బిల్లును వ్యతిరేకిస్తాం.. అభిప్రాయాలు చెబుతాం

హైదరాబాద్ :

మన రాష్ట్రాన్ని ముక్కలుగా చేయడం కోసం వచ్చిన విభజన బిల్లుపై అసెంబ్లీలో జరిగే చర్చలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాల్గొనబోదని పార్టీ సీఈసీ సభ్యుడు, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. అయితే రాష్ట్రపతి సూచనల ప్రకారం బిల్లుపై తమ అభిప్రాయాలను మాత్రం మళ్లీ కచ్చితంగా చెబుతామని కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరి‌గితే తమ ఎమ్మెల్యేలందరూ పాల్గొని వ్యతిరేకంగా ఓటు వేస్తారని తెలిపారు. తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇప్పటికే అందజేశామన్నారు.

‌రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మళ్లీ ఆ అభిప్రాయాలనే వెల్లడిస్తాం కానీ చర్చలో మాత్రం పాల్గొనే ప్రసక్తే లేదని భూమన విస్పష్టంగా తెలిపారు. పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతనం కార్యాలయం ఆవరణలో పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి‌ ఈ మీడియాతో మాట్లాడారు.

ఈ సమావేశంలో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, దాడి వీరభద్రరావు సహా పలువురు ముఖ్యనేతలు, కొందరు ఎమ్మెల్యే‌లు పాల్గొన్నారు. అసెంబ్లీలో బిల్లుపై ఓటింగ్ జరిగేలా ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. మెజారిటీ ప్రజలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ సమక్షంలో సభలో జరిగే చర్చలో పాల్గొనే ప్రసక్తే లేదని చెప్పారు. సమైక్యవాదం ముసుగులో సీఎం కిరణ్, రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కయి విభజన బిల్లుపై చర్చ సజావుగా పూర్తిచేసి కేంద్రానికి పంపడానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ కోర్ కమిటీలోనూ, తరువాత సీడబ్ల్యూసీలోనూ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకున్నపుడు భాగస్వామిగా ఉన్న సీఎం కిరణ్ ‌అప్పుడు గంగిరెద్దులా తలూపి వచ్చారని, ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు భయపడి పది రోజుల తరువాత బయటకు వచ్చి తాను విభజనకు వ్యతిరేకమంటూ సన్నాయి నొక్కులు నొక్కి పదవిలో కొనసాగుతున్నారని‌ భూమన విమర్శించారు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి మాట్లాడి ఆ ఉద్యమంపై కిరణ్ నీళ్లు చల్లారన్నారు.‌ తీర్మానం ద్వారా బిల్లును ఓడిద్దామని, పలు ప్రగల్భాలు పలికిన సీఎం.. చివరకు విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకే సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. సభలో బిల్లును ప్రవేశపెట్టేటపుడు ఉద్దేశ్యపూర్వకంగా సభకు రాకుండా, బీఏసీ సమావేశాలకు గైర్హాజరై బయట మాత్రం సమైక్యవాదినని పత్రికల్లో రాయించుకున్నారని ఆరోపించారు.

చంద్రబాబు 2008లో ప్రణబ్ కమిటీకి తెలంగాణ ఏర్పాటు చేయాలని లేఖ ‌ఇవ్వడంతో పాటుగా 2009లో అప్పటి హోంమంత్రి చిదంబరంతో జరిగిన సమావేశంలో కూడా విభజనకు అనుకూలమని స్పష్టంగా చెప్పారని భూమన గుర్తుచేశారు. అంతటితో ఆగకుండా షిండేతో జరిగిన సమావేశంలో సైతం రాష్ట్రాన్ని త్వరగా విడగొట్టాలని చెప్పారని, అయితే సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూశాక ఇపుడు ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలతో నాటకాలు ఆడిస్తున్నారని విమర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top