ప్ర‌త్యేక హోదా కోసం బంద్ లో పాల్గొందాం..!

ప్ర‌త్యేక హోదా ప్ర‌జ‌ల హ‌క్కు
హోదాతో అనేక లాభాలు
ఉద్య‌మించాల్సిందే
హైద‌రాబాద్: ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌తిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఉద్య‌మిస్తోంది. అందులో భాగంగా శనివారం జ‌రిగే బంద్ కోసం పార్టీ శ్రేణులు స‌మాయ‌త్తం అవుతున్నాయి. 

ప్ర‌జ‌ల హ‌క్కు
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు ఆంద్ర‌ప్ర‌దేశ్ తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌న్న విష‌యాన్ని అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. 70 శాతం త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు, 90 శాతం సేవ ప‌రిశ్ర‌మ‌లు హైద‌రాబాద్ కే చెంద‌టంతో పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏపీకి రావాల్సిన అవ‌సరం ఉంద‌ని గుర్తించాయి. దీనికి గాను ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పారు. స్వ‌యంగా అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ‌లో ఒక ప్ర‌క‌ట‌న చేశారు. అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ ప‌దేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇప్పించాల‌ని కోరారు. దీనికి ప్ర‌ధాన‌మంత్రి అంగీక‌రించ‌టం అంద‌రికీ తెలిసిన విష‌యం.

హోదాతో అనేక లాభాలు
ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు కేంద్రం నుంచి నిధులు స‌మృద్దిగా వ‌స్తాయి. వీటిలో 90 శాతం వ‌ర‌కు గ్రాంట్ గా అందుతాయి. దీంతో అభివృద్ది ప‌నులు వేగ‌వంతం అవుతాయి. అటు, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అనేక కేంద్ర సుంకాల్లో నూటికి నూరుశాతం మినహాయింపు ల‌భిస్తుంది. దీంతో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న వేగ‌వంతం అవుతుంది. అప్పుడు పారిశ్రామికీక‌ర‌ణ జ‌రిగి ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయి. ఇవన్నీ ప్ర‌త్యేక ప్యాకేజీల‌తో రానే రావు. అంతే గాకుండా ప్యాకేజీలో పొందుప‌ర‌చిన అంశాల‌కు ఎటువంటి కాల ప‌రిమితి లేనే లేదు. పైగా అవ‌న్నీ విభ‌జ‌న చ‌ట్టాల్లో పొందుప‌రిచిన‌వే కావ‌టం గ‌మ‌నించాల్సిన అంశం.

ఉద్య‌మించాల్సిందే...!
సాక్షాత్తూ పార్ల‌మెంటులో ప్ర‌ధాన‌మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌కే తూట్లు పొడుస్తున్నా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న ప్ర‌భుత్వం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌టం లేదు. పైగా ప్యాకేజీల‌తో స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్ష నేత గా వైఎస్ జ‌గ‌న్ దీనిపై పోరాటం సాగిస్తున్నారు. మంగ‌ళ‌గిరి లో స‌మ‌ర దీక్ష చేసి ఎలుగెత్తి చాటారు. ఢిల్లీ లో మ‌హా ధ‌ర్నా నిర్వ‌హించి తెలుగువారి గుండె గొంతుక‌ను వినిపించారు. ప్ర‌భుత్వాల‌కు తెలిసి వ‌చ్చే విధంగా బంద్ పాటించాల‌ని పిలుపు ఇచ్చారు. అందుచేత ఈ బంద్ లో పాల్గొన‌టం ద్వారా ప్ర‌జ‌ల వాణిని వినిపిద్దాం.
Back to Top