జగనన్న కోలుకోవాలని...

 

 జననేత కోసం.. సర్వమత ప్రార్థనలు


హత్యాయత్నంపై టీడీపీ ప్రభుత్వ వైఖరిపై నిరసనలు

చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలని నినాదాలు

శ్రీకాకుళం: జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి నిరసనగా ఆమదాలవలస పట్టణంలో వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్సార్‌ జూనియర్‌ కళాశాల వద్ద నుంచి పెద్దసంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా బయల్దేరి ప్రధాన రహదారిపై నిరసనలు తెలుపుతూ పోలీస్‌స్టేషన్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వేస్టేషన్‌ కూడలి వద్ద మానవహారం చేపట్టి సుమారు గంట సమయం పాటు వాహనాలను అడ్డుకున్నారు.  కార్యక్రమంలో  పార్టీ ముఖ్య నాయకులు టి.చిరంజీవినాగ్, బి.రమేష్‌కుమార్, ఎస్‌.గాంధీ,ఎస్‌ నాగేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, జి.రాంబాబు, జెజె మోహన్‌రావు,  బోర చిన్నంనాయుడు, పి.రామారావు, కె.శ్యాంప్రసాద్, బి.అజంతాకుమారి, డి.శ్యామలరావు, డి.చిరంజీవిరావు, కె.సాయికుమార్, కొంచాడ రమణమూర్తి, హనుమంతు కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నరసన్నపేటలో...
జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా శుక్రవారం కూడా నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఉదయం చల్లపేట, సారవకోటల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం పోలాకి, ఉర్లాంలో జరిగాయి. రోడ్డుపై బైఠాయింపులు, మానవహారాలు నిర్వహించారు. దీంట్లో పార్టీ నాయకులు చిన్నాల వెంకటసత్యనారాయణ, సీతారాం, మెండ రాంబాబు, బగ్గు రామకృష్ణ, కరిమి రాజేశ్వరరావు, కనుసు సీతారాం, చింతు రామారావు, ఆరంగి మురళి, సురంగి నర్సింగరావు, పోలాకి నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు తమ అధినాయకుడి కోసం ప్రాణాలు ఇస్తారే తప్ప అలా ప్రాణాలు తీసే మనుషులు కాదని యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు అన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా ఆయన ఆధ్వర్యంలో శ్రీకాకుళం మండలంలోని రాగోలు వద్ద  నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చిట్టి జనార్దనరావు, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ల తాతబాబు, గేదెల రామారావు, బోర చిన్నంనాయుడు, చిట్టి రవికుమార్, యజ్జల  గురుమూర్తి, గేదెల శం గల్వరావు, గంగు నరేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 

జగనన్న కోలుకోవాలని...
త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడిన జగనన్న సత్వరమే కోలుకోవాలని కోరుకుంటూ జిల్లావ్యాప్తంగా పలు ఆలయాల్లో పూజలు జరిగాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతంలోని ఆలయాలను సందర్శించి జగన్‌ పేరుతో అర్చనలు, పూజలు చేయించారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడే నాయకుడు క్షేమంగా మళ్లీ జనాల మధ్యకు వస్తారని, దైవసంకల్పంతోనే ప్రజాసంకల్పయాత్రను పూర్తి చేస్తారని కోరుకుంటున్నారు.

పాతపట్నంలో....
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్వరం కోలుకోవాలని కోరుకుంటూ పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పాతపట్నంలోని నీలమణిదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజాంలో....
రాజాంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు శుక్రవారం పూజలు నిర్వహించారు. జననేత జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టంకాల అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంతకవిటి మండలంలోని వాల్తేరు గ్రామంలో పార్టీ మండల కన్వీనర్‌ గురుగుబెల్లి స్వామినాయుడు ఆధ్వర్యంలో అసిరితల్లి గుడి వద్ద పూజలు చేశారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పాలకొండలో...
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పాలకొండలో ఎమ్మెల్యే కళావతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ నేతృత్వంలో కోటదుర్గమ్మ ఆలయంలో పూజలు జరిగాయి. భామిని మండలంలో మండల పార్టీ కన్వీనర్‌ టి.సింహాచలం, కొవ్వాడ ఆంజనేయుల నేతృత్వంలో ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

ఇచ్ఛాపురంలో...
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ క్షేమం కోరుతూ ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నర్తు రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శనను ఆలయం నుంచి మెయిన్‌రోడ్డు వరకు నిర్వహించారు. అలాగే ఇచ్ఛాపురం రూరల్‌ మండలం లొద్దపుట్టి గ్రామం వద్ద గల తులసమ్మ గుడిలో మండల పార్టీ నేతలు సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, కంచిలి ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ కంచిలి మండల అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయరావు తదితరుల ఆధ్వర్యంలో సోంపేటలోని దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

టెక్కలిలో...
జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో   ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి  నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో టెక్కలి సీఓఎం చర్చిలో పాస్టర్‌ అబ్రహం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నందిగాం మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయం, సంతబొమ్మాళిలోని ఆంజనేయస్వామి ఆలయం, కోటబొమ్మాళిలోని కొత్తమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎచ్చెర్లలో...  
దుండగుడి హత్యాయత్నంలో గాయపడిన జగన్‌ సత్వరమే కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గం సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం మండలాల్లో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.   

పలాసలో...  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మందస పట్టణంలోని శ్రీవాసుదేవపెరుమాళ్‌ ఆలయంలో   ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి మెట్ట కుమారస్వామి, బాడ జగన్నాయకులు, యర్రగుంట్ల కష్ణమోహన్, యవ్వారి నాగేశ్వరరావు, గౌడు కురా   పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో...
జగన్‌ ఆరోగ్యం కోలుకోవాలని కోరుతూ శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌ కూడలి వద్దగల కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, మండవల్లి రవి, మెంటాడ స్వరూప్, పొన్నాడ రుషి, కోరాడ రమేష్, టి.కామేశ్వరి, సుగుణారెడ్డి, గుంట జ్యోతి పాల్గొన్నారు.  జగన్‌ క్షేమం కోసం ముస్లిం సోదరులంతా మసీదుల్లో  ప్రత్యేకంగా నమాజు చేశారు.


Back to Top