మరోసారి బయటపడిన కాంగ్రెస్‌ అసలు రంగు

హైదరాబాద్, 6 జూలై 2013:

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని పలు కేసులలో ఇరికించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా బలిచేయడానికి వెనుకాడదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శ్రీ జగన్ కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకట‌ రమణ సోదరుడు శుక్రవారం ‌చెప్పిన మాటల్లోని వాస్తవాలను తాము ముందే ఊహించామని అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో నిర్బంధించేందుకు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అణచివేసేందుకు ఒక బలహీనవర్గానికి అందులోనూ మత్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి మోపిదేవిని బలిపశువును చేసిందని దుయ్యబట్టారు. శ్రీ జగన్‌కు వ్యతిరేకంగా అప్రూవర్‌గా మారితే మోపిదేవికి మేలు జరిగేలా చేస్తామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి స్వయంగా చెప్పడాన్ని చూస్తే కుట్ర ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. మోపిదేవి వెంకట రమణకు జరిగిన అన్యాయంతో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు మరోసారి బహిర్గతం అయిందని దుయ్యబట్టారు.

నిష్పక్షపాతంగా వ్యవరిస్తున్నామని చెప్పుకోవడానికే మంత్రి మోపిదేవి చేత రాజీనామా చేయించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సిబిఐ కలిసి అన్యాయంగా, అక్రమంగా  14 నెలలుగా జైలులో పెట్టారని అంబటి ఆరోపించారు. సిబిఐ కస్టడీలో ఉన్న మోపిదేవి వద్దకు కాంగ్రెస్‌ దూతలు వెళ్ళి రాజీనామా పత్రంపై సంతకం పెట్టించుకు వచ్చారని ఆయన గుర్తుచేశారు. రాజీనామా పత్రంతో పాటు ఒక సుదీర్ఘమైన లేఖను కాంగ్రెస్‌ వారే రాసి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న మోపిదేవి చేత దాని మీద కూడా సంతకం చేయించారన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పెట్టమంటేనే సంతకం పెట్టారు తప్ప ఆయనకేమీ ప్రమేయం లేదని  మసిపూసి మారేడుకాయ చేసేందుకు కాంగ్రెస్‌ పెద్దలంతా ప్రయత్నించారన్నారు.

మోపిదేవి వెంకట రమణ అరెస్టుకు ముందే పెద్ద డ్రామా నడిచిందని అంబటి రాంబాబు ఆరోపించారు. మోపిదేవి చేసిన పాపమేమిటని, ధర్మాన ప్రసాదరావు, సబిత చేసిన పుణ్యమేమిట?ని ఆయన ప్రశ్నించారు. ధర్మాన, సబిత మంత్రి పదవులు పోయి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ సిబిఐ మెమో దాఖలు చేయడాన్ని అంబటి తప్పుపట్టారు. మంత్రులుగా ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారు చేయని వ్యక్తులు మాజీలుగా మారి ఇప్పుడెలా చేస్తార?ని అంబటి ప్రశ్నించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని మరింతగా నిర్బంధంలో కొనసాగించేందుకు ఎవరినైనా బలి చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పడానికే మోపిదేవి నిర్బంధం అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ పబ్బం గడపడం కోసం, శ్రీ జగన్‌పై కక్ష సాధించడం కోసం, ఆయనకు బెయిల్‌ రాకుండా మరింతకాలం ఉంచేందుకు సిబిఐ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అంబటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ కేసు చూసినా సిబిఐ ఇదే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైల్వే మాజీ మంత్రి పి.కె. బన్సల్‌కు సిబిఐ క్లీన్‌చిట్‌ ఇచ్చిన తీరును ఒక జాతీయ ఛానల్ బట్టబయలు చేసిన వైనాన్ని అంబటి రాంబాబు ప్రస్తావించారు. బన్సల్‌ ఇంటిలోని అధికారిక ల్యాండ్‌ లైన్‌ నుంచే ఆయన మేనల్లుడు సింగ్లా బేరసారాలు నడిపిన వైనాన్ని ఆ చానల్‌ బయటకు తీసుకువచ్చిందని చెప్పారు. మంత్రికి క్లీన్‌చిట్‌ ఇవ్వడం, ఆయన మేనల్లుడిని అరెస్టు చేయడం అంతా కేంద్రం చెప్పినట్టల్లా సిబిఐ ఆడుతున్నది అనేందుకు మరో తాజా ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్నది సిబిఐ అని అంబటి ఆరోపించారు. భారతదేశంలో కాంగ్రెస్‌ పార్టీ అంతరించిపోయి 'సిబిఐ కాంగ్రెస్‌'గా తయారైందని ఎద్దేవా చేశారు.

మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయిందని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలులో కాకుండా ప్రజల మధ్యనే తిరుగుతుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని ప్రజలంతా అనుకుంటున్నారని ఆయన చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి, మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది కాబట్టి, కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లే పరిస్థితి ఏర్పడింది కాబట్టి లీకులిచ్చి, ప్రత్యేక రాష్ట్రం, సమైక్యాంధ్ర ఉద్యమాలు లెగ్గొట్టి కొత్త సమస్యలు సృష్టించి ప్రజల దృష్టిని మళ్ళించాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సమస్యను పరిష్కరించకుండా ప్రచారం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని విమర్శించారు. అయితే, శ్రీ జగన్మోహన్‌రెడ్డిని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అణచటం కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐల వల్ల కాదని నిరూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంబటి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణించి ఏడాదవుతున్నా ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించమని డిమాండ్‌ చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు జారిపోయారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు.

Back to Top