రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెస్‌ ఆటలాడుతోంది

హైదరాబాద్, 29 జూలై 2013: కాంగ్రెస్‌పార్టీ వైఖరి రాష్ట్రంలో మరింత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తోందని వైయస్ఆర్‌కాంగ్రెస్‌పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ఎం.వి. మైసూరారెడ్డి, పార్టీ విప్‌, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సోమవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో నిప్పులు చెరిగారు. అధికారం ఉంది కదా అని రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని వారు ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర సమస్యను పరిష్కరిస్తోందా? లేక మరింత పెంచుతోందా అని తమ ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఎవరికీ అన్యాయం జరగకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నదే వైయస్ఆర్‌కాంగ్రెస్‌పార్టీ విధానమన్నారు. అయితే కాంగ్రెస్ నియంతృత్వంతో, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.

లేఖ పూర్తి పాఠం ఇదీ..:
‘ఢిల్లీ ఆల్‌ పార్టీ మీటింగ్‌లో మా పార్టీ తరఫున పాల్గొన్న ఎం.వి. మైసూరారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి ద్వారా ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ఆ దిశగా సత్వరం నిర్ణయం తీసుకోవాలని కోరాం. అంటే కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదన ఏమిటో చెప్పి, ఇక్కడి పార్టీలతో చర్చించి, ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్నది నిర్ధారించుకుని ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర విభజనపై నిర్ణయం అయిపోయినట్లుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పెద్దలే రకరకాలుగా చెపుతున్న వాతావరణం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో, విభజన తప్పదు అంటే, ఎవరికీ అన్యాయం జరగకుండా... అందరికీ ఆమోదయోగ్యంగా ఆ నిర్ణయం ఎలా చేయాలన్న కనీసం అభిప్రాయ సేకరణ కూడా చేయకుండా, నియంతృత్వ పోకడతో కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ సిడబ్ల్యుసి మీటింగ్‌ జరిగిపోయి ఆ మీటింగ్‌లో వాళ్లు ఏకపక్షంగా, తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని విభజిస్తే... అప్పుడు కొందరికి మోదం.. కొందరికి ఖేదం కనిపిస్తుంటాయి. సీమాంధ్ర ప్రజలంతా ఏమంటారు? ‘కాంగ్రెస్‌ వారు అడ్డగోలు వైఖరి అవలంబించి తీవ్ర అన్యాయం చేశారు. మాకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా బతకగలుగుతాం’ అని ప్రశ్నిస్తారు. అలాంటి పరిస్థితుల మధ్య, వారికి నిజంగానే అన్యాయం జరిగి ఉంటే, ఆ అన్యాయానికి మేం స్పందిస్తే.. తెలంగాణ ప్రజలు తమ నోటి వరకు వచ్చిన తర్వాత వీళ్లు అడ్డుపడుతున్నారని బాధపడతారు. ఇరు ప్రాంతాల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీగా, ఎవరికి అన్యాయం జరుగుతున్నా స్పందించకపోతే... నాయకులుగా ఉండి కూడా మేం అన్యాయం చేసినవారమవుతాం. చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఇలాంటి పరిస్థితులను ఊహించి మేం ప్లీనరీలో చెప్పినది, బాధ్యత గల పార్టీగా గతంలో అనేక సందర్భాల్లో చెప్పినది ఏమిటంటే... అందరికీ ఆమోదయోగ్యంగా, ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మీదే, ఆ దిశగా అడుగులు వేయండి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం.

రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం రాష్ట్రాల మీద సర్వాధికారాలూ కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయి. ఇలా అధికారం ఉంది కదా అని కాంగ్రెస్‌ వారు అడ్డగోలుగా నియంతృత్వ పోకడతో మనందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మన శ్రీరాంసాగర్‌కు పైన బాబ్లీని అక్రమంగా కట్టి మన రాష్ట్రంలోకి రావాల్సిన నీటిని మహారాష్ట్ర బిగబట్టటాన్ని గమనిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితిని చూస్తున్నాం. మరోపక్క కృష్ణా నదిని చూస్తే మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత పైన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాములు నిండితే తప్ప కిందికి నీరు వదలని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు ఏమి చెప్పినా, కోర్టులు ఏమి చెప్పినా వినేవారు లేరు. పోనీ కావేరి పరిస్థితి ఎలా ఉందని చూస్తే సుప్రీంకోర్టు చెప్పినా... ప్రధాని చెప్పినా కర్ణాటక, తమిళనాడు ఖాతరు చేయడం లేదు. ఆ రాష్ట్రాల్లో బంద్‌లు, గొడవలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని ఏకపక్షంగా ఏర్పాటు చేస్తే... శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? నాగార్జునసాగర్‌కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్న మాటల్ని బట్టి, రాష్ట్రాన్ని అడ్డగోలుగా పైభాగం ఒకరికి, కిందిభాగం ఒకరికి అని విభజిస్తే... కింది భాగంలో ఉన్న వారికి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచినీళ్లు ఎక్కడ ఉన్నాయి? నీటి సమస్యలు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి అనేక జటిల సమస్యలకు సమాధానం వెతకాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఒక తండ్రి తన పిల్లల మధ్య పరిష్కారం చూపినట్లుగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నది మర్చిపోకూడదు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మేమే ప్రభుత్వం... మేమే పార్టీ అన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

గతంలో ఎన్నడూ, ఏ మీటింగ్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఇది మా వైఖరి అని స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు స్పష్టంగా, మీ నిర్ణయంగా విభజన తప్పదు అని మీరు సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో, ఒక తండ్రి తన పిల్లల మధ్య ఎలా చేస్తే ఎవరికి అన్యాయం జరగకుండా, ముందు రోజులలో కూడా గొడవలకు ఆస్కారం లేని విధంగా అన్నదమ్ముల్లా ప్రేమ, ఆప్యాయతలు కొనసాగే విధంగా ఎలా చేయాలి అని ఈ సున్నితమైన అంశం మీద అందరినీ పిలిచి పరిష్కారాలు వెతకాలి. ముందు కేంద్రం ప్రతిపాదన ఏమిటో చెప్పి, ఆ తరువాత ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కారం చూపాలి. ఇది మీరు చేయవలసిన బాధ్యత.

అలా బాధ్యతగా వ్యవహరించకుండా... రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్‌ వారు అడ్డగోలుగా, ఎవరినీ పరిష్కారాలు అడగకుండా రాష్ట్ర ప్రజలందరి జీవితాలతో చెలగాటం ఆడుతూ సీట్లు, ఓట్లూ అధికారం కోసం డ్రామాలు ఆడుతున్నందుకు నిరసనగానే, మా పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందేమో అని ఆందోళన చెంది, రెండు వారాల క్రితం మా పార్టీ తరఫున కేంద్ర హోంమంత్రికి ఒక లేఖ రాయడం జరిగింది. విభజన తప్పదు అంటే మీ ప్రతిపాదనేమిటో స్పష్టంగా చెప్పి, అందరినీ పిలిచి సంప్రదించండి. అందరికీ ఆమోదయోగ్యమైన, ఎవరికీ అన్యాయం జరగని విధంగా పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేయండి అని మేం అర్థించాం. అయినా మా మొర అరణ్యరోదనగానే మిగిలిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ఇలా నిరంకుశంగా, ఏకపక్షంగా తీసుకోనున్న ఈ నిర్ణయం ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేదిగా ఉంటుందా? సమస్యల్ని పెంచేదిగా ఉంటుందా? జరగబోయే పరిణామాలన్నింటికీ కాంగ్రెస్‌ పార్టీయే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది.’ 
Back to Top