ప్రత్యేకహోదా కోసం యువత కదం తొక్కాలి

– ప్రభుత్వ కుట్రలను తిప్పికొడదాం రండి
– యువతకు దిశానిర్దేశం చేసిన వైవీఆర్‌

గుంతకల్లు టౌన్‌:భావితరాలు బాగుండాలన్నా, ఏపీ ప్రగతి పథంలో దూసుకెళ్లాలన్నా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రత్యేక హోదా ఉద్యమంలో యువత కదం తొక్కాలని వైయస్సార్‌సీపీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి యువతకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన 21, 22 వార్డుల పరిధిలోని పలు హోటళ్లు, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లలో ఉన్న యువతను కలిసారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు జైలుకు పోతానన్న భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆయన యువకులకి వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించినట్లయితే పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుందని తద్వార నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, చిరు వ్యాపారస్థులకు జీవనోపాధికి ఢోకా ఉండదన్నారు. పన్నులు చెల్లించనవసరం లేదని, అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక ప్రగతి పెరుగుతుందన్నారు. 

ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొనే యువతను భయపెట్టేందుకు ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని అయినా ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైయస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత వైయస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీకి ‘ప్రత్యేక హోదా–మన హక్కు’ అని హోదా సాధనకై నిర్వహిస్తున్న మహా సమరంలో యువత ముందుండాలని కోరడంతో యువకులంతా చప్పట్లతో ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పోలేపల్లి మధు, నగేష్, అహ్మద్‌బాషా, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్, అధికారప్రతినిధి దశరథరెడ్డి, వార్డు ఇన్‌ఛార్జ్‌ సంపత్, మాజీ పట్టణ కన్వీనర్‌ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top