ఎవరి సత్తా ఏమిటో త్వరలోనే తేలుతుంది

హైదరాబాద్, 2 ఫిబ్రవరి 2013: శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జైలు పార్టీనా లేక జనం పార్టీనా అనేది త్వరలోనే తేలుతుందని వైయస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.  వైయస్‌ఆర్‌సిపిని 'జైలు పార్టీ' అంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మ మాట్లాడుతూ, 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్రలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు.

సహకార హక్కు చట్టం కమిషనర్లుగా ఎంపికైన వారిలో నలుగురికి రాజకీయాలతో సంబంధం ఉందని  గవర్నర్‌ తిప్పిపంపితే మళ్ళీ ఆ జాబితానే పునః పరిశీలించాలంటూ గవర్నర్ ప్రభుత్వం ‌పంపించడాన్ని పద్మ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభ్యులుగా ఉన్న కమిటీ వారిని ఎంపిక చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కొందరి పేర్లను చంద్రబాబు, మరి కొందరి పేర్లను ప్రభుత్వం సహకార హక్కు చట్టం కమిషనర్లుగా ప్రతిపాదించారని ఆమె తెలిపారు. మీకు కొందరు మాకు కొందరు ప్రాతిపదికన సహకార హక్కు కమిషనర్ల పోస్టులను పంచుకున్నారని ఆమె ఆరోపించారు. కిరణ్‌ - చంద్రబాబు మధ్య కుదిరిన 'డీల్‌' ప్రకారం అవే పేర్లను గవర్నర్‌కు పంపించడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి చంద్రబాబు నుంచి పూర్తి మద్దతు ఉందన్న విషయం మరోసారి తేటతెల్లం అయిందని పద్మ వ్యాఖ్యానించారు.

కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు వైయస్‌ఆర్‌సిపిని జైలు పార్టీ అని విమర్శించడంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ జగన్‌ను అక్రమంగా నిర్బంధించడానికి నిరసనగా, ఆయనను త్వరగా విడుదల చేయాలంటూ రెండు కోట్ల మంది సంతకాలు చేసి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పద్మ గుర్తుచేశారు. కాంగ్రెస్‌, టిడిపిలు కుట్ర చేసి, ఎనిమిది నెలలుగా శ్రీ జగన్‌ను జైలులో నిర్బంధించినా రాష్ట్ర ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో చంద్రబాబుకు ఆందోళన పట్టుకుందని, అందుకే దిగజారిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిన్న చెప్పిన 'మొసలి కథ' నూటికి నూరు పాళ్ళు ఆయనకే సరిపోతుందని పద్మ తిప్పికొట్టారు.

ఎన్నిక జరిగే ఒక్క రోజు తనను, తన పార్టీని గుర్తుంచుకోవాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అభ్యర్థిస్తున్నారని, అయితే, ఆ ఒక్క రోజు ప్రజలు అలా చేస్తే ఇక అన్ని రోజులూ వారి జీవితం చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోతుందని పద్మ హెచ్చరించారు.
Back to Top