సీబీఐ విచారణకు సిద్ధమా బాబూ?


– సీఎంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారు
– 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పే చంద్రబాబుకు హోదా ప్రయోజనాలు తెలియవా?
– బాబు తన పాపాలను కడుక్కోవడానికి ఎదుటి వారిపై బురద జల్లుతున్నారు
– జాతీయ రహదారుల దిగ్బంధం విజయవంతం
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి సవాల్‌ విసిరారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. హోదా కోసం రోడ్డెక్కిన ఉద్యమకారులను బలవంతంగా అరెస్టు చేయించడం దుర్మార్గమన్నారు. ఒక వైపు హోదా ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతూ..మరో వైపు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామంటే ప్రజలు నమ్మరన్నారు.  ఈ రోజు రాష్ట్రంలో 16 రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రత్యేక హోదా సాధించాలని బలమైన కాంక్షతో ఉన్న ప్రజలు జాతీయ రహదారుల దిగ్బంధాన్ని విజయవంతం చేశారన్నారు. వారందరికి వైయస్‌ఆర్‌సీపీ ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదా విషయంలో మోసపోయామని బాధతో జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో పాలు పంచుకుంటే చంద్రబాబుకు గుండె మంటగా ఉందన్నారు. దేశంలో అందరికి ఏపీ ప్రజల బాధలు, అసహనం తెలిశాయన్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం ప్రజల ఆకాంక్ష వినిపించడం లేదన్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాటు చేసిన పాపాలను కడుక్కునేందుకు ఎదుటి పార్టీలపై బురద జల్లుతున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఎక్కడ తిరుగుతున్నారు, వైయస్‌ జగన్‌ ఎవరితో మాట్లాడుతున్నారన్న  విషయాలపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారు కానీ, హోదా సాధించేందుకు చిత్తశుద్ధితో పని చేయడం లేదన్నారు. నాడు ప్రత్యేక ప్యాకేజీ అంటే స్వాగతించి..ఇప్పుడు మెరుగైన ప్యాకేజీ ఇస్తామంటే నమ్మామని కళ్లిబొల్లి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఇవన్నీ తెలియవా అన్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేంద్రం కొన్ని రాయితీలు ప్రకటించిందన్నారు. వీటిని సాధించేందుకు చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. ఎవరితోనైనా చర్చించావా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పిస్తామంటే పోలవరం తీసుకున్నావా అన్నారు. ఎవరితో చర్చించకుండా అర్ధరాత్రి పూట ప్యాకేజీకి ఎందుకు అంగీకరించావని మండిపడ్డారు. 

నీ కంటే అవినీతిపరులు ఉంటారా బాబూ?
చంద్రబాబు కంటే అవినీతిపరులు దేశంలో మరెవ్వరు ఉండరని పార్థసారధి విమర్శించారు. దేశంలోనే అవినీతిలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు. అనర్హత వేటు వేయకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఓ ఎమ్మెల్యేను అవినీతి డబ్బు ఇస్తూ అడ్డంగా ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన నీ కంటే అవినీతి పరుడు ఎవరైనా ఉంటారా చంద్రబాబు అన్నారు. నీ పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాన్‌ నీ గురించి పుంఖాను పుంకాలుగా మాట్లాడుతున్నారని, వాటిని సమాధానం చెప్పాలన్నారు. మట్టి నుంచి భూముల వరకు అరోపణలు వచ్చాయని, నీ కొడుకు లోకేష్‌పై నీ మిత్రపక్షాలు, పత్రికలు కూడా ఆరోపణలు చేశాయని, నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణ చేయించుకొని సచ్చిలుడిగా బయటకు వచ్చారన్నారు. చంద్రబాబుకు నీకు దమ్ముంటే ఆవిధంగా చేయగలవా అని చాలెంజ్‌ చేశారు. చంద్రబాబుకు కేసుల విషయంలో భయపడుతున్నారని చెప్పారు. నీ భాగస్వామి బీజేపీ కూడా అవినీతి గురించి మాట్లాడుతుందని, దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలన్నారు. నీ పాపం పండిన తరువాత ఈ రోజు చంద్రబాబు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. కేంద్రంతో పోరాడితే ఏం వస్తుందని నాడు పిరికి పందలాగా మాట్లాడి..ఈ రోజు పౌరుషం, ఆత్మగౌరవం అంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. రాజధాని కుంభకోణాలు, భూస్కామ్‌లపై దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు.


 
 
Back to Top