చంద్రబాబు నాటకాలు తెలిసిపోయాయి

 

– రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష నేతపై  ఇష్టం వచ్చినట్లు మాటలా?
– చంద్రబాబు మనస్తత్వం ఏంటో ప్రజలకు అర్థమైంది
– గరుడను రచించింది చంద్రబాబేనా?
– శివాజీపై ఏం చర్యలు తీసుకున్నారు?
– టీడీపీ నేతల నేర ప్రవృత్తి ఏమిటో వాళ్ల మాటల్లోనే తెలుస్తోంది
 
హైదరాబాద్‌: చంద్రబాబు నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే పరామర్శించాల్సిన ముఖ్యమంత్రి ఎదురుదాడికి దిగడం, అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వారి నేర ప్రవృత్తిని తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక వాతావరణం సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, దీనిపై కేంద్రం విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. శనివారం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ఒక హేయమైన సంఘటనను ఆధారం చేసుకొని టీడీపీ నాయకులు చంద్రబాబు నుంచి సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని వంటి నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే..వారికి జగన్‌ పట్ల ఉన్న కసి, ఓర్వలేని తనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఒక దుర్ఘటన జరిగింది..ఎక్కడ లోపం జరిగింది. నిఘా ఎక్కడ వైఫల్యం అయ్యిందని, కనీసం సీఎం ప్రతిపక్ష నాయకుడిని పరామర్శించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటు అన్నారు. దెబ్బతిన్న నాయకుడిని పరామర్శించాల్సింది పోయి, ఇతర నాయకులు పరామర్శిస్తే దాన్ని కూడా తప్పుపడుతూ..ఇష్టం వచ్చిన తీరుతో మాట్లాడుతున్న చంద్రబాబు మనస్తత్వం ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. రాబోయే రోజుల్లో చర్చీలు, మసీదులు, దేవాలయాల మీద దాడి జరుగబోతుందన్న పుకార్లు చంద్రబాబు పుట్టిస్తున్నారని, ఇది కూడా గరుడ ఆపరేషన్‌లో భాగమేనా అని ప్రశ్నించారు. ఏ గుడిపై దాడి చేస్తున్నారో ..మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో తెలపాలని పట్టుబట్టారు. చంద్రబాబే రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని, మీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.  గరుడలో  భాగంగానే ప్రార్థన స్థలాలపై దాడులు చేయించబోతున్నారా అని నిలదీశారు. గరుడు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.  ఒక నటుడు చెప్పినట్లు జరుగుతుందని సాక్షాత్తు సీఎం చెబుతున్నారంటే..దానిపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ గరుడను రచించింది చంద్రబాబేనా అన్నారు. ఏ రోజైనా ఈ గరుడపై సమీక్షించారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరుగుతుందని ఆ నటుడు చెబితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నావన్నారు. ఈ రాష్ట్రంలో ఇసుక, మట్టి, కాంట్రాక్టులు, భూ దందాలతో ఏరకంగా టీడీపీ నాయకులు దోచుకుంటున్నారో ప్రపంచమంతా కోడై కూస్తోందన్నారు. ఇన్‌కం ట్యాక్సీ అధికారులు దాడులు చేస్తే..మీకేందుకు భయమని నిలదీశారు. మీ ఉద్దేశం ఏంటో చెప్పాలని డిమాండు చేశారు.
వైయస్‌ జగన్‌పై టీడీపీ నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. జగన్‌ను పరామర్శించాల్సిన సీఎం ఏం చేస్తున్నారని మండిపడ్డారు. మధ్యాహ్నం 12.40 గంటలకు సంఘటన జరిగితే 4.40 గంటల వరకు సమాచారం రాలేదని చెబుతున్నారని, డీజీపీ మాత్రం తానే వైయస్‌ జగన్‌కు ఫస్ట్‌ ఏయిడ్‌ చేయించి ఎయిర్‌పోర్టులో పంపించానని చెబితే..కానీ చంద్రబాబు సాయంత్రం వరకు సమాచారం అందడం లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. అన్ని టీవీ ఛానల్స్‌ కూడా వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిపై ప్రచారం చేశారన్నారు. దెబ్బ తగిలి, రక్తం కారుతున్నా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కనీసం ఎలాంటి భద్రత కల్పించారో సమాధానం చెప్పాలన్నారు. ఇంత దిగజారిపోయిన టీడీపీ నేతలు ఇవాళ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటు అన్నారు. సంస్కారహీనంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, టీడీపీ డీఎన్‌ఏలోని నేర ప్రవృత్తి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేశినేని నాని మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ను కైమా కైమా చేస్తామని పేర్కొనడం బాధాకరమన్నారు. టీడీపీ పేరు తొలగించుకొని కోడి..కత్తి పేరు పెట్టుకోబోతున్నారని ప్రచారం జరుగుతుందన్నారు. చంద్రబాబు ఆడే నాటకాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యాయని, అబద్ధాల హామీతో అధికారంలోకి వచ్చిన డ్రామాలన్నీ  కూడా గమనిస్తున్నారని చెప్పారు. ఎన్నికల హామీలను ఎక్కడ ప్రశ్నిస్తారో అని బీజేపీ, వైయస్‌ఆర్‌సీపీపై నెపం నెట్టి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మొన్న ఐపీఎస్‌ అధికారిని కూడా విజయవాడలో తిట్టి పంపించారని, లేదంటే కైమా కైమా చేసేవారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. 

వైయస్‌ జగన్‌కు ఆంధ్రపోలీసు వ్యవస్థపై నమ్మకం లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, అలా ఎప్పుడు అనలేదని, చంద్రబాబు వద్ద ఉన్న కొందరు అధికారులపై మాత్రమే అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన ఘటనపై ముందే మాట్లాడిన తరువాత ఏవిధంగా సీట్‌ విచారణలో న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఐపీఎస్‌ అధికారిపై దాడి చేస్తే ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖ ఏయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై చంద్రబాబు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్నారు. గ్రాఫిక్స్‌ పై సృష్టించిన ఫ్లెక్సీ తెచ్చి విచారణను పక్కదోవ పట్టించేందుకు పునాది వేశారని, అందుకే చంద్రబాబు వ్యవస్థపై నమ్మకం లేదని చెప్పామన్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర ప్రభుత్వం, స్వతంత్ర సంస్థలు, థర్డ్‌ పార్టీతో విచారణ చేయించాలని పార్థసారధి డిమాండు చేశారు.  ఈ రాష్ట్రంలో అరాచక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర  ప్రభుత్వం చంద్రబాబు గుడులు, చర్చీలపై దాడులు జరుగబోతున్నాయన్న వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top