కాల్ మనీ కేసు నీరుగార్చే కుట్ర

మాఫియాకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు
కాల్ మనీ ఘటనపై వైఎస్ జగన్ చలించారు
చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగలేఖ 
విడుదల చేసిన వైఎస్సార్సీపీ నేతలు

హైదరాబాద్: తెలుగు తమ్ముళ్ల కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఎందుకు ఆదేశించలేదని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైఎస్సార్సీపీ నేతలు కె. పార్థసారధి, వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కాల్ మనీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

బాధితులకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి మాఫియాకు కొమ్ముకాసే ప్రయత్నం చేస్తున్నారని  వైఎస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ వ్యవహారంపై పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కాల్ మనీ వ్యవహారం గురించి తెలియగానే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారని, తీవ్ర మనస్తాపం చెందారని చెప్పారు. రాజకీయాల కోసం ఇంతకు దిగజారతారా అని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కాల్ మనీ బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబుకు వైఎస్ జగన్ రాసిన బహిరంగ లేఖను పార్థసారధి, వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా విడుదల చేశారు.

Back to Top