ముందుంది మొసళ్ళ పండుగ!

కేంద్రంలో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న యూపీఏకి గడ్డురోజులు వచ్చిపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చిల్లర వ్యాపారాల్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించాలని కేంద్రం నిర్ణయించడం ఆలస్యంగా బంగాలీ దీదీ మమతా బనర్జీ అల్టిమేటమ్ జారీచేశారు. మూడు రోజుల్లో ఈ నిర్ణయాన్ని పునరాలోచించకపోతే అంటే వాస్తవానికి ‘ఉపసంహరించకపోతే’ అనే అర్థం‌ తను యూపీఏ ప్రభుత్వానికి మద్దతు విషయంలో ‘కఠిన నిర్ణయం’ తీసుకుంటామని  అంటే మద్దతు ఉపసంహరిస్తామని మమతా బనర్జీయే స్వయంగా ప్రకటించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ‘అనివార్యం!’ అంటూ పెంచేసిన డీజిల్ ధర విషయంలో కూడా కేంద్రం ‘పునరాలోచించక తప్ప’దని మమతా హెచ్చరించారు.

ఇది జరగడానికి కొద్దిగా ముందే, సమా‌జ్‌వాదీ పార్టీ అధినేత ములాయమ్ సింగ్ రాహు‌ల్‌గాంధీకి ఏ సమస్య విషయంలోనూ అవగాహన గానీ, స్పష్టత గానీ లేవని విమర్శించారు. ఆయన ఆ విమర్శ చేసే సమయానికి ములాయమ్ కుమారుడు ‌‌(ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా) అఖిలే‌ష్ యాద‌వ్ కలకత్తాలోనే ఉన్నారు. వారిద్దరూ కలిసి ఏర్పాటు చేసిన మీడియా గోష్ఠిలో అధికార రాజకీయాల ప్రస్తావన ప్రత్యక్షంగా లేకపోయినా, ఆ రెండు పార్టీల మధ్యా ఏకీభావం ఏ స్థాయిలో ఉందో వ్యక్తమయింది. 

ఈ ‘ఐక్యతా ప్రదర్శన’ ఎందుకవసరమయింది? రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా, ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వం విషయంలో సమా‌జ్‌వాదీ పార్టీ ఇవాళ ఒకమాట మాట్లాడి మర్నాడే మాట మార్చేసింది. ఫలితంగా ఎస్పీ- టీఎంసీల మధ్య ఏదో అగడ్త ఏర్పడిందని జాతీయ మీడియాలోని యూపీఏ అనుకూల భాష్యకారులు వ్యాఖ్యలు వెలయించారు. అలాంటిదేమీ లేదని చెప్పడానికే అఖిలేష్ యాద‌వ్ కో‌ల్‌కతాలో దీదీతో కలిసి మీడియా గోష్ఠి ఏర్పాటు చేశారనిపిస్తుంది.

యూపీఏ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడిన ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు దక్కింది. మరే రాష్ట్రం నుంచీ ఇంత మంది ‌(33మంది) లోక్‌సభ సభ్యులు ఎన్నికయినట్లు లేరు. ఇందరిని గెలిపించి పుణ్యం కట్టుకున్నందుకు వైయస్ రాజశేఖరరెడ్డికి అప్పట్లో కాంగ్రె‌స్ అధిష్టానమ్మ ఆరతులెత్తింది. ఆయన మరణం విషయంలోనూ, అటు తర్వాతి పరిణామాల్లోనూ అధిష్టానమ్మ వైఖరి పూర్తిగా మారిపోయింది.

వై‌యస్‌ఆర్ మృతి వార్త‌ విని కన్నుమూసినవారిని పరామర్శ చేసి వస్తానంటే వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డిని అనుమతించలేదా మహాతల్లి. ఆ నేపథ్యంలో, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఏర్పడడం, అనేక ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయడం, 2014 ఎన్నికల్లో ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పరుస్తుందని రాజకీయ పరిశీలకులు ముక్తకంఠంతో తీర్మానించడం అందరికీ తెలిసిన సంగతులే.

వై‌యస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంపై గెల్చిన ఆంధ్రప్రదే‌శ్ ఎంపీలు రాష్ట్ర విభజన అంశంపై నిట్టనిలువుగా చీలిపోయి ఉన్నారిప్పుడు. ఏ రోజున వీళ్లు అధిష్టానమ్మకు ఎదురుతిరుగుతారో ఎవరూ చెప్పలేరు. మన్మోహ‌న్ సర్కారు వీరి బలం మీద ఆధారపడే పరిస్థితి లేదిప్పుడు. మిగతా రాష్ట్రాల్లో స్థితిగతులు ఇంతకన్నా మెరుగ్గా ఏ‌మీ లేవు!

ఇక, ప్రత్యక్ష ప్రజాస్వామ్యమని కాంగ్రెస్ వాదులు ముద్దుగా పిల్చుకునే అరాచకత్వం కాంగ్రె‌స్ పార్టీని అణువణువునా ఆవహించి ఉంది. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు ఆ పార్టీలో పడగలెత్తి బుసలు కొడుతున్నాయి. అవకాశవాదంతో ఎవరి చంకన ఎక్కడానికయినా సిద్ధపడే కాంగ్రె‌స్ పార్టీకి సొంత ‘ప్రకృతి’ అంటూ ఏమీ మిగల్లేదు. బాబరీ మసీదు సంఘటన తర్వాత ముస్లిముల్లో ఆ పార్టీపై నమ్మకం దిగజారింది.

వై‌యస్‌ఆర్ లాంటి నేతలు ముస్లిముల ప్రత్యేక అవసరాలను గమనించి, వాటికి తగిన రీతిలో సంక్షేమ చర్యలను చేపట్టేందుకు ప్రయత్నించిన దశలో తిరిగి ఆ పార్టీపై విశ్వాసం పుంజుకుంది. అయితే, 2009 తర్వాత కాంగ్రె‌స్ కప్పగంతులు వల్ల ఆ పరిస్థితి మారిపోయింది. పైగా, ఇప్పుడెవరూ కాంగ్రె‌స్ పార్టీని లౌకికవాదానికి కట్టుబడిన రాజకీయ సంస్థగా గట్టిగా చెప్పలేరు. ఒకప్పుడు కాంగ్రె‌స్‌కు మూలధనంగా ఉన్న దళితుల ఓట్లు ఏనాడో ఆ పార్టీకి దూరమయిపోయాయి. 

వివిధ రాష్ట్రాల్లోని విభిన్న అగ్ర కులాల అండదండల కోసం పాకులాడినందువల్లనే ఈ దౌర్భాగ్యస్థితి సంక్రమించింది. ఇప్పుడిప్పుడే పటిష్ఠమయిన రాజకీయ శక్తిగా రూపొందుతున్న బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఓ విధానమే లేదు. ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి...’ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఈ వర్గాలు కూడా ‘యూ‌జ్ అం‌డ్ థ్రో’ పాలసీ పాటించే టీడీపీలాంటి పార్టీలపై విశ్వాసం కోల్పోయి కాంగ్రె‌స్‌ లాంటి అవకాశవాద శక్తులను నమ్మజాలక ప్రత్యామ్నాయ శక్తుల వైపు చూస్తున్నాయి.

దానాదీనా చెప్పేదేమిటంటే, పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీయేకి గడ్డురోజులు వచ్చిపడ్డాయి. రేపు బలాబలాలు సమీకరించుకోవలసివస్తే, ఈ కూటమితో మిగిలేవారెవరో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కూటమి పాలిట శ్రీరామ‌రక్ష లాంటి విషయం ఒక్కటే ఉంది అది సరయిన ప్రత్యామ్నాయం జాతీయ స్థాయిలో ఏర్పడి ఉండకపోవడం. 

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయేని ఎవరూ నమ్మడం లేదనే వాస్తవాన్ని అలా ఉంచండి, అసలు బీజేపీలోని అగ్రనేతల మధ్య ఏకీ భావమే కొరవడిందని ఎన్నో సందర్భాల్లో రుజువయింది. ప్రధాని పదవి మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న లాల్ కృష్ణ అడ్వాణీ ఆ పార్టీలో మరో నాయకుడు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. 

ఇక, నరేంద్ర మోదీలాంటి నడిమంత్రపు నాయకులు జాతీయ నాయకత్వాన్ని హో‌ల్‌సేల్‌గా కొనేయగలననే గర్వంతో మిడిసిపడుతున్నారు. పార్లమెంటులో గొంతుచించుకుని అరవడం తప్ప, ప్రధానమంత్రిత్వానికి ఏ అర్హతా లేని సుష్మా స్వరాజ్ కూడా ప్రధాని పదవి‌ కోసం అంగలారుస్తున్నారు. ఒకవైపు అరుణ్ జైట్లీ, మరోవైపు గడ్కారీ లాంటి నాయకులు వాటా‌ పంపకాల్లో అవకాశం తమనే వరించవచ్చనే నక్కాశతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. 

మొత్తంమీద జాతీయ రాజకీయాలకు స్పష్టమయిన మార్గనిర్దేశనం అవసరం. కాలం చెల్లిన ప్రపంచబ్యాంకు ఆర్థిక విధానాల ఊబిలో దిగబడిపోతున్న దేశాన్ని నిలబెట్టడం అత్యవసరం. నానాటికీ దిగజారిపోతున్న సామాజిక సహనశీలతకు ఊపిరిపోసి బతికించడం తక్షణ అవసరం. లేనట్లయితే దేశం కుక్కలు చింపిన విస్తరి కావడానికి ఎంతో సమయం పట్టదు. 
Back to Top