- స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి
- పాలకులే మోసం చేస్తున్నారు
- వ్యవస్థలో మార్పులు రావాలి
- మనం కలిసికట్టుగా పోరాడి మార్పు తెద్దాం
- రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చిన వైయస్ జగన్
దేశానికి అయితే స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతోంది కానీ మన రాష్ట్రంలోని పరిస్థితులను చూస్తా ఉంటే ఇంకా మనకు స్వాతంత్య్రం రాలేదనిపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దళితులపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయని, తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చనిపోయిన ఆవు చర్మాన్ని తీసుకుంటున్న వారిపై అక్కడి వారు అమానుషంగా దాడి చేసి, చెట్టుకు కట్టేసి చెప్పులతో కొట్టడాన్ని చూస్తే మనకు స్వాతంత్య్రం వచ్చిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. 10వ తరగతి చదువుతున్న పిల్లవాడిని అని చూడకుండా కొట్టడం దారుణమన్నారు. వ్యక్తులను మతం, కులం ఆధారంగా గుర్తించే పరిస్థితులు పోవాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ దేశంలోని తెలుగు ప్రజలందరికీ 70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైయస్‌జగన్ మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం వచ్చిందా అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలన్నారు. దళితులను దళితులగా చూసే పరిస్థితులు లేవని, దళితులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేని ప్రస్తుత రోజుల్లో మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఎలా అనుకోవాలన్నారు.
పాలకులే మోసం చేస్తున్నారు
పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికార పక్షం, ప్రతిపక్షం కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వంపో అని అంటుంటే మనకు స్వాతంత్య్రం వచ్చిందని అనుకోవాలా? అని జగన్ ప్రశ్నించారు. ప్రధాని రేసులో ఉన్న వ్యక్తులు, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తులు ఎన్నికల ముందు ఒక హామీని ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తుంటే మనకు స్వాతంత్య్రం వచ్చిందని అనుకోవాలా? అని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే స్వాతంత్య్రం వచ్చిందని ఎలా అనుకోవాలని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం రాకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వైయస్ జగన్ విమర్శించారు. బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని చెప్పిన బాబు అవిచేయకపోతే స్వాంతంత్ర్యం ఎలా వచ్చిందని అనుకోవాలన్నారు.
వ్యవస్థలో మార్పు రావాలి
అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చు అనేది పోవాలంటే మనలో మార్పు వస్తే వ్యవస్థలో కూడా మార్పు వస్తుందని వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఊరుకోం అంటూ ప్రజా ప్రతినిధులను నిలదీసే రోజులురావాలన్నారు. మన రాజ్యాంగం గొప్పదని చెప్పుకుంటున్నాం తప్పితే అవి పాటించడం లేదన్నారు. అక్రమంగా సంపాదించిన నల్లధనంతో చంద్రబాబు తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు పెట్టి కొంటూ అడ్డంగా దొరికిపోతే ఆయనపై నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాంటప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఎలా అనుకోవాలన్నారు. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు అందరం కలిసి కట్టుగా పోరాడుదాం అని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.