<br/>అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్భందం చేయడంతో అనంతపురం నగరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ ఎమ్మెల్యే వి. ప్రభాకర్ చౌదరీ విసిరిన సవాల్‌ను స్వీకరించి చర్చకు బయలుదేరిన వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఆయన ఇంటి వద్దనే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై అనంత వెంకట్రామి రెడ్డి బహిరంగ చర్చకు సిద్దపడ్డారు. టీడీపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంనగర్ పార్క్‌లో చర్చకు బయలు దేరారు. దీంతో అనంత వెంకట్రామిరెడ్డితో పాటు వైయస్ఆర్‌సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ మేయర్ రాగేపరశురా, పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను అరెస్ట్ చేసి గృహనిర్బంధం చేశారు.<br/>టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు పిలిచి పోలీసుల చేత అక్రమంగా నిర్బంధించడమేంటని మండిపడ్డారు. ఈ విషయమై ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను వెంకట్రామిరెడ్డి ప్రశ్నించగా చర్చకు ఎటువంటి అనుమతి లేదని సమాధానం ఇచ్చారు. పోలీసులు వైఖరితో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. <br/><br/>