సమైక్యానికి రాష్ట్రాల మద్దతు కూడగడతా

హైదరాబాద్, 8 నవంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి దేశంలోని అన్ని ముఖ్య రాష్ట్రాల మద్దతు కూడగడతానని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకూ ఆయా రాష్ట్రాలు, ఢిల్లీలోనూ తాను సమైక్య యాత్ర చేస్తానన్నారు. లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జీఓఎం భేటీకి ఆహ్వానం శుక్రవారమే అందిందని, 13వ తేదీన జీఓఎం సమావేశానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డిని పంపిస్తామని, సమైక్య వాదాన్ని గట్టిగా వినిపిస్తామని స్పష్టం చేశారు. దేశంలో హిందీ తర్వాత రెండవ అతి పెద్ద జాతిగా ఉన్న తెలుగువారం విచ్ఛిన్నమైతే ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. రూ.1.75 లక్షల కోట్ల బడ్జెట్‌తో దేశంలో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొడితే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి ప్రతి ముఖ్యమైన రాష్ట్రానికీ వెళ్లి.. అక్కడి రాజకీయ పక్షాలన్నింటినీ కలుస్తానని చెప్పారు. బీజేపీ సహా అన్ని ముఖ్య పార్టీలనూ కలిసి రాష్ట్ర విభజనపై వారి వైఖరిని మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. కమ్యూనిస్టు పార్టీలను కూడా తమకు సహకరించాలని కోరతానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ వివరిస్తానన్నారు. ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే.. వ్యతిరేకించకపోతే.. రేపు మీ రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే అన్యాయం జరగవచ్చని, స్పందించమని విజ్ఞప్తి చేస్తానన్నారు.

ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య పర్యటన చేస్తానని శ్రీ జగన్‌ తెలిపారు. ఏయే ప్రాంతాల్లో పర్యటించేది ఆ వివరాలను పార్టీ నాయకులు తర్వాత వెల్లడిస్తారని తెలిపారు. తెలంగాణలో కూడా కచ్చితంగా పర్యటన కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమైక్యాన్ని చాటుతూనే ఓదార్పు కుటుంబాలను పరామర్శిస్తూ పర్యటన సాగుతుందని వెల్లడించారు.

గ్రామ సభల ద్వారా దాదాపు 9,368 తీర్మానాలు చేసి ప్రధానికి, జీఓఎంకు పంపిన పంచాయతీ సర్పంచ్‌లకు శ్రీ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అరెస్టులకు భయపడకుండా, పోలీసు జులుంను తట్టుకుంటూ సమైక్యాంధ్ర కోసం 48 గంటల పాటు రహదారులను దిగ్బంధించిన వేల మంది కార్యకర్తలకు పేరుపేరునా చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన అన్ని వర్గాలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన అన్ని వర్గాలు, ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పారు.

నిమిషాల్లోనే పరిష్కారాలా? :

రాష్ట్ర విభజనపై రక రకాల నివేదికలంటూ పత్రికల్లో వచ్చిన వైనాన్ని చూశామని శ్రీ జగన్‌ అన్నారు. కేంద్రం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందన్నారు. ఓట్లు, సీట్లు మాక్కావాలి.. వాటి కోసం మీ నెత్తిన ఏదో వేసేస్తాం ఆ తరువాత మీ చావు మీరు చావండి అన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. వారం తిరక్క ముందే విభజనపై నిమిషాల్లో పరిష్కారాలు చూపడం దారుణం అన్నారు.  కేంద్ర మంత్రులు రోజుకో నివేదిక, రోజుకో లీక్ చేస్తున్న‌ వైనాన్ని పత్రికల్లో చూస్తూనే ఉన్నామని శ్రీ జగన్‌ అన్నారు. నీటి విభజనపై కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ నివేదిక హాస్యాస్పదం అన్నారు. జల వనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఒక మండలి పెడతారట.. దానిలో రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులుంటారట.. రెండు రాష్ట్రాల సెక్రటరీలు కూడా ఉంటారట.. ఆ మండలి కింద బోర్డులు వేస్తారట.. మన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా మండలి పెడతారట.. దేశంలోని 28 రాష్ట్రాల్లో లేనిది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు మండలి వేస్తారని శ్రీ జగన్‌ సూటిగా ప్రశ్నించారు.

సమైక్యంగా ఉంటేనే కృష్ణా, గోదావరి నదుల నుంచి ఎగువ రాష్ట్రాలు మన రాష్ట్రానికి నీళ్ళు రానివ్వని పరిస్థితి ఉందని ఆయన ప్రస్తావించారు. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండిన తరువాత మాత్రమే నీళ్ళు వదిలే పరిస్థితి ఉందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కే మండలి అని.. పైనున్న మహారాష్ట్ర, కర్నాటకలలో మండలి పెట్టి మన రాష్ట్రానికి ఎందుకు సరిగా నీళ్ళు ఇవ్వరని శ్రీ జగన్‌ ప్రశ్నించారు. బోర్డులు, ట్రిబ్యునళ్ళు ఉన్నా మహారాష్ట్ర, కర్నాటక దయతలిస్తే తప్ప కిందికి నీళ్ళు వదిలే పరిస్థితి లేదన్నారు. ఇది చాలదన్నట్లు మన రాష్ట్రానికి మాత్రమే మండలట.. దాని కింద బోర్డులట అని ఎద్దేవా చేశారు. మిగులు జలాలపై ఆధారపడి మనం కట్టుకునే ప్రాజెక్టులన్నీ పూర్తిగా శూన్యం అన్నమాట అన్నారు. పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు.. అన్ని విధాలుగా నీళ్ళు వాడుకోవచ్చు.. మన రాష్ట్రం మాత్రం మండలి ఆధీనంలో పనిచేయాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం పూర్తిగా ఎడారి అయిపోతున్నా రైతన్న చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. వీళ్ళు ఇస్తున్న లీకులు చూస్తుంటే.. గుండె తరుక్కుపోతోందని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

కనీ వినీ ఎరుగని విధంగా రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్రీ జగన్‌విచారం వ్యక్తంచేశారు. ఏ రాష్ట్రంలో అయినా అధికారం తమకు రాదని భావించినప్పుడు 272 స్థానాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి శ్రీకారం చుడుతున్నదన్నారు. ఈ అడ్డగోలు విభజన ఒక్క ఆంధ్ర రాష్ట్రంతోనే ఆగిపోదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉంటే అక్కడల్లా విడగొడతారన్నారు.

విభజన లేఖ వెనక్కి తీసుకో బాబూ :
చంద్రబాబు నాయుడు గారూ ఇప్పటికైనా మించిపోయింది లేదని శ్రీ జగన్‌ అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండని పిలుపునిచ్చారు. సమైక్యానికి అనుకూలంగా లేఖ ఇవ్వండన్నారు.. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఇప్పటికైనా వెనక్కి తీసుకోండని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏకం కావాలన్నారు. రాష్ట్రం ఒక్కటైతేనే విభజనను ఆపగలుతాం అన్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, నష్టపోయే పరిస్థితి ఉంది.. ప్రజలను మోసం చేయవద్దని సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్సే జూపూడి ప్రభాకరరావు, సీజీసీ సభ్యుడు దాడి వీరభద్రరావు, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పాల్గొన్నారు.

Back to Top