19 నుంచి విజయమ్మ ఆమరణ దీక్ష

హైదరాబాద్, 14 ఆగస్టు 2013:

న్యాయం చేయలేనప్పుడు, ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19 నుంచి విజయవాడలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి ఈ విషయం ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యం అయ్యేలా పరిష్కారం చూడాలని కేంద్రానికి తాము మొదటి నుంచీ చెబుతున్నామని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఆ దిశలో ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదని మైసూరారెడ్డి విమర్శించారు.‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏకపక్షంగా, నిరంకుశంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించాలంటే ప్రాతిపదిక, హేతుబద్ధత ఉండాలని అన్నారు.‌ కానీ రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విభజించాలనే కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మద్దాల రాజేశ్‌ కూడా పాల్గొన్నారు.

ఏ కోణంలో చూసినా ఒక ప్రాంతంలోని సీట్ల కోసం మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకున్నదనిపిస్తోందని మైసూరారెడ్డి ఆరోపించారు. గతంలో రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ ప్రభుత్వమే వేసిన శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సుల గురించి పార్లమెంటులో ఎప్పుడూ కూడా చర్చించిన పాపాన పోలేదని మైసూరారెడ్డి తెలిపారు. ఆ సిఫార్సులు ఈ ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు కూడా కనిపించడం లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీ తరఫున హైపవర్‌ కమిటీని ఎఐసిసి వేసిందని, ఇతర పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఆ కమిటిని ఏ విధంగా సంప్రదిస్తారని మైసూరా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు మాత్రమే ఆ కమిటీతో మాట్లాడుకోవచ్చట. అది కూడా పిసిసి అధ్యక్షుడు ఎవరికి అపాయింట్‌ ఇమ్మంటే వారికి మాత్రమే ఇస్తారట అని ఎద్దేవా చేశారు.

రాజధాని గురించి, రాజ్యాంగపరమైన చిక్కుల గురించి కాంగ్రెస్‌ పార్టీ ఆలోచన చేసినట్లు లేదని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఇరు ప్రాంతాలకు హైదరాబాద్‌ను పది సంవత్సరాలు రాజధానిగా ఉంచితే పరిపాలన ఏ విధంగా సాధ్యమవుతుందన్న ఇంగితజ్ఞానం కూడా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు లేకపోవడం దారుణం అన్నారు. నదీజలాల పంపిణీ సమస్య చాలా చిక్కుతో కూడుకున్నదన్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా కాంగ్రెస్‌ పార్టీ ఒంటెత్తు పోకడలు పోతోందని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. విభజన అందరితోనూ చర్చించాల్సిన సమస్య అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ మాటలు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఒక మీడియా ప్రతినిధి అడిగినప్పుడు మైసూరా వ్యాఖ్యానించారు. దిగ్విజయ్‌సింగ్‌ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంటోనీ కమిటీ ముందుకు తమ పార్టీ వెళ్ళే ప్రసక్తే లేదని మరో ప్రశ్నకు ఆయన స్పష్టంచేశారు.

తాజా ఫోటోలు

Back to Top