వైయస్‌ను విస్మరించిన ప్రభుత్వం

హైదరాబాద్, 7 జూలై 2013:

స్వర్గీయ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 64వ జయంతిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తెలిపారు. రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని, ఆయన మరణించిన తరువాత రాష్ట్రంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను చూస్తున్న అభిమానులు, పార్టీ శ్రేణులు, మేధావులు, ప్రజలు మహానేత జయంతి వేడుకలను ఊరూ వాడా ఘనంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. వైయస్‌ఆర్ రెక్కల కష్టంతో అధికా‌రాన్ని అనుభవిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆయననే మరిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి గురించి ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం అన్నారు. ఆయన మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని జూపూడి డిమాండ్ చేశారు.

‌మహానేత వైయస్‌ఆర్‌ పరిపాలించిన ఐదేళ్ళ మూడు నెలల కాలంలో ఆయన తీసుకున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, తన 35 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏర్పడిన అవగాహనతో ప్రతి మనిషి అవసరాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా వైయస్‌ఆర్ పథకాలు రూపొందించారన్నారు.‌ వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో సోమవారం జరగాల్సిన పార్టీ రెండవ ప్లీనరీలోనే మహానేత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. అయితే పంచాయతీ ఎన్నికల కారణంగా ప్లీనరీ వాయిదా పడిందని తెలిపారు. మహానేత ఆలోచనలను కొనసాగించే బాధ్యతను తీసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజశేఖరరెడ్డి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందని జూపూడి తెలిపారు.

చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలోని శూన్య ప్రభుత్వాల మధ్య మహానేత వైయస్‌ మనకు ఒక సువర్ణయుగాన్ని అందించారన్నారు. ఆయన హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, మనిషిని సమాజాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారని జూపూడి చెప్పారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని వేడుక వాతావరణంలో రెండవ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచీ అభిమానులను ఆహ్వానించి, ప్రజాహిత ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి విధానాలు అవలంబించాలన్నది నిర్ణయించాలనుకున్నామన్నారు.

అయితే.. ప్లీనరీని జరగనివ్వకుండా.. లేదా మహానేత జయంతిని జరగనివ్వకుండా అనివార్యంగా పంచాయతీ ఎన్నికలను ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని జూపూడి ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలెవరూ కూడా రాజశేఖరరెడ్డి జయంతి గురించి మాట్లాడడంలేదని ఆయన విమర్శించారు.‌ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిర్దేశకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బాధించడమే తప్ప ప్రజా రంజకమైన పాలనను అందించడంలో విఫలమవుతోందని ఆరోపించారు.

రాజశేఖరరెడ్డి ఆలోచనలను ప్రజల నుంచి తుడిచేయాలని ఎంతగా ప్రయత్నించినా, ఆయన ఆలోచనలతోనే పుట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఎన్ని కష్టాలు పెట్టాలనుకున్నా, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని అక్రమంగా జైలులో పెట్టినా తమ పార్టీ మళ్ళీ మళ్ళీ ప్రజల కోసమే అంకితం అవుతుందని, ప్రజల కోసం పనిచేస్తుందని జూపూడి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాజశేఖరరెడ్డి చూపించిన మార్గాలనే తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

Back to Top