'సమైక్య' లేఖపై సంతకానికి జగన్‌ రెడీ

హైదరాబాద్, 29 సెప్టెంబర్ 2013: ‌

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మీద బురదజల్లే బదులు ఆరు కోట్ల తెలుగు ప్రజల గురించి ఆలోచించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని చంద్రబాబు, రాజగురువుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి హితవు పలికారు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ఏకవాక్య లేఖ ఇచ్చినా సంతకం ‌చేయడానికి శ్రీ వైయస్ జగ‌న్ సిద్ధమని ఆమె ‌స్పష్టం చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదా సమైక్యాంధ్ర జెఎసి ఇచ్చే సమైక్య లేఖపై సంతకానికి చంద్రబాబు సిద్ధమా అని శోభా నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ అడుగు వేసినా దాన్ని చంద్రబాబు తప్పు పడుతున్నారని, ఎవరు దొంగలో తేల్చాల్సిన సమయం వచ్చిందని శోభా నాగిరెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాసిన లేఖపై సంతకం చేయడానికి చంద్రబాబు, కిరణ్‌, బొత్స సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు ఎవరికీ లేదంటూ ఆరు కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నారని శోభా నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు తన అభిమతాన్ని, పార్టీ విధానాన్ని స్పష్టంగా వెల్లడించారన్నారు. ఉద్యమాలను నీరుగార్చేందుకు ఇతర రాజకీయ పార్టీలు యత్నిస్తే ప్రజలు క్షమించబోరని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు డీల్‌ కుదిరిందా? లేక ఆ పార్టీకి అన్ని విధాలా సహకరిస్తున్న చంద్రబాబుకు కుదిరిందా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్రానికి ఎవరు లేఖ రాసినా మొదటి సంతకం తాను పెడతానని శ్రీ జగన్‌ నిన్న న్యాయవాదుల జెఎసి సభ్యులతో మాట్లాడుతూ చెప్పిన సందర్భాన్ని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారని ప్రస్తావించారు.

టిడిపిని దెబ్బతీయడానికి ఎవరో కుట్ర చేయాల్సిన అవసరంలేదని, చంద్రబాబు విధానాలే ఆ పార్టీని దెబ్బ తీస్తున్నాయని శోభా నాగిరెడ్డి చెప్పారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు కనుకే దెబ్బతింటున్నారన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని మేం చెప్పామా అని నిలదీశారు. సోనియా గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మాతో డీల్ కుదిరిందా లేక సోనియా నిర్ణయానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన‌ చంద్రబాబుతో డీల్ కుదిరిందా అని ప్రశ్నించారు.‌ సోనియాతో డీల్‌ కుదరలేదంటే చంద్రబాబు లేఖను వెనక్కితీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు లేఖను వెనక్కి తీసుకోమని రామోజీరావు, తోక పత్రికలు ఎందుకు అడగడంలేద‌ని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్ర టిడిపి నాయకులు చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. అవిశ్వాస తీర్మానం సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా విప్‌ జారీ చేసిన రోజునే టిడిపి సగం చచ్చిపోయిందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోనని జెఎసి సభ్యులకు చెప్పిప్పుడు మిగతా పార్టీ పూర్గిగా మరణించిందన్నారు. చంద్రబాబు నాయుడు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా? అనుభవంతో మాట్లాడుతున్నారా? లేక అవివేకంతోతో లేదా నిరాశా నిస్పృహలతో నిండిపోయి మాట్లాడుతున్నారా? అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు.

ఏ తప్పూ చేయలని శ్రీ జగన్‌ 16 నెలలు జైలులో ఉండాల్సి వచ్చిందని శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి రాష్ట్రపతిగా వస్తే.. దేశానికి మేలు జరుగుతుందని తమ పార్టీ ఎంపీలు ఓటు వేస్తే.. శ్రీ జగన్‌కు బెయిల్‌ వచ్చేస్తుందంటూ చంద్రబాబు, టిడిపి నాయకులు గోబెల్సు ప్రచారం చేశారని శోభా దుయ్యబట్టారు. ఆ తరువాత 13 నెలల పాటు శ్రీ జగన్‌ జైలులో ఉన్నప్పుడు టిడిపి నాయకులు మరింక మాట్లాడలేదన్నారు. ప్రతిసారీ టిడిపి నాయకులు బురద జల్లుతూనే ఉంటారా? అని నిలదీశారు. ఈ బురద జల్లుడు అంతా ఎత్తుగడలో భాగం అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగానే టిడిపి నాయకులు బురదజల్లుతున్నారన్నారు. సోనియా గాంధీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నది టిడిపినా లేక వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనా లేక విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడా లేకా వైయస్ఆర్‌సిపినా అని సూటిగా ప్రశ్నించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శించే బదులు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును నిలదీయాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని సోనియా వదిలిన బాణం అని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంకా బాణాలు వదిలే పరిస్థితిలో ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అంపశయ్యపై ఉన్నారని గుర్తించాలని శోభా నాగిరెడ్డి చురక అంటించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేసినా వేరే అర్థం వచ్చేలా చంద్రబాబు తన తోక మీడియా పత్రికల్లో రాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మరో రంగు పూసి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్రకు ఎవరు నిజాయితీగా కట్టుబడి ఉన్నారో తేల్చాల్సిన సమయం వచ్చిందన్నారు.

మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసిన ఏకైక నాయకుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని శోభా నాగిరెడ్డి ప్రస్తుతించారు. కాంగ్రెస్‌కే కాకుండా చంద్రబాబు నాయుడిని కూడా మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారని అన్నారు. అలాంటి శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఎదేదో మాట్లాడుతున్నారన్నారు. ఎవరి కేసులు విచారణ జరిగాయి, ఎవరు జైలులో ఉన్నారు? కాంగ్రెస్‌ విధానాల వల్ల ఎవరు ఇబ్బందులు పడ్డారన్నది అందరికీ తెలుసన్నారు. చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సిబ్బంది లేరని చెప్పిన సిబిఐ అదే శ్రీ జగన్‌గారి విషయానికి వస్తే ఏకకాలంలో ఆయన నివాసం, కార్యాలయాలు, పెట్టుబడులు పెట్టిన వారి ఆస్తుల మీద దాడులు చేసిందని వెల్లడించారు. అప్పుడు సిబిఐని పొగిడిన చంద్రబాబు నాయుడు శ్రీ జగన్‌కు బెయిల్‌ రాగానే విమర్శిస్తున్నారని అన్నారు. అంటే శ్రీ జగన్‌ను ఇబ్బంది పెడితే సిబిఐ బాగా పనిచేసినట్లు లేకపోతే కాదు అన్నట్లు చంద్రబాబు తీరు ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల మాత్రమే శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ వచ్చిందన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం మాత్రమే సిబిఐ చార్జిషీట్లు వేసింది తప్ప ఆయన మీద ప్రేమతోనో అభిమానంతోనో కాదన్నారు. కేంద్రం పంజరంలో చిలక సిబిఐ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు అన్ని పార్టీలూ స్పందించినా చంద్రబాబు మాత్రం నోరు విప్పి మాట్లాడని వైనాన్ని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. అంటే 16 నెలల తరువాత కూడా రాజ్యాంగం కల్పించిన హక్కును శ్రీ జగన్‌ వినియోగించుకోరాదంటారా? అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. కేసులు నిరూపితమై శిక్షపడిన వ్యక్తి శ్రీ జగన్‌ కాదని గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు. చంద్రబాబు, టిడిపి నాయకులు మాట్లాడే అసభ్యకరమైన మాటలపై స్పందించాలన్నా అసహ్యంగా ఉందన్నారు. మనిషి లక్షణాలను కూడా మరిచిపోయి నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

సమైక్యాంధ్రపై చంద్రబాబు, టిడిపి విధానం ఏమిటో స్పష్టంచేయాలని శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. రాజకీయంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని రాజకీయంగానే నిలుపుదల చేయాలన్నారు. రెండు నెలలుగా సమైక్య ఉద్యమంలో ఉన్న ఎన్‌జివో సోదరులు జీతాలు లేక కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తంచేశారు. సమైక్యాంధ్రక కట్టుబడిన పార్టీలేవీ, డ్రామాలాడుతున్నవి ఏవో గమనించాలని జెఎసిలకు ఆమె విజ్ఞప్తిచేశారు.

సబ్బం హరి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యుడు కాదు :
రాష్ట్ర విభజనపై అనకాపల్లి ఎం.పి. సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని శోభా నాగిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీతో ‌హరికి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఆయనకు తమ పార్టీలో సభ్యత్వం లేదని, ఎలాంటి బాధ్యతలూ లేవని స్పష్టం చేశారు. ఆయన పార్టీలోకి రావాలనుకున్నారని కానీ కాంగ్రె‌స్ కుట్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సబ్బం హరి వ్యాఖ్యలు తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌తో సహా అందరినీ బాధించాయని తెలిపారు. సబ్బం హరి మాట్లాడిన మాటలతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top