బాబు పాలనకు సున్నా మార్కులే..!
కర్నూలు: చంద్రబాబు రెండేళ్ల పాలనకు ప్రజలు సున్నా మార్కులు వేస్తున్నారని వైయస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ రామలింగారెడ్డి అన్నారు. చాగలమర్రి మండలంలోని పెద్దవంగలి గ్రామంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో బాబు ఒక్కటి కూడా నేరవెర్చలేదని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలను బాబు నట్టేట ముంచారని ఆయన ఫైర్ అయ్యారు.
బూటకపు హామీలతో వంచన
కృష్ణగిరి: చంద్రబాబు సర్కారు బూటకపు హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను వంచించారని ప్రజలు ధ్వజమెత్తారు. కృష్ణగిరి మండలం పులిచర్ల, కటారుకొండ గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరుకుపాడు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. చంద్రబాబు పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. పింఛన్లు, ఎన్టీఆర్ గృహాలు, ఇందిరమ్మ గృహాల బిల్లులు, గ్రామాల్లో పారిశుద్ధ్యలోపం, మంచినీటి సమస్యలను స్థానికులు నారాయణరెడ్డి ఎదుట ఏకరువు పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సమస్యలపై గళమెత్తుతుంటే అధికార పార్టీ అణగదొక్కేందుకు కుట్రపన్నుతోందని ఆరోపించారు.
చంద్రబాబుది అవినీతి పాలన
దేవమాడ: చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన ఆటలు ఇక నుంచి సాగవని కోడుమూరు వైయస్సార్‌సీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అన్నారు. కర్నూలు మండలం దేవమాడ గ్రామంలో మురళీకృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. బాబు అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా, ఆయన పాలనంతా ఓటుకు నోటు, ఇచ్చిన హామీలను మరచిపోవడం వంటి పనులతోనే ముందుకుపోయిందన్నారు. చంద్రబాబు వైయస్సార్‌సీపీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.