వైయస్‌ది ప్రజాప్రస్థానం- బాబుది ప్రహసనం!

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ప్రజాప్రస్థానం. చంద్రబాబు ప్రారంభించింది ప్రహసనం!వైయస్ పాదయాత్ర చేసి 2004లో అధికారంలోకి వచ్చాడని‌, చంద్రబాబు గాంధీ జయంతి రోజున పాదయాత్ర ప్రారంభించి 2014లో అధికారంలోకి వస్తాడట! ఇది నూటికి నూరు శాతం నిజమట! సర్వేలు చంద్రబాబుకు సున్నచుట్టాయి. అయితే అవి డబ్బిచ్చి చేయించుకున్న సర్వేలట! పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం అంటే ఇదే కాబోలు! వైయస్‌ను చూసి బాబు పాదయాత్ర చేస్తే అది అనుకరణ మాత్రమేనని లోకం అంటోంది. 

తాను అధికారంలో ఉన్నప్పుడు నీతివంతమైన పాలన అందించినందుకు ప్రజలు తనను ఆదరించి 2014లో అధికారంలో కూర్చోబెడతారట? చంద్రబాబు పాపాల చిట్టా అంతా రాస్తే ఒక గ్రంథం అవుతుంది. 'బాబు జమానా అవినీతి ఖజానా' అని సీపీఎం వారు ఆనాడు ఏకంగా పుస్తకమే వేశారు. రాజకీయాల్లో అవినీతి ప్రకరణం ప్రారంభించింది చంద్రబాబేనని స్వయానా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకం రాశాడు. రాజ్యసభ టిక్కెట్టు కోట్ల రూపాయలకు అమ్మేశాడని ఇటీవలే టీడీపీని వీడిన ఒక నాయకుడు బయటపెట్టాడు.

ఇదీ చంద్రబాబు పాపాల చిట్టా!
కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు మంత్రిపదవి ఇచ్చింది. ఆ హోదాతో ఎన్టీఆ‌ర్‌కు అల్లుడైనాడు. అయితే మామ పార్టీ చేతిలో ఓటమి చెందగానే ఆ తడి ఆరకుండానే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలోకి ఫిరాయించాడు. ఏ పవిత్రాశయం కోసం కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి ఫిరాయించాడో బాబు నుంచి ఇంత వరకు సమాధానం లేదు. కుట్ర చేసి ముఠా కట్టి, క్యాంపు పెట్టి దొడ్డిదారిన ఎన్టీఆర్‌ను దించకపోతే, టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిపి అవిశ్వాసం పెట్టి రాజమార్గంలో దింపకూడదా అంటే దానికీ బాబు నుంచి సమాధానం లేదు.

ఎన్టీఆర్‌ను క్షోభకు గురిచేసి ఆయన విషాదాంత మరణాన్ని శీఘ్రతరం చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ పట్ల భక్తిశ్రద్ధలను ప్రకటించడం మానుకోలేదు. ఎన్టీఆ‌ర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న బాబు, ఎన్టీఆ‌ర్ సంక్షేమ విధానాలను కొనసాగించాడా అంటే లేదు. వాటన్నింటికీ నీళ్లొదిలాడు. మద్యపాన నిషేధాన్ని రద్దుచేసి సారాయిని గ్రామాల్లో ఏరులై పారించాడు. రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదున్నర రూపాయలు చేశాడు. విద్యుచ్ఛక్తి రేట్లు పెంచి రైతాంగాన్ని దొంగలను చేసి వారి మీద కేసులు పెట్టాడు. విద్యు‌త్ రేట్లు తగ్గించమని కోరినందుకు హైదరాబా‌ద్, బషీ‌ర్‌బాగ్‌లో నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించి ముగ్గురి నిండుప్రాణాలు బలిగొన్నాడు.

75 రూపాయల హీనమైన పెన్షన్ ఇవ్వడానికి బాబుకు మూడు, నాలుగు మాసాలు పట్టేది. ఆ పెన్ష‌న్ కూడా అర్హులైన వృద్ధులందరికీ దక్కలేదు. కొత్తవారికి పెన్ష‌న్ కావాలంటే పాత పెన్షనర్లు చనిపోవాలి. రైతాంగం దివాలా తీసి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడితే వారిని బాబు ఆదుకోలేదు. కారణం... అలా ఆదుకుంటే ఆత్మహత్యలు పెరుగుతాయట! ఇలా పుండు మీద కారం చల్లే మాటలతో అభాగ్యులను అవమానించాడు.

పునాది రాళ్లను సమాధి రాళ్లుగా‌...:
శ్రీరామకృష్ణయ్యని నీటిపారుదల సలహాదారుగా నియమించుకుని ఎన్టీఆర్ రాయలసీమ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి 1983లో తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టాడు. ఎన్టీఆ‌ర్ తర్వాత ‌తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు తెలుగుగంగ పూర్తి చేయలేక దానిని ఎండబెడితే వైయస్ పూర్తిచేసి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు. ఇంకుడుగుంతలు తవ్వడం, చిన్నచిన్న వంకలు, వాగుల మీద కరకట్టలు నిర్మించడం, పెద్ద ప్రాజెక్టులను నిరుత్సాహపరచడం ప్రపంచ బ్యాంకు విధానం. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు నమ్మినబంటుగా గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ లాంటి ప్రాజెక్టులకు ప్రజల నుంచి వత్తిడి వస్తే శంకుస్థాపనలు చేయడం తప్ప వాటి పరిపూర్తిపై శ్రద్ధ కనపరచలేదు. 

అందు‌కే ఆ పునాదిరాళ్లన్నీ సమాధిరాళ్లుగా మారాయి. 2000 సంవత్సరంలో బచావత్ కమిటీ తీర్పు సమీక్షకు వస్తుందని తెలిసి కూడా కృష్ణా మిగులు జలాల మీద మనకు హక్కు ఉన్నప్పటికీ ఏ ప్రాజెక్టూ పూర్తి చేయడానికి పూనుకోలేదు. మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నట్లు బాబు ప్రకటించడమే‌ గానీ ఆ జిల్లాలోని ప్రాజెక్టులను ఒక్క దానిని కూడా చేపట్టలేదు. వైయస్ అధికారం చేపట్టిన వెంటనే భీమా ఎత్తిపోతల, నెట్టెంపాడు మొదలైన ప్రాజెక్టుల మీద దృష్టిపెట్టి వాటి పరిపూర్తికి పూనుకున్నాడు. రాయలసీమకు ప్రాణాధారమైన పోతిరెడ్డిపాడు హె‌డ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచుతూ కొత్త రెగ్యులేట‌ర్ నిర్మాణానికి వై‌యస్ పూనుకుంటే, శాసనసభలో దానిని దేవేంద‌ర్‌గౌడ్ వ్యతిరేకిస్తే, చంద్రబాబు అతన్ని మందలించకుండా తమాషా చూస్తూ కూర్చున్నాడు. ఇలా రాయలసీమ ప్రాజెక్టులన్నిటినీ తన హయాంలో ఎండబెట్టి, రాయలసీమలో పాదయాత్ర ఎలా జరుపుతాడో చూడాలి!

విశ్వసనీయతే వై‌యస్ బలం!‌ :
వైయస్ తన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల మీద చెరగని ముద్ర వేసినందువల్లనే ఆయన మరణిస్తే, ఆ విషాద వార్త విని వందలాది మంది ప్రజలు గుండె ఆగి చనిపోతే, ఊరూరా, వాడవాడలా వై‌యస్‌ విగ్రహాలు వెలిస్తే అసూయతో కుమిలిన చంద్రబాబు నిజాన్ని చూడలేని దివాంధుడుగా, వైయస్ విశ్వసనీయతను అపహాస్యం చేయబూనడం సిగ్గుచేటు. లక్ష కోట్ల అవినీతి ఆరోపణలోని డొల్లతనాన్ని మైసూరారెడ్డి బయటపెట్టినా కూడా బాబు బురదచల్లడం మానుకోలేదు.

వై‌యస్ పథకాలన్నీ లోకోత్తరమైనవే. జలయజ్ఞాన్ని నిపుణులు నభూతో నభవిష్యతి అన్నారు. ప్రజలు వై‌యస్‌ను కాటన్‌తో పోల్చుకున్నారు. పోలవరం, శ్రీశైలం సొరంగమార్గం, ప్రాణహిత- చేవెళ్ల వేటికి అవే సాటి. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ఆసియాలోనే అపూర్వమైనది. ఇటీవల వెలిగొండ సొరంగమార్గం చూసిన సీపీఐ రాష్ట్ర నాయకుడు కె.నారాయణ అది పూర్తయితే ప్రజలు వైయస్‌ను నిజంగా దేవుడిగా ఆరాధిస్తారని అన్నారు. ఇక ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను ప్రజలు వేనోళ్ల కొనియాడుతున్నారు. 30 లక్షల మంది రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం సామాన్యం కాదు. ఉచితంగా ఇస్తే కరెంటు తీగెల్లో కరెంటు ఉండదు, అవి బట్టలు ఆరవేసేందుకు పనికివస్తాయని ఎద్దేవా చేసిన బాబు ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నాడు. చివరకు బాబు వ్యవహార సరళికి విసిగివేసారి ఆయన అనుచరులు ఒక్కరొక్కరే పార్టీకి దూరమవుతున్నారు. మాకు ఈ పదవులు వద్దు, మాకు కావలసింది మా ప్రాంత అభివృద్ధి అంటున్నారు.

ఇటీవల బాబు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ ఇచ్చాడట. ప్రత్యేక తెలంగాణను బలపరుస్తున్నామో, లేదో ఒక వాక్యంలో చెప్పవచ్చు కదా! అందులో కూడా అంతరార్థాలు. అన్ని పక్షాలను సమావేశపరిస్తే అప్పుడు చర్చించి అభిప్రాయం చెబుతాడట! ఇప్పుడు ఆయన విశ్వసనీయ తను ప్రజలతో పాటు అనుచరవర్గం కూడా శంకిస్తోంది.

మ్యాచ్ ఫిక్సింగ్‌తో అపహాస్యం పాలు! :
చంద్రబాబులో పాజిటివ్ లక్షణాలు శూన్యం. ప్రత్యర్థుల్లోని మంచిని గుర్తించే హుందాతనం లేదు. ప్రత్యర్థులకు లభిస్తున్న ప్రశంసలు చూసి అసూయ చెందడమే అతని పని. ప్రజలు వై‌యస్ విగ్రహాలు పెట్టుకుంటే అసూయ. జగ‌న్మోహన్‌రెడ్డికి లభిస్తున్న జనాదరణ చూస్తే అసూయ. ‘పరుల కలిమికి పొర్లి ఏడ్చే పాపికెక్కడ సుఖం కలదోయ్’ అని గురజాడ అన్నది బాబు వంటి అసూయాపరుని గురించేనేమో! జగ‌న్ అడ్డును తొలగించుకోకపోతే తాను ముఖ్యమంత్రి కాలేనని భావించబట్టే, అతని ఆస్తులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కాంగ్రె‌స్ ఎంఎల్‌ఏ డా॥శంకర్రావుతో హైకోర్టులో ‘పి‌ల్’ వేయించడంతోనే మొదలైంది బాబు మ్యా‌చ్ ఫిక్సింగ్ అధ్యాయం.
కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో జగ‌న్మోహన్‌రెడ్డికి లభించిన అపూర్వ విజయం బాబును నైతికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. శాసనమండలి స్థానిక ఎన్నికల్లో జగన్ అనుకూల అభ్యర్థులను ఓడించేందుకు బాహాటంగానే కాంగ్రె‌స్‌తో చేతులు కలిపాడు. జగన్ అనుకూల అభ్యర్థిని ఓడించేందుకు టీడీపీ ఓటర్లను కాంగ్రె‌స్ శిబిరానికి పంపించాడు. అయినా జగన్ అభ్యర్థి గెలిచాడు. 18 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అదే నాటకం. రామచంద్రాపురం, నర్సాపురంలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచింది టీడీపీ ఓట్లతోనే. ప్రధాన ప్రతిపక్షనేత హోదాను దిగజార్చుకుని బాబు పతనమైన తీరుకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఇంత బాగోతం పెట్టుకుని పాదయాత్ర చేస్తే లభించేది అధికారం కాదు ప్రజల చీవాట్లు.

ఎ‌న్. శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
Back to Top