గాయం తీవ్రత ముఖ్యం కాదు..నేరపూరిత కుట్ర ప్రధానం



– ముందస్తు ప్రణాళిక ప్రకారమే సీఎం, డీజీపీ వ్యాఖ్యలు
–శ్రీనివాస్‌కు ఇప్పటికీ టీడీపీ వాళ్లతో సంబంధాలు ఉన్నాయి
– శ్రీనివాస్‌ వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త అని దుష్ప్రచారం చేశారు
– వైయస్‌ జగన్‌ ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా ఇంటికి వెళ్లారని సీఎం అబద్ధాలు
 – సీఎం, డీజీపీ, మంత్రులు స్పందించిన తీరు చూస్తుంటే ఇందులో కుట్ర ఉంది
– ప్రజా న్యాయస్థానంలో టీడీపీకి శిక్ష తప్పదు
 –  వైయస్‌ఆర్‌సీపీ అభియోగ పత్రం విడుదల

హైదరాబాద్‌:  గాయం తీవ్రత ముఖ్యం కాదని..నేరపూరిత కుట్ర ప్రధానమని వైయస్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపించారు. సీఎం, డీజీపీ, మంత్రుల స్పందన చూస్తే ఇందులో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ అభియోగపత్రాన్ని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్‌ పోర్టు రెస్టారెంట్‌ ఓనర్‌ హర్షవర్ధన్‌ చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితుడని, ఈయన గత ఎన్నికల్లో గాజువాక సీటు కోసం ప్రయత్నించారని గుర్తు చేశారు. హర్షవర్ధన్‌ క్యాంటిన్‌ను నారా లోకేష్‌ ప్రారంభించారన్నారు. హత్యాయత్నంపై సాయంత్రం 4.30 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయితే, అంతకంటే ముందే డీజీపీ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, డీజీపీ, మంత్రుల వ్యాఖ్యలు చేస్తుంటే ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. విచారణ మొదలుకాకముందే సీఎం, డీజీపీ కోరస్‌ పాడారంటే ఈ కేసును నీరుగార్చడమే వీరి లక్షమన్నారు. వీరి దుర్మార్గమైన చర్యలు ఆలోచన చేస్తే ముందుస్తుగానే దాడి గురించి తెలుసు అని, నష్ట నివారణ చర్యలు ఎలా అని ముందే ప్లాన్‌ రూపొందించుకొని మాట్లాడారన్నారు. ఒకవేళ హత్య జరిగి ఉంటే దీన్ని ఎవరికి నెట్టాలి, టీడీపీలో ఎవరికి మట్టి అంటకుండా ప్లాన్‌ చేసుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం రచన తరువాత ఫ్లెక్సీ తయారు చేశారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అభియోగ పత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. 

వైయస్‌ జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే నేరుగా సిటీ న్యూరో ఆసుపత్రికి వచ్చారన్నారు. కానీ చంద్రబాబు వైయస్‌ జగన్‌ ఇంటికి వెళ్లారని, ఆ తరువాత బీజేపీ నేతలు ఫోన్‌ చేస్తే ఆసుపత్రికి వెళ్లారని చెప్పారన్నారు. సీఎం ప్రెస్‌మీట్‌లో ఆయన హావాభావాలు చూస్తే..వైయస్‌ జగన్‌ తప్పించుకున్నారన్న భావన కనిపించిందన్నారు. పోలీసులు నిందితుడిని చూపించకముందే టీడీపీ మంత్రులు ఫోటో, ఫ్లెక్సీతో మీడియా ముందుకు వచ్చారన్నారు. ఠానే లంక గ్రామంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి చినాన్న గ్రామ ఉప సర్పంచ్‌గా పని చేశారని తెలిపారు.టీ డీపీకి చెందిన శ్రీనివాస్‌ను వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తగా చిత్రీకరించారన్నారు. తన జేబులో లెటర్‌ ఉందంటే ఎవరిని బ్లేమ్‌ చేస్తారని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త వైయస్‌ జగన్‌కు మేలు చేయాలనుకుంటే ఆ లెటర్‌ ఎందుకు రాసుకుంటారని, తన లెటర్‌లో చంద్రబాబు గురించి రాస్తారు కానీ వైయస్‌ జగన్‌ గురించి ఎలా రాస్తారని ప్రశ్నించారు. పది పేజీల లెటర్‌ తన జేబులో ఉంటే మడతలు పడవా అని నిలదీశారు. ఆ లెటర్‌లో నాలుగైదు చేతిరాతలు ఉన్నాయని, 4.30 గంటలలోగా చూపించాలనే ప్రయత్నంలో ఇలా చేశారన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ఈ లెటర్‌ ఒక సృష్టిమాత్రమే అన్నారు. హత్యాయత్నం కేసులో ఒక్క గాయం లేకపోయినా కూడా ఆ ముద్దాయి అర్హుడన్న జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గాయం తీవ్రత ముఖ్యం కాదని, నేరపూరిత కుట్ర ప్రధానమన్నారు. టీడీపీకి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. 


 
Back to Top