రైతుదీక్ష వేదికగా ప్రభుత్వ మెడలు వంచుదాం

  • వైయస్‌ జగన్‌ దీక్షను విజయవంతం చేద్దాం
  • కనీస ధర లేక పంటలను తగలబెట్టుకుంటున్న రైతులు
  • చంద్రబాబుకు అధికారం కట్టబెట్టి మోసపోతున్న ప్రజలు
  • బెయిల్‌ రద్దుపై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • విజయవాడ: రైతులకు అండగా నిలిచి ప్రభుత్వ మెడలు వంచి వారి పంటలకు మద్దతు ధర ఇప్పించడం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే రైతుదీక్షను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. రైతుదీక్షను జయప్రదం చేయాలని కోరుతూ విజయవాడ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నాయకులు, సమన్వయకర్తలతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధిలు సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. మే 1, 2 తేదీల్లో గుంటూరులో వైయస్‌ జగన్‌ దీక్ష చేపట్టబోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధరలు లేక రోడ్లపై పోసి తగలబెట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రుణమాఫీలు చేస్తాం.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉంటామని హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకోవడానికి ఎలాంటి ఆలోచనలు చేయడం లేదన్నారు. ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఎవరికి అప్పగించారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా తెలుగుదేశం పార్టీ నూరు పేజీల మ్యానిఫెస్టో చూసి దాంట్లోని వెయ్యి అబద్ధాలను నమ్మి చంద్రబాబుకు అధికారం ఇచ్చి ఘోరంగా మోసపోయారన్నారు.

    ఇన్‌పుట్‌ సబ్సీడీ ఎగ్గొట్టేందుకు రెయిన్‌గన్‌ల డ్రామా
    దారుణంగా రైతులను మోసగించి వారి పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం బాధాకరమని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. మిర్చి రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందన్నారు. గతంలో రూ. 12 వేలకు పైగా ధర పలికిన మిర్చి ఇప్పుడు మూడోవంతు అంటే రూ. 4 వేలకు పడిపోయిందన్నారు. క్వింటాకు రూ. 15 వందలు సపోర్టింగ్‌ ఇస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు 64 లక్షల క్వింటాల మిర్చి పండితే రూ. 15 వందల చొప్పున ఇవ్వాలంటే రూ. కోటి దాటుతుందన్నారు. అవి కూడా ప్రభుత్వం చెల్లించిన దాఖళాలు లేవన్నారు. పసుపు, మినుము పంటలు కూడా దీనావస్థలో ఉందన్నారు. మినుము రైతుల నష్టపోయారని వైయస్‌ జగన్‌ ఆ ప్రాంతాలకు వెళ్లి పంటలను పరిశీలిస్తే మంచిగా ఉన్న పంటను తొక్కారని వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని మండిపడ్డారు. దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట వేస్తే సర్వే చేసి 27 ఎకరాలు నష్టపోయినట్లుగా చూపించారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ. 12 వందలున్న సుబాబులు పంటకు రూ. 4 వేల ధర ఇప్పించామని గుర్తు చేశారు. రెయిన్‌గన్‌లతో 4.6 లక్షల ఎకరాలను సాగుచేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు ఆ విధంగా లేవన్నారు. రెయిన్‌గన్‌ల పేరుతో ప్రభుత్వ సంపదను చంద్రబాబు దోచుకున్నారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సీడీని ఎగ్గొట్టేందుకు రెయిన్‌గన్‌ల డ్రామా ఆడి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా వైయస్‌ఆర్‌ సీపీ రైతుదీక్ష చేపడుతుందని పార్టీలకు అతీతంగా అందరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    కాఫీకప్పులో తుఫాన్‌ మాదిరి ప్రచారం చేసుకున్న చంద్రబాబు
    చంద్రబాబు, సోనియాగాంధీలు వైయస్‌ జగన్‌పై పెట్టిన కేసుల్లో ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని పెద్దిరెడ్డి విమర్శించారు. వైయస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు అయితే ఒక మనకు అడ్డు అదుపులేదని టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. భగవంతుడి దయతో సీబీఐ పిటీషన్‌ను కోర్టు కొట్టివేయడం జరిగిందన్నారు. కాఫీ కప్పులో తుఫాన్‌ వచ్చిన మాదిరిగా చంద్రబాబు అనుకూల మీడియా చూపించిందన్నారు. వైయస్‌ జగన్‌పై పెట్టిన అక్రమ కేసులు త్వరలోనే వీగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Back to Top