హైదరాబాద్, 28 నవంబర్ 2012: రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను తీసేయాలని చూస్తే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని పార్టీ ఎమ్మెల్యే, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు జి. శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్‌పై రెండో ఆలోచన చేసినా తమ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామన్నారు. అపర భగీరథుడు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఒక పక్కన ఒక్కొక్కటిగా నీరుగారుస్తూ మరో వైపున తమ పాలన అద్భుతంగా ఉందని ఎలా చెప్పుకోగలుగుతారని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.
మహానేత వైయస్ కష్టంతో అధికారంలోకి వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు ప్రజల కష్టాలను పట్టించుకోవడంలేదని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన రైతులను అష్టకష్టాలు పెడుతున్న కిరణ్ ప్రభుత్వం తామేదో సాధించినట్లు ప్రచారం చేసుకోవడం సబబు కాదని ఎద్దేవా చేశారు. 2004 సంత్సరానికి ముందు నానా ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఏదో విధంగా ఆదుకోవాలని, వారు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి వైయస్ వ్యవసాయాన్ని పూర్తిగా విడిచిపెట్టే యోచనలో ఉన్న రైతులకు భరోసా కల్పించిన వ్యక్తి వైయస్ అన్నారు. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 13 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయించారని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతులకు చేయూతనిచ్చిన మహనీయుడు వైయస్ అన్నారు.
తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని, కిలో రెండు రూపాయల బియ్యాన్నికి ఒక్కో కుటుంబానికి 30 కేజీల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి వైయస్ అధికారంలోకి తీసుకువచ్చారని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అప్పట్లో తాను ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటిని కూడా అమలు చేసి ప్రజల చేత శెభాష్ అనిపించుకున్నారన్నారు. వైయస్ అమలు చేసిన పథకాల కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రెండో సారి కూడా అధికారం అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ఆయన అమలు చేసిన పథకాలు ఒక్కొక్కటీ తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని, సర్‌చార్జీలు వేసేందుకు సిద్ధమవుతోందని, ఆరోగ్యశ్రీని మంచం ఎక్కించిందని, ఫీజు రీయింబర్సుమెంట్‌ను తగ్గిస్తోందని ఇలా చేస్తూ తమ పాలన బ్రహ్మాండంగా ఉందని ఎలా చెప్పుకుంటారని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. వైయస్ అమలు చేసిన అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా అమలు చేసేందుకు ముందుకు వస్తుంటే మన పాలకులు వాటికి తిలోదకాలు ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మహానేత హయాంలో ఫోన్ చేసిన పది నిమిషాల్లో వచ్చే 108 లో ఇప్పటి పాలకులు తమ ఫోటోలను మార్చుకోవడానికే తపన పడుతున్నారని, మెరుగైన సేవలు అందించడంలేదని ఆరోపించారు.మహానేత వైయస్ ఉచిత విద్యుత్‌ను అమలు చేసిన కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు రెట్టింపు అయ్యాయని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అయితే, కిరణ్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కేసే విధంగా 3 హార్సు పవర్ సామర్ధ్యం ఉన్న మోటార్లకు మాత్రమే సరఫరా చేస్తామంటూ నిస్సిగ్గుగా ఆలోచన చేస్తోందని దుయ్యబట్టారు. భూగర్భ జలాలు అడుగంటిపోయిన ఈ తరుణంలో అత్యధిక శాతం మంది రైతులు 3 హార్సు పవర్ కంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న మోటార్లనే వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆలోచన రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టాలన్న దురాలోచన చేస్తోందని నిప్పులు చెరిగారు. ఒకవేళ కిరణ్ సర్కార్ ఈ దుర్నీతికి తెరతీస్తే వైయస్‌ఆర్‌సిపి చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. అన్నదాత సంక్షేమం కోసం ఎంతటి పోరాటమైనా తామంతా చేస్తామన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెగనాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి, దాని అధినేత చంద్రబాబు నాయుడు గత మూడేళ్ళుగా చోద్యం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయన కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రైతుల కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నో పోరాటాలు, నిరశన దీక్షలు చేసిన విషయాన్ని శ్రీకాంత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు, ఉచిత సౌకర్యాలు ప్రజలకు అందకుండా చేయాలని చంద్రబాబునాయుడు తన 'మనసులో మాట' పుస్తకంలో రాసుకున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడి ఆలోచనలకు అనుగుణంగానే పరిపాలన కొనసాగిస్తోందని దుయ్యబట్టారు.
ప్రజల కోసం ఉద్యమిస్తున్ జగన్‌ను జైలులో పెట్టి కాంగ్రెస్, టిడిపిలు రాక్షసానందం పొందుతున్నాయని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలకూ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. అపర భగీరథుడంటే వైయస్ రాజశేఖరరెడ్డే అన్నారు. ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వం రెండో నిర్ణయం తీసుకోకూడదని వైయస్‌ఆర్ సిపి డిమాండ్ చేస్తోందన్నారు.వచ్చే ఐదేళ్ళలో ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారమూ వేయబోమని దివంగత వైయస్ హామీ ఇచ్చారని, అయితే, ఆ హామీని కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు శ్రీకాంత్‌రెడ్డి జవాబు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపుతోందని అన్నారు. అసమర్థ ప్రభుత్వంపై బలం ఉన్న పార్టీ అవిశ్వాసం పెడితే సీరియస్‌గా ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అసలు అసెంబ్లీ సమావేశాలు రగడమే కాంగ్రెస్, టిడిపిలకు ఇష్టం లేదన్నారు. తెలంగాణకు వైయస్ అన్యాయం చేశారంటే ఎవరూ ఒప్పుకోరని మరో విలేకరి ప్రశ్నకు శ్రీకాంత్‌రెడ్డి బదులిచ్చారు.