175 నియోజకవర్గాల్లో పార్టీ సమైక్య దీక్షలు

హైదరాబాద్, 2 అక్టోబర్ 2013:

రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బుధవారం ఉదయం నిరాహార దీక్షలు ప్రారంభించింది. తద్వారా సమైక్య ఉద్యమ ప్రభంజనం సృష్టిస్తోంది. ‌జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఆయన జయంతి రోజు బుధవారం ఉదయం నుంచి ఒకేసారి సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులు, శ్రేణులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రెండు నెలలుగా సమైక్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సమగ్ర కార్యాచరణతో పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సమైక్య వాణిని మరింత బలంగా వినిపించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్త వరకు ఈ రోజు దీక్షలో పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి, నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష ప్రారంభించారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి నేతృత్వంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకులు దీక్షకు దిగారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామంచంద్రారెడ్డి ఆమరణ దీక్షకు దిగారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దీక్ష చేస్తున్నారు.

‌చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రె‌స్ నాయకుడు భూమన కరుణాకర‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం ఉదయం తుడా సర్కిల్లో ప్రారంభమైంది. ఇదే జిల్లాలోని పుంగనూరులో పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లిలో ఎమ్మెల్సీ డి.తిప్పారెడ్డి, బి.కొత్తకోటలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

‌వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మ‌న్ ఎస్.రఘురామరెడ్డి ఆధ్వరంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త‌లు భారీగా తరలివచ్చారు. జిల్లాలోని 36 గంటల పాటు నిరవధిక దీక్షను ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ వైస్ చైర్మ‌న్ సూర్యనారాయణ రెడ్డి ‌బుధవారం ఉదయం ప్రారంభించారు. వారి దీక్షకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మద్దతు ప్రకటించారు.

విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ సమన్వయ కర్త బలిరెడ్డి సత్యారావు అధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే బాలరాజు, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహా సీమాంధ్రలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల దీక్షలు ప్రారంభమయ్యాయి.

Back to Top