బాబూ..ఊహా ప్రపంచం నుంచి బయటికి రండి
– రాజధాని విషయంలో చంద్రబాబువి కల్లిబొల్లి మాటలు  
– సినిమా సెట్టింగ్‌ మాదిరిగా రాజధాని నిర్మాణం సాధ్యమా?
– రాజధాని ప్రాంతంలో పిచ్చిమొక్కల దర్శనం అభివృద్ధా?
– రాజధాని అంటే ఎలాగుంటుందో మేం కట్టి చూపిస్తాం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహా ప్రపంచం, ఊహా పాలనలో విహరిస్తున్నారని, అక్కడి నుంచి భూమి మీదకు దిగి రావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు సూచించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని, సినిమా సెట్టింగ్స్, విహార యాత్రలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రైతుల భూములు లాక్కున్నారని, అక్కడ పిచ్చి మొక్కలు, మట్టి దిబ్బలు మాత్రమే ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, అలాంటిది 2019లోగా రాజధాని నిర్మించి ఎన్నికలకు వెళ్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇంకా ఒక సంవత్సరం ఆరునెలల కాలం ఉందని, రాజధాని నిర్మించాలని సూచించారు. ఆశ్చర్యకరంగా నిన్న సినిమా డైరెక్టర్‌ రాజమౌళిని తెరపైకి లె చ్చారన్నారు. ఏపీలో ఉన్న ఏ ఇంజనీరు, ఏ మేథావి, ప్రభుత్వ సలహాదారు నచ్చక రాజమౌళి సలహాలు పాటిస్తూ రాజధాని నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. సినిమా అంటే అది ఊహా ప్రపంచమని, అది కనబడదు, ఉండదు అన్నారు. రాజధాని అన్నది మా జీవితాలకు సంబంధించిన అంశమన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ప్రధాని ఏదో చేశారని, చంద్రబాబు ఇక్కడ ప్రయోగాలు చేయడం సరికాదు అన్నారు. మీ ఊహా పాలన చూసి ఏపీ గౌరవం అపహాస్యం అవుతుందన్నారు. మీ నాటకాలు, అబద్ధాలు ఆపి భూమి మీదకు రావాలన్నారు. ఆర్థిక మంత్రేమో లోటు బడ్జెట్‌ అంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని చెబుతున్నారు. చంద్రబాబేమో అద్భుత రాజధాని నిర్మిస్తామని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సినిమా వాళ్లు వేసే సెట్టింగ్స్, గ్రాఫిక్స్‌ చూసి రాజధాని నిర్మించాలనుకోవడం తప్పుకాదని, అయితే మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అన్నది మీరు గమనించాలన్నారు.  గ్రాఫిక్‌మాయా జలంతో ఇప్పటికే నాలుగేళ్లు గడిపారని, ఇకపై ఊహల ప్రపంచం నుంచి బయటకు రావాలన్నారు. ఇప్పటి వరకు 600 సార్లు విదేశీ యాత్రలు చేస్తూ 23 దేశాలు తిరిగి, 500 పై చిలుకు ప్రజాధనం వెచ్చించిన తరువాత ఇప్పుడు రాజమౌళిని తెచ్చారన్నారు. ఇన్నాళ్లు మీరు తిరిగిన విదేశీ యాత్రలు వ్యర్థమేనా? రాజమౌళి మంచి దర్శకుడని, బాహుబలి లాంటి సినిమా తీసి అభిమానుల మనసులు దోచుకున్నారని, అయితే రాజధాని నిర్మాణం సినిమా కాదన్నారు. పవన్‌ కళ్యాణ్‌వచ్చి శ్వేత పత్రం విడుదల చేయాలని కోరితే నాకే సంపూర్ణ అవగాహన లేదని చంద్రబాబు చెప్పడంతో ఆయన నిజస్వరూపం బయటపడిందన్నారు. మీరు ఇప్పటికైనా అవగాహనారాహిత్యం ఉందని చంద్రబాబు ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మీరు చెప్పిన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అన్నది అబద్ధమని చెప్పారు. అది కేవలం అభూత కల్పనే అన్నారు. చంద్రబాబు ఒకసారి ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని, మరోసారి వాజ్‌పేయి సహకారంతో సీఎం అయ్యారని, ఇంకోసారి బీజేపీ, పవన్‌ కళ్యాణ్‌ మద్దతుతో అధికారంలోకి వచ్చారన్నారు. పవన్‌కు అనుభవం లేనప్పుడు ఆయన్ను పక్కనపెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగారని నిలదీశారు. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి తెరచాటున ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. పోలవరం నిర్మాణాన్ని అటకెక్కించారని మండిపడ్డారు.

రాజధాని మేం కట్టి చూపిస్తాం
రాజధాని ఎలా ఉండాలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమరావతిలోనే కట్టి చూపిస్తారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు అన్నారు. రాజధాని నేనే కడుతానన్న చంద్రబాబు అభిలాషను మేం చూడాలని మొదటి నుంచి ఎదురుచూస్తున్నాం. నాలుగేళ్లలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. మీ మీద గౌరవంతో, నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణం కోసం ధారదత్తం చేశారో ఆ రైతుల ఉసురు తగులకపోదు అని చంద్రబాబును హెచ్చరించారు. రాజధాని భూముల్లో మీరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడం సరికాదు అని హితవు పలికారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మేం అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపట్టితీరుతామని స్పష్టం చేశారు.  రాజధాని పేరుతో మీరు చేసిన అవినీతి, అక్రమాలను వెలికితీస్తామని సుధాకర్‌బాబు హెచ్చరించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top