలోకో గుట్టుచప్పుడు కాకుండా తరలిద్దామని చేసిన ప్రయత్నాలు ఎన్నడో విఫలమయ్యాయి. తన బామ్మర్ది ఎవరెవరి దగ్గిర ఎంతెంత వసూలు చేసి, తన కమిషన్ పోను ఎంత సొమ్ము చిరంజీవికి అప్పజెప్పాడో ప్రజారాజ్యం పార్టీలోని అసంతృప్త వర్గాలే వెల్లడించి అల్లరిపెట్టాయి. సొంతపార్టీ మనుషులే అయినా, ఎవరికివ్వాల్సిన వాటాలు వాళ్లకిచ్చేసి ఉంటే పాపం మెగాస్టార్ ఇంతగా అల్లరి పాలయ్యేవాడు కాదు. అందుకే ఆహార వ్యవహారాల దగ్గిర అతి తెలివి పనికిరాదన్నారు.

Back to Top