వైయస్ఆర్‌సిపి విధానం సమైక్యమే

హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనే ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీఓఎం) వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ బలీయంగా వ్యతిరేకిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు‌ డాక్టర్ ఎం‌వీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు ఆదివారంనాడు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకునే వారందరూ జీఓఎంను గుర్తించకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జీఓఎంను వ్యతిరేకించడంతో పాటు విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్. సురేష్‌ కుమార్‌కు పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రాసిన లేఖను వారు ఈ సందర్భంగా విడుదల చేశారు.

రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలపై సలహాలు, సూచనలు చేయాలంటూ 2013 అక్టోబర్ 30న హోంశాఖ నుంచి వచ్చిన లేఖకు సమాధానంగా‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఈ లేఖ రాశారని కొణతాల, మైసూరా తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ తొలి నుంచీ కోరుతోందన్నారు. కేంద్రం జీఓఎంను ఏర్పాటు చేయడం, సలహాలు కోరుతూ రాజకీయ పార్టీలకు లేఖలు రాయడాన్ని విభజన ప్రక్రియలో మరో ముందడుగుగా తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. అందుకే జీఓఎంను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులందరూ పైకి ఒకలా మాట్లాడుతూ లోపాయికారీగా విభజనకు సహకరిస్తున్నారని కొణతాల, మైసూరా ధ్వజమెత్తారు. కిరణ్, బాబు.. ఇద్దరూ సోనియా గాంధీ నిర్ణయాన్ని బలపరుస్తూ విభజనకు దోహదం చేస్తున్నారన్నారు. విభజన విషయంలో అఖిలపక్షం వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారని, ఆయన మాట మేరకు కేంద్రం ఇప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేయ సంకల్పించిందని తెలిపారు.

‌ముఖ్యమంత్రి హోదాలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఇదే ఆఖరి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అవుతుందేమోనని చెప్పడం దురదృష్టకర‌ం అని కొణతాల, మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించకుండా పోరాటం సాగిస్తామని ఒక వైపున చెబుతూనే మరో వైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ మాత్రమే విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని, ఈ పోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారా? అన్న ప్రశ్నకు.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మైసూరారెడ్డి చెప్పారు. తాము ఎక్కడికి వెళ్లినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కోరతామని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

అయ్యా,
ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన వివిధ సమస్యలపై మా పార్టీ సలహాలు, సూచనలు కోరుతూ 2013 అక్టోబ‌ర్ 30వ తేదీన మీరు లేఖ రాశారు. ఆంధ్రప్రదే‌శ్‌ను విభజించడానికి జరిగే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా వ్యతిరేకించాలనేది మా పార్టీ విధానం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. అందువల్ల రాష్ట్ర విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నా‌న్ని అయినా మా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కేంద్ర మంత్రివర్గం 2013 అక్టోబర్ 3వ తేదీన తీసుకున్న నిర్ణయం మాకు ఏమాత్రం సమ్మతం కాదు.

రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు గత మూడు నెలలుగా విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ రోడ్లపై ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా, వాస్తవాన్ని విస్మరించి విభజన అనే దారుణమైన అన్యాయానికి ఒడిగట్టడానికే సిద్ధమై‌ ముందుకు వెళుతోంది. కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) ఏర్పాటైంది కూడా రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్దేశంతోనే కనుక దానిని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం.

ఈ నేపథ్యంలో సువిశాల ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం.

కృతజ్ఞతలతో...
                                    మీ


వైయస్ జగన్మోహన్‌రెడ్డి, అధ్యక్షుడు, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ

Back to Top