హైదరాబాద్, 9 అక్టోబర్ 2012: రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో నెలకొన్న సమస్యలపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తుందని ఆ విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి ప్రకటించారు. ఐఎఎస్, ఐపిఎస్ లాంటి ఉన్నత విద్యలు చదువుకోవాల్సిన భావి భారత పౌరులు హాస్టళ్ళలో అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమో కిరణ్ అని వారంతా ఆకలి కేకలు పెడుతున్నా కిరణ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన దుమ్మెత్తిపోశారు. విద్యుత్, బాత్రూం, మంచినీరు లాంటి కనీస సౌకర్యాలు లేని హాస్టళ్ళలో ఉంటున్న విద్యార్తులంతా మగ్గిపోతున్నారని పుత్తా విచారం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న కిరణ్ సర్కార్‌ను నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి కేవలం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని ఎందుర్కొనేందుకే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిందని నిప్పలు చెరిగారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో బీసిలు 50 శాతం మంది, ఎస్సీలు 15, ఎస్టీలు 7.5 శాతం మంది మొత్తం సుమారుగా 75 శాతం మంది ఉన్న వారి పిల్లలు హాస్టళ్ళలో అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నారని పుత్తా ప్రతాపరెడ్డి విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఈ ప్రభుత్వం ఒక రోజుకు కేవలం 17 రూపాయలే అందించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ 17 రూపాయలతో మనకు ఈ రోజుల్లో రెండు ఇడ్లీలు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. అలాంటిది భావి భారత పౌరులకు రోజు మొత్తానికి 17 రూపాయలే ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. హాస్టళ్ళలో విద్యుత్, బాత్రూం, మంచినీళ్ళు లాంటి సౌకర్యాలు అసలే ఉండని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఒక్కో గదిలో వందల మంది విద్యార్థులను కుక్కేసి కిరణ్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు.
విద్యార్థులకు హాస్టళ్ళలో సౌకర్యాలు కల్పించాలని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమానికి వారసురాలైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని పుత్తా అన్నారు. ప్రభుత్వ హాస్టళ్ళలో సౌకర్యాలు పెంచేందుకు ఒక కమిటీని వేయాలని కూడా తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంద మంది విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 30 మందికి మాత్రమే వచ్చేదని పుత్తా ప్రతాపరెడ్డి గుర్తుచేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు కనీసం వెయ్యి 90 రూపాయలు మెస్ బిల్లుగా చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ, బీసి కమిషన్లు నివేదికలు ఇచ్చాయని, అయితే, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లను ఏడాదికి ఆరు మాత్రమే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం వల్ల కూడా హాస్టల్ విద్యార్థులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులు అడిగిందే తడవుగా 40 శాతం మెస్ చార్జీలు పెంచారని పుత్తా గుర్తు చేశారు. ఆయనే ఉంటే ఇప్పటికి మరో రెండుసార్లయినా మెస్ చార్జీలు పెంచి ఉండేవారన్నారు. వైయస్ రెక్కల కష్టంతో తీసుకువచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా టిడిపితో దోస్తీ కట్టి విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోందని పుత్తా ప్రతాపరెడ్డి నిప్పులు చెరిగారు.