సంక్షేమ పథకాలకు పేదరికమే ప్రామాణికం

పెన్షన్లు రికార్డు స్థాయిలో అందజేశాం

ప్రజల కోసం చిత్తశుద్ధితో సీఎం పనిచేస్తున్నారు

నా రాజకీయ జీవితంలో వైయస్‌ జగన్‌ లాంటి సీఎంను చూడలేదు

దరఖాస్తు చేసుకున్న అర్హులకు 5 రోజుల్లో పింఛన్‌ అందిస్తాం

పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సచివాలయం: పేదరికమే ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రికార్డు స్థాయిలో అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేశామన్నారు. నా రాజకీయ అనుభవంలో వైయస్‌ జగన్‌ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని, మూడు రోజుల్లోనే పెన్షన్లు ఇంటింటికీ డోర్‌ డెలవరీ చేయించారన్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలా పెన్షన్లు అందించలేదన్నారు. 3వ తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మొత్తం కలిపి 94.44 శాతం అంటే 50,50,194 మందికి పెన్షన్లు అందజేశామన్నారు. మిగిలిన వారికి రెండ్రోజుల్లో అందజేస్తామన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే మంజూరు చేస్తామన్నారు.

సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పెన్షన్‌కు అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ అర్హత మేరకు పెన్షన్‌ 5 రోజుల్లో మంజూరు చేయడం జరుగుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకొని పెన్షన్లు మంజూరు చేశారు. అది కూడా ఏదో కొద్దో గొప్పో మాత్రమే. ఇప్పుడు అర్హుత గల వారందరికీ పెన్షన్‌ ఇస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పెన్షన్‌ ఇస్తాం. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

3వ తేదీ నాటికి 94.44 శాతం అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ అన్నీ కలిపి 50,50,194 మందికి పెన్షన్లు ఇచ్చేశాం. మిగిలిన అర్హులకు కూడా రెండ్రోజుల్లో పూర్తి చేసి వందశాతం పూర్తిచేస్తాం. నా రాజకీయ అనుభవంలో ఈ విధంగా పెన్షన్లు ఒక్కసారిగా ఇచ్చిన ముఖ్యమంత్రిని చూడలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఇవ్వలేదు. సీఎం వైయస్‌ జగన్‌కు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్నారు.  కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా.. చివరకు రాజకీయం కూడా చేయకుండా కేవలం పేదరికాన్నే కొలమానంగా తీసుకొని అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తున్నాం. మంచం మీద పడిన గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ప్రమాదకరమైన జబ్బు బారిన పడిని వారికి కూడా సీఎం వైయస్‌ జగన్‌ పెన్షన్లు ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పెన్షన్లు ఇస్తున్నారన్నారు.

పెన్షన్ల విషయంలో రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. గ్రామ సచివాలయంలో అర్హులు, అనర్హుల లిస్టు ఉంది వెళ్లి చూసుకోవాలి. పెన్షన్‌ పొందేందుకు కావాల్సిన అర్హతలను కూడా సచివాలయాల్లో నోటీస్‌ బోర్డుల్లో పెట్టాం. ఎవరైనా అర్హులై ఉండి రాకపోతే దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లో అందజేస్తాం. పెన్షన్ల కోసం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది.

7 లక్షల పెన్షన్లు తీసేశారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అనర్హులను 4,27,538 మందిని తీసేశాం. కొత్తగా వచ్చిన వారితో కలిపి 54.65 లక్షల మందికి పెన్షన్లు అందజేశాం. చంద్రబాబుకు పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత లేదు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.75 వేలు ఇస్తానని చెప్పి సీఎం మాట తప్పాడని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడు.. ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి మేనిఫెస్టో చూసుకోండి చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరం నుంచి రూ.75 వేలలో ఏటా 25శాతం నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తామని చెప్పాం. వచ్చే ఏడాది నుంచి ఈ పథకం మొదలవుతుంది. పేదరికాన్నే కొలబద్ధగా తీసుకొని సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. నవరత్నాల్లో ఎనిమిది అంశాలను నెరవేర్చాం. మేనిఫెస్టోలో 80 శాతం అంశాలు అమలు చేశాం. ఉగాదికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 25 శాతం లెక్కన నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. పారదర్శకంగా  ప్రతి సంక్షేమ పథకాన్ని  అమలు చేస్తున్నాం’ అని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.

Back to Top