<br/><br/> వైయస్ఆర్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డికి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వైయస్ పురుషోత్తంరెడ్డి మృతికి వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెకు సంబంధించిన వ్యాధితో వైయస్ఆర్ జిల్లా కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పురుషోత్తంరెడ్డి బుధవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. వైయస్ రాజారెడ్డి తమ్ముడైన పురుషోత్తంరెడ్డి పులివెందులలోని వైయస్ రాజారెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఉంటూ లక్షలాది మంది పేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈయనకు డాక్టర్ సత్యానందరెడ్డి, థామస్‌రెడ్డి, స్టాన్లీ రెడ్డి, మైఖేల్‌రెడ్డి అనే నలుగురు కుమారులు ఉన్నారు. పురుషోత్తంరెడ్డి కుటుంబ సభ్యులను వైయస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. కడపలో వైయస్ పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి నివాళులర్పించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్‌సురేష్‌బాబు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చిన్నయ్య పురుషోత్తంరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. <br/>