ప్రత్యేకహోదాతో వచ్చే ప్రయోజనాలు..!

చంద్రబాబు కాలర్ పట్టి నిలదీయండి..!
తెలిసీ ఎందుకు చేస్తున్నావు చంద్రబాబు..?

గుంటూరుః  దీక్షాప్రాంగణం వద్దకు పోటెత్తిన ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ప్రత్యేకహోదా వల్ల కలిగే ప్రయోజనాల గురించి దీక్షా వేదికగా మరోసారి ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కితే కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా వస్తాయి. 10 శాతం మాత్రమే రుణం వస్తుందని వివరించారు. హోదా లేకపోతే గ్రాంటు 30 శాతమే అందుతుంది. రుణం 70 శాతం చెల్లించాల్సి వస్తుందని తెలియజేశారు. 

కాలర్ పట్టుకొని నిలదీయండి..!
అదేవిధంగా చట్టంలో పొందుపర్చిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, మెట్రో రైళ్లు, విశాఖ-చెన్నై కారిడార్ ల కోసం వేల కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం విదేశీ రుణం పొందాల్సి ఉంటుంది. అదే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఉంటే ఆభారమంతా కేంద్రమే బరిస్తుంది. వడ్డీలు కూడా కట్టక్కర్లేదు  హోదా లేకపోతే.. విదేశాల నుంచి తెచ్చే డబ్బులు, వడ్డీ కూడా మనమే కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని జగన్ అన్నారు. హోదా గురించి మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుసో లేదో తనకు తెలియదు . ఒకవేళ తెలిసి ఉంటే చంద్రబాబు కాలర్ పట్టుకొని ఎందుకు అడగడం లేదని జగన్ ప్రశ్నించారు. 

హోదాతో ఎంతో మేలు..!
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లోని  పరిశ్రమలకు రాయితీలు భారీగా వస్తాయి. 100 శాతం ఆదాయపన్ను, ఎక్సైజ్ డ్యూటీ, రవాణా ఖర్చులు అన్నీ మినహాయింపు ఉంటాయి. కరెంటు సగం ధరకే 20 ఏళ్ల పాటు లభ్యమవుతుంది. వస్తువుల ధరలు సగానికి సగం తగ్గుతాయి. భారీ ప్రోత్సాహకాలుంటే పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకువస్తారు. లక్షల కోట్ల పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని జగన్ తెలిపారు. బాబు ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తెస్తే.. పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయంటే అదీ చేయరని జగన్ విమర్శించారు.

కుంటి సాకులొద్దు..!
ప్రత్యేక హోదా వస్తే నో వేకెన్సీ బోర్డులు ఎక్కడా కనిపించవు. వాంటెడ్ బోర్డులే కనిపిస్తాయని జగన్ తెలిపారు. మనమే కంపెనీలను ఎంచుకోవచ్చన్నారు. ప్రత్యేకహోదాకు తమిళనాడు, ఒరిస్సాలు ఒప్పుకోవడం లేదని చంద్రబాబు మాట్లాడ్డం హాస్యాస్పదమన్నారు. విడగొట్టే రోజు ఆరాష్ట్రాలు లేవా అని చంద్రబాబును నిలదీశారు. 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని చెబుతారు. ప్రత్యేక హోదా అంశం నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్, నీతి ఆయోగ్, కేంద్ర మంత్రివర్గం పరిధిలోనిది. వీటన్నింటికీ ప్రధానమంత్రే అధ్యక్షుడు. కేంద్ర కేబినెట్ నిర్ణయమని తెలిసి కూడా చంద్రబాబు 19 నెలలుగా ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు.

హోదాతో లబ్ధి పొందిన రాష్ట్రాలు..!
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. తద్వారా ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. మన కంటే వెనకబడిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేకహోదా వల్ల 10 వేల పరిశ్రమలు వచ్చాయి. అలాంటిది 5 కోట్ల ప్రజానీకం గల 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుంది. ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకోసం ఎంతవరకైనా పోరాడేందుకు నేను సిద్ధమని జగన్ తేల్చిచెప్పారు. 
Back to Top