బాబుకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రశ్నావళి

హైదరాబాద్ 20 జూన్ 2013:

టీడీపీ, కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్నలు సంధించింది. చంద్రబాబుకు రాసిన లేఖను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం హైదరాబాద్లో విడుదల చేసింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనపై  అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు, ప్రస్తుతం కిరణ్‌ సర్కార్‌ను ఎందుకు కాపాడుతున్నారో తెలపాలని డిమాండ్ చేసింది. మహానేత హయాంలో స్పీకర్‌గా కిరణ్‌ను వ్యతిరేకించిన మీరు.. సీఎంగా ఎలా అంగీకరించారో సమధానం చెప్పాలని  కోరింది. అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్థానాల్లో  ఎన్నికలు నిర్వహించాలని  ఎందుకు పట్టుబట్టడం లేదని చంద్రబాబును ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే  నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్‌ చేయడం లేదని నిలదీసింది.

పురపాలక సంఘాలు, మండలాలు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీలు.. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించాలని  కోరడానికి భయమెందుకని ప్రశ్నించింది. సీఎం, ఆయన సోదరుడు అక్రమార్కులని పదే పదే అంటున్న మీరు ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నట్లో వివరించాలని సూచించింది. సీఎం, ఆయన సోదరుడు పాల్పడుతున్న అవినీతిపై మీరెందుకు గవర్నర్‌, రాజ్యాంగ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయరని ప్రశ్నించింది. మీపై సీఎం చేసే ఆరోపణలను మీరెందుకు ఖండించడం లేదని అడిగింది. శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డి పత్రిక, చానల్‌ ప్రారంభిస్తే గొంతుచించుకున్న మీరు సీఎం, పీసీసీ చీఫ్‌లకు చానళ్లు ఉంటే మీరెందుకు అభ్యంతర పెట్టడం లేదో వెంటనే సమాధానం చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును డిమాండ్ చేసింది.

Back to Top