అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై 'కోర్టుల్ని ధిక్కరించి మరీ తవ్వకాలు' అనే శీర్షిక ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఎన్జీటి, సుప్రీంకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై బురదచల్లే వార్తాకథనాన్ని ఈనాడు ప్రచురించిందని అన్నారు. కోర్టు ఉత్తర్వులతో తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేసిన ఈ 18 ఓపెన్ రీచ్ ల్లో ఇసుక మైనింగ్ జరుగుతోందని అసత్యాలతో కూడిన కథనాన్ని ప్రచురించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు నిలిపివేసిన రీచ్ ల్లో అధికారపార్టీ నేతలు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ అర్థంలేని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చివరికి అడ్డుకోవాల్సిన పోలీసులే అక్రమ ఇసుక దందాకు కాపలా కాస్తున్నారంటూ పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇస్తూ... ఈ ప్రభుత్వంపైనా, ప్రభుత్వ విభాగాలపైన ఈనాడు తనకు ఉన్న ద్వేషాన్ని, అక్కసును తన అసత్య కథనం ద్వారా ఈనాడు పత్రిక వెల్లడించిందని విమర్శించారు. 2) చిత్తూరు జిల్లాలోని అరణియార్, స్వర్ణముఖి, నినా నదుల్లో 18 ఇసుక రీచ్ లపై ఇటీవల ఎన్జీటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, సదరు రీచ్ ల్లో తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై జెపి సంస్థ సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించడంతో న్యాయస్థానం కూడా ఎన్జీటి ఆదేశాలను సమర్ధించింది. న్యాయస్థానం ఉత్వర్వులను గౌరవిస్తూ గనులశాఖ తక్షణమే ఈ 18 రీచ్ ల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు, వాటికి ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసింది. పర్యావరణశాఖ ద్వారా తాజాగా అన్ని అనుమతులు పొందిన తరువాతే మాత్రమే ఇసుక ఆపరేషన్స్ కు అనుమతి ఇస్తామని కూడా స్పష్టం చేసింది. 3) వాస్తవాలు ఇలా ఉంటే, ఈ 18 రీచ్ ల్లో 15 రీచ్ ల్లో ఇంకా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఈనాడు పత్రిక అబద్దాలతో కూడిన వార్తా కథనాన్ని ప్రచురించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు అధికారపార్టీ నేతలు ఇక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ 'ఆంబోతు ఈనింది అంటే దూడను కట్టేయండి' అనే సామెతను తలపించేలా ఈనాడు పత్రిక తన అసత్య కథనంలో ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. తవ్వకాలను నిలిపివేసిన రీచ్ ల్లో పెద్ద ఎత్తున యంత్రాలు, ఇసుకను తరలించే వాహనాలు, వాటికి కాపలాగా పోలీసులు అంటూ ఈనాడు పత్రిక తమ ఊహలకు ఒక రూపం కల్పించి, నిజంగా జరుగుతున్నాయని భ్రమించేలా వార్తా కథనాన్ని ప్రచురించింది. 4) ఇసుక తవ్వకాలు నిలిచిపోయిన రీచ్ ల్లో భారీ యంత్రాలు ఎలా వస్తాయి? వాటి ద్వారా టిప్పర్లు, ట్రాక్టర్లు ఎలా ఇసుకను లోడ్ చేస్తారు? లేని ఇసుక రవాణాకు స్థానిక అధికారపార్టీ నేతలు స్లిప్ లు ఎలా ఇస్తారు? రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వంపై ఎప్పుడూ బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు పత్రిక ఒక పథకం ప్రకారం నిలిచిపోయిన 18 రీచ్ ల్లో ఇసుక ఆపరేషన్స్ పై కుట్రపూరితంగా తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈనాడు ఊహలతో, దురుద్దేశంతో ప్రచురించిన కథనంలో ముఖ్యమంత్రి, గనులశాఖ మంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించడం సదరు పత్రికకు ఈ ప్రభుత్వంపై ఉన్న ఆక్రోశంకు నిదర్శనం. 5) వర్షాకాలంలో భవన నిర్మాణ రంగం కోసం ముందుచూపుతో ప్రభుత్వం అన్ని ఓపెన్ రీచ్ లకు సమీపంలో స్టాక్ యార్డ్ లను నిర్వహిస్తోంది. ఈ స్టాక్ట్ యార్డ్ ల్లో నిల్వ చేసిన ఇసుక కూడా అక్రమంగా తవ్విపోసిందే నంటూ ఈనాడు పత్రిక నిస్సిగ్గుగా అబద్దపు ఆరోపణలు చేస్తోంది. ఈ స్టాక్ యార్డ్ నుంచి అన్ని అనుమతులతోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. వాటిని ఫోటోలు తీసి, నిలిచిపోయిన ఇసుక రీచ్ ల పేర్లతో అక్కడే ఇసుక లోడింగ్ జరుగుతోందని వక్రీకరించేలా తన కథనంలో పేర్కొంది. 6) ఈనాడు పాత్రికేయులు మూడు బృందాలుగా చిత్తూరు జిల్లాలోని ఇసుక రీచ్ లను పరిశీలించారని తన కథనంలో ప్రచురించింది. అక్రమాలను ఫోటోలు తీశారని కూడా తన వార్తాకథనంలో ప్రచురించింది. అక్రమాలు జరుగుతుంటే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పాత్రికేయులు ఎందుకు అక్కడే టోల్ ఫ్రీ నెంబరు కానీ, స్థానికంగా ఉన్న పోలీస్, రెవెన్యూ, గనులశాఖ అధికారులకు ఫిర్యాదు చేయలేదు? ఎందుకంటే సదరు రీచ్ ల్లో ఎక్కడా మైనింగ్ జరగడం లేదు కాబట్టి. 7) గతంలో ఉచిత ఇసుక పేరుతో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా అక్రమాలకు పాల్పడింది. ప్రజలు అధిక రేట్లకు ఈ మాఫియా నుంచి ఇసుకను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వంకు చేరకుండా, అప్పటి పెద్దల అండతో చెలరేగిపోయిన ఇసుక మాఫియా జేబుల్లోకి ఈ సొమ్ము చేరింది. గత ప్రభుత్వంలో అయిదేళ్ళకాలంలో దాదాపు రూ.4వేల కోట్లు ఇసుక ద్వారా రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్ళింది. నల్లబజారులో అధిక రేట్లకు ఇసుకను ప్రజలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరికి ఉచిత ఇసుకను అందించారు? ఏరోజైనా ఈనాడు దీని గురించి రాసిందా? 8) సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానంను రద్దు చేశారు. టెండర్ల ద్వారా ఏజెన్సీని ఎంపిక చేసి ఇసుక విక్రయాలు చేయిస్తున్నారు. దీనివల్ల ఏడాదికి ప్రభుత్వానికి రూ.760 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. అంతేకాదు ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఇసుకను అందిస్తున్నాము. 9) గతంలో జరిగిన ఇసుక దందా ఈనాడు పత్రిక కళ్ళకు కనిపించలేదు. ఇప్పుడు పారదర్శకంగా, ప్రజలకు అందుబాటుధరలో ఇసుకను అందిస్తున్న ప్రభుత్వంపై మాత్రం తన అక్కసును వెళ్ళదీసుకుంటోంది. కేంద్రప్రభుత్వరంగ సంస్థ ద్వారా టెండర్ల ప్రక్రియను నిర్వహింపచేసి, జెపీ సంస్థ ద్వారా ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. 10) దీనిని కూడా వక్రీకరిస్తూ.. థగ్గులు, పిండారీలు వంటి కరుడుగట్టిన దోపిడీదారులను ఉదహరిస్తూ, చంబల్ లోయ గజదొంగలను ఉఠంకిస్తూ ఈనాడు పత్రిక కనీస నైతిక విలువలను కూడా విడిచిపెట్టి, వైఎస్ఆర్ సిపి నేతలు ఇసుక ఆపరేషన్స్ చేస్తున్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచురించడం ద్వారా ప్రజల్లో తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటోంది. పదేపదే అబద్దాలను ప్రచురించడం ద్వారా ప్రజల్లో వాటినే నిజాలుగా భ్రమకల్పించేలా ఈనాడు పత్రిక చేస్తున్న దిగజారుడు పాత్రికేయంను తక్షణం మానుకోవాలి. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.