బాబు మేనేజ్ మెంట్ స్కిల్


మేనేజ్ చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన వాళ్లు ఈ రాష్ట్రంలో కాదు గ‌దా దేశంలోనే లేరు.  అక్ర‌మాలు చేసి అబ‌ద్ధాలు ఆడ‌టంలో, స్కాములు చేసి స్టేలు తెచ్చుకోవ‌డంలో, హామీలు ఇచ్చి హ‌డావిడి చేయ‌డంలో బాబు మేనేజ్ మెంట్ స్కిల్ 
బైట ప‌డుతుంటుంది. ఇప్పుడు ఉపాధి హామీ ప‌నుల అవ‌క‌త‌వ‌క‌లు క‌ప్పి పుచ్చేందుకు కూడా చంద్ర‌బాబు త‌న మేనేజ్ మెంట్ స్కిల్ నే ఉప‌యోగిస్తున్నాడు. 
ఉపాధిలేక వ‌ల‌స‌లు పోతున్న గ్రామీణ శ్ర‌మ‌జీవుల‌కోసం ఉంద్దేశించిన ఉపాధి హామీ ప‌థ‌కాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నీరుగారుస్తోంది. గ‌త నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఉపాధి ప‌నుల్లో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుంది. టిడిపి స్థానిక నేత‌లు, అధికారులు ఇందులో త‌మ వంతు పాత్ర పోషించారు. ఉపాధి ప‌నుల్లో జ‌రిగే అవినీతిని గురించి పెద్ద ఎత్తున్న విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో కేంద్రం ఓ త‌నిఖీ బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ఈ నెల 18 నుంచి 29 వ‌ర‌కూ 12రోజుల పాటు ఈ బృందంలోని న‌లుగురు స‌భ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి,  రికార్డుల‌ను ప‌రిశోధించి ఉపాధి ప‌థ‌కంలో జ‌రుగుతున్న లోపాలు, నిధుల వినియోగం గురించి ఆరా తీసి, నివేదిక‌ను త‌యారు చేస్తారు. అయితే గ‌త ఆరు రోజులుగా ఈ బృందం స‌భ్యులు కృష్ణా జిల్లా, గ‌న్న‌వ‌రం, నూజివీడు, మ‌చిలీప‌ట్నం వంటి ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. అధికారులు చేస్తున్న నిధుల దుర్వినియోగం, ఉపాధి ప‌నుల్లో జ‌రుగుతున్న మోసాల‌ను ఈ బృందం క్షుణ్ణంగా ప‌రిశీలించి తెలుసుకోవ‌డంతో కంగారు ప‌డ్డ చంద్ర‌బాబు స‌ర్కార్ అర్జంట్ గా త‌న మేనేజ్ మెంట్ మంత్రాన్ని ప్ర‌యోగించ‌డం మొద‌లెట్టింది. 
వ‌రుస‌గా ఆది సోమ‌వారాలు క్రిస్మ‌స్ శెల‌వు క‌లిసి రావ‌డంతో త‌నిఖీ బృందంలోని స‌భ్యుల‌ను ఖ‌రీదైన రిసార్టుల‌లో బ‌స చేయించి, వారికి రాచ మ‌ర్యాద‌లు చేయ‌డం మొద‌లు పెట్టింది. వారిని సంతోష పెట్టే ప‌నిలో రాష్ట్రంలోని పై స్థాయి అధికారులు పూర్తిగా మునిగిపోయిన‌ట్టు స‌మాచారం. 


ఎందుకంత కంగారు

త‌నిఖీ బృందాన్ని అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ- అంత‌గా ప్ర‌త్యేకంగా చూసుకోవ‌డానికి గ‌ల కార‌ణం ఏమిటి అంటే ఉపాధి ప‌నుల్లో జ‌రుగుతున్న అన్యాయాలు, అక్ర‌మాల గురించి వాస్తవ నివేదిక కేంద్రానికి వెళితే ఆ శాఖా మంత్రి గా ఉన్న లోకేష్ కు చెడ్డ పేరు వ‌స్తుంద‌నే భ‌య‌మే అని అంటున్నారు అధికారులు. పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్న లోకేష్ పై నెగిటివ్ ప్ర‌చారం పైదాకా వెళ్ల‌కూడ‌ద‌నే త‌నిఖీ బృందాన్ని ఇలా మేనేజ్ చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.
 
ఉపాధి ప‌నుల్లో అక్ర‌మాలు

రాష్ట్రంలో ఉపాధి ప‌నుల నిమిత్తం కేంద్ర ప్ర‌భుత్వం గ‌త రెండేళ్ల‌లో 11,812కోట్లు నిధులు విడుద‌ల చేసింది. అయితే అందులో స‌గానికిపైగా నిధులు దారిమ‌ళ్లాయి. సుమారు 5,682కోట్లు  సిమెంటు రోడ్ల మెటీరియ‌ల్ పేరిటి వినియోగించారు. ఇక మిగిలిని నిధులైనా ఉపాధి కూలీల‌కు పూర్తిగా అందాయా అంటే అదీ లేదు. అందులో 1165కోట్లు పంట కుంట‌ల నిర్మాణం చేసిన‌ట్టు ప్ర‌భుత్వ లెక్క‌లు చెబుతున్నాయి. కానీ కేంద్ర త‌నిఖీ బృందం క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌ల్లో తెలిసిన విష‌యం ఏమిటంటే ప్రొక్లేన్ల‌తో త‌క్కువ ఖ‌ర్చుతో పంట కుంట‌ల‌ను త‌వ్వించి, ఉపాధి కూలీల‌తో ప‌నులు చేయించిన‌ట్టు దొంగ బిల్లులు పెట్టి డ‌బ్బులు వ‌సూలు చేసుకున్నార‌ని. నిజానికి ఉపాధి ప‌నుల్లో యంత్రాల వాడ‌కం చేయ‌కూడ‌దు. కాని స్థానిక టిడిపి నేత‌లు త‌మ‌కు తెలిసిన కూలీల పేరుతో బిల్లులు పెట్టుకుని పంచుకున్న‌ట్టు గ్రామాల్లో మిగిలిన కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ విష‌యాన్ని వైయస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు ప్ర‌జ‌ల దృష్టికి తీసుకువ‌చ్చింది. ప్ర‌భుత్వానికి తెలియ‌జేసింది. కాని తెలుగు త‌మ్ముళ్ల‌ను చంద్ర‌బాబు వారించే ప‌రిస్థితేలేదు. పంచాయతీరాజ్ శాఖ  మంత్రిగా ఉన్న లోకేష్ కు సైతం ఈ వ్య‌వ‌హారంలో ముడుపులు అందిన‌ట్టు అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.

కేంద్రం నిధులతో అధికారుల‌కు ఆడంబ‌రాలు

ఏడు శాతాన్ని మించి ఉప‌యోగించ కూడ‌ని ప‌రిపాల‌నా నిధుల‌ను 11 శాతం వ‌ర‌కూ ఖ‌ర్చు చేసిన అధికార గ‌ణానికి చంద్ర‌బాబే ఆద‌ర్శం. కోట్లాది రూపాయిల ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేసే ముఖ్య‌మంత్రి ఉండ‌గా, అధికారులు మాత్రం ప్ర‌జా ప్ర‌యోజ‌న కార్య‌క్ర‌మాలు ఎలా చేస్తారు. ఆయ‌న బాట‌లోనే నిధుల‌ను అవ‌స‌రాల‌కోసం కాకుండా ఆర్భాటాల‌కు కార్ల కొనుగోళ్ల‌కు ఉప‌యోగించిన‌ట్టు త‌నిఖీ బృందం ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంది. ప్ర‌భుత్వాధికారుల‌కు నెల‌వారి ఇచ్చే జీతాల‌కు కూడా ఉపాధి నిధుల‌ను వాడేసిన‌ట్టు తెలిసింది. చివ‌ర‌కు ప్ర‌భుత్వ శాఖ‌లో స్టేష‌న‌రీ ఖ‌ర్చులు, అద్దె కార్ల‌కు చెల్లింపులు కూడా ఉపాధి నిధుల నుంచే చెల్లిస్తున్నట్టు రికార్డుల త‌నిఖీలో తేలింది. 
కోట్ల‌తో సెల్ ఫోన్ల కొనుగోళ్లు
కేంద్రం విడుద‌ల చేసిన నిధుల‌ను స‌కాలంలో ఉపాధి హామీ ప‌థ‌కానికి ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేయాలి. ఈ బాధ్య‌త ఆర్థిక శాఖ‌దే. ఇది స‌క్ర‌మంగా జ‌రుగుతోందో లేదో ప‌రిశీలించింది కేంద్ర బృదం. ఉపాధి నిధుల నుంచి 9కోట్లు ఒక‌సారి, 10 కోట్లు ఒక‌సారి సెల్ ఫోన్ల కొనుగోలుకు ఉప‌యోగించిన‌ట్టు బిల్లులు చెబుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వెంట‌వెంట‌నే ఫోన్ల కొనుగోళ్లు ఎందుకు జ‌రిపార‌ని క‌మిటీ స‌భ్యులు అధికారుల‌ను ప్ర‌శ్నించి ఆరా తీసారు. 
ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం పై జ‌రుగుతున్న ఈ విచార‌ణ త‌ర్వాత త‌నిఖీ బృందం త‌మ నివేదిక‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ‌కు అంద‌జేస్తుంది. వాస్త‌వ‌లతో ఈ నివేదిక కేంద్రానికి వెళితే, ఈ అవినీతిపై రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని వివ‌ర‌ణ కోర‌డం జ‌రుగుతుంది. అందుకు బాధ్యులైన వారి పేర్ల‌ను బ‌య‌ట పెట్టాల్సి వ‌స్తుంది. అందుకే చంద్ర‌బాబు స‌ర్కార్ త‌మ‌కు వ్య‌తిరేకంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ‌కు నివేదిక వెళ్ల‌కుండా త‌నిఖీ అధికారుల‌ను అతిథి మ‌ర్యాద‌ల‌తో మెప్పించాల‌ని చూస్తోంది. మునుపు పోల‌వ‌రంపై వేసిన క‌మిటీ కూడా ప్రాజెక్టులో అవినీతి గురించి, చంద్ర‌బాబు అబ‌ద్ధాల గురించి కేంద్రానికి ఉన్న‌దున్న‌ట్టు రిపోర్టు చేసిన నేప‌ధ్యంలో, ఉపాధిప‌నుల‌పై వేసిన క‌మిటీ ఎలాంటి రిపోర్టు కేంద్రానికి పంపుతుందో అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.  ఈ ద‌ర్యాప్తు బృందాన్ని బాబు ఎలా మేనేజ్ చేస్తాడో అని  ప్ర‌జ‌లూ ఎదురు చూస్తున్నారు.

Back to Top