<strong>హైదరాబాద్, 12 డిసెంబర్ 2012</strong>: ప్రముఖ సితార్ విద్వాంసుడు, భారతరత్న పండిట్ రవిశంకర్ మృతి పట్ల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పండిట్ రవిశంకర్ మూడుసార్లు గ్రామీ అవార్డులు అందుకున్నారని, దేశంలోని అత్యున్నత పురస్కారం 'భారత రత్న'తో మన ప్రభుత్వం సత్కరించిందని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. రవిశంకర్ తనదైన ముద్రతో, సృజనాత్మకతతో భారతీయ శాస్త్రీయ సంగీతంతో పాశ్యాత్య ప్రపంచాన్ని కూడా మంత్రముగ్ధం చేశారని శ్రీమతి విజయమ్మ బుధవారం ఒక ప్రకటనలో నివాళులు అర్పించారు.<br/>పండిట్ రవిశంకర్ (92) శ్వాస సంబంధ సమస్యతో అమెరికాలోని సాన్ డియాగోలో మంగళవారం కన్నుమూశారు.<br/>హిందుస్తానీ సంగీతానికి పండిట్ రవిశంకర్ ఎనలేని కీర్తిని సముపార్జించిపెట్టారని తన ప్రకటనలో శ్రీమతి విజయమ్మ శ్లాఘించారు. భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయం చేసిన ఘనత రవిశంకర్‌కే దక్కుతుందని ఆమె కొనియాడారు. పండిట్ రవిశంకర్ ఒక సంగీత మేరు శిఖరం అని, ఆయన లేని లోటు తీర్చలేనిది అనీ శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు.<br/>పండిట్ రవిశంకర్ మరణంతో సంగీత ప్రపంచం ఒక స్వర సమ్రాట్టును కోల్పోయిందని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. రవిశంకర్ కుటుంబ సభ్యులకు శ్రీమతి విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.