108, 104 పథకాలు కూడా అక్రమాదాయ మార్గాలుగా మారడం శోచనీయం

03–12–2018, సోమవారం 
అంతకాపల్లి, శ్రీకాకుళం జిల్లా

ఈ రోజు పాదయాత్ర రేగిడి, రాజాం మండలాల్లో సాగింది. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఉదయం రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిశారు. నాతో కేక్‌ కట్‌చేయించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. అదే సమయంలో తమ బాధల్ని, తమకు జరిగిన మోసాలను వివరించారు. ఆ సంఘం అధ్యక్షుడు సగం గుండు గీయించుకుని.. మీసం, గడ్డం సగం తీయించుకుని వచ్చాడు. ఇదేంటన్నా అంటే.. దివ్యాంగులకు బాబుగారు చేసిన మోసానికి నిరసన అన్నాడు. బాబుగారు దివ్యాంగ దినోత్సవం నాడు ఇచ్చిన హామీలకే దిక్కులేదన్నాడు. మేనిఫెస్టోలోని హామీలు ఎప్పుడో మర్చిపోయాడని చెప్పాడు. రెండు కాళ్లు, రెండు చేతులు పూర్తిగాలేని సాయిబాబు అనే అభాగ్యుడిని ఎత్తుకుని గతంలో అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి.. సాయం కోసం అర్థించారట. వారిచ్చిన వినతిపై రూ.లక్ష సాయం రాశారట బాబుగారు. ఇప్పుటికి తొమ్మిది నెలలైనా రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదన్నారు. ముఖ్యమంత్రిని నాలుగుసార్లు కలసినా ఫలితం కనిపించలేదని చెప్పారు. బాబుగారిని కలిసి సాయం అడుగుతున్న ఫొటోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే తను మాటిచ్చిన.. కేవలం రూ.లక్ష సాయం కూడా ఇవ్వకపోవడమన్నది దారుణం కాదా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

 ప్రతి జిల్లాలో 104 ఉద్యోగులు కలుస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆ సిబ్బందితో పాటు అందులో పనిచేసే వైద్యులు కలిశారు. ‘పేదలకు ఇంటి వద్దే వైద్యం’.. అనే 104 ఆశయమే నీరుగారి మొక్కుబడి కార్యక్రమంగా మారిందన్నారు. 104లో నాసిరకం మందులిస్తున్నారని.. కానీ వాటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. పరికరాల కొనుగోలులోనూ అక్రమాలేనట. ప్రయివేటు ఆస్పత్రుల్లోని పరికరాలు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. వాటికన్నా అధిక ధరలు పెట్టి కొంటున్న 104లోని పరికరాలు మాత్రం రెండు నెలలకే మూలన పడుతున్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతోందని ఆ డాక్టర్లు చెబుతుంటే చాలా బాధేసింది. ఇసుక, మట్టి, నీరే కాదు.. ఆఖరికి పేదల మందులు, వైద్యంలో కూడా దోపిడీ సాగుతుండటం క్షమించరాని నేరం. 108, 104 వంటి ఉదాత్త పథకాలు కూడా అక్రమాదాయ మార్గాలుగా మారిపోవడం శోచనీయం.  

ఇండిట్రేడ్‌ పేరుతో ఈ నియోజకవర్గంలో వెలసిన ఓ బోగస్‌ కంపెనీ బారినపడ్డ బాధితులు కలిశారు. ఆ కంపెనీ చేసిన మోసాలలో పాత్రధారులు, సూత్రధారులందరూ టీడీపీ నాయకులేనన్నారు. తెలుగుదేశంవారే ఆ బోగస్‌ కంపెనీకి బ్రోకర్లుగా పనిచేసి, అధిక వడ్డీల ఆశచూపి ప్రజల నుంచి కోట్ల డిపాజిట్లు సేకరించారట. అలా వందల కోట్లు సేకరించి బోర్డు తిప్పేశారట. ప్రభుత్వాధినేతలే నిందితుల్ని వెనకేసుకొస్తుంటే ఇక మాకు న్యాయం ఎలా జరుగుతుంది.. అని ప్రశ్నించారు. తూతూమంత్రంగా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించి ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదని, ఒక్క రూపాయీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల లాలూచీ వ్యవహారమని చెప్పారు. ఆ బాధితుల్లో దాసరి సావిత్రమ్మ అనే అక్క కూడా ఉంది. ఆమె భర్త.. తన కొడుకును ఎంబీబీఎస్‌ చదివించడం కోసం పొలం అమ్మగా వచ్చిన రూ.20 లక్షలను ఆ సంస్థలో డిపాజిట్‌ చేశాడట. సంస్థ మోసం చేయడంతో మానసిక క్షోభకు గురై 45 ఏళ్ల వయసుకే గుండెపోటుతో చనిపోయాడని ఆ తల్లి కంటతడి పెట్టింది. ఇదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు కూడా ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు పోవడంతో గుండె ఆగి మరణించారట.. చాలా బాధనిపించింది. అగ్రిగోల్డ్‌ మొదలుకుని కేశవరెడ్డి విద్యాసంస్థలు, ఇండిట్రేడ్‌ దాకా సీఐడీ దర్యాప్తు జరుగుతున్నా డిపాజిట్‌దారులకు ఒక్క రూపాయి కూడా రాకపోవడం.. దోషులెవరికీ శిక్ష పడకపోవడం.. ఓ వైపు ప్రభుత్వ పెద్దలే నిందితుల్ని కాపాడుతూ సంస్థ ఆస్తులను కాజేస్తుండటం.. మరోవైపు న్యాయం అడిగిన బాధితులపై ముఖ్యమంత్రే చేయిచేసుకునే స్థాయికి దిగజారడం చూసి ఆశ్చర్యమేసింది.  
 
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత నాలుగేళ్లలో దివ్యాంగుల దినోత్సవాల సందర్భంగా మీరిచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? కాగా నేడు ఎన్నికల ముందు హడావుడి.. మరోమారు దివ్యాంగులను మోసపుచ్చడానికే కాదా? మీ మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య మొదలుకుని.. ప్రత్యేక మంత్రిత్వశాఖ వరకు దివ్యాంగుల సంక్షేమం కోసమంటూ పది హామీలిచ్చారు.. కనీసం గుర్తయినా ఉన్నాయా? 
- వైఎస్‌ జగన్‌

 

Back to Top