<strong>హైదరాబాద్, 22 డిసెంబర్ 2012:</strong> తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (టిజెఎసి) కన్వీనర్ కోదండరామ్ శనివారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టిఎన్‌జిఓ సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ తదితరులు కూడా ఉన్నారు. ఈ భేటీలో శ్రీమతి విజయమ్మ వెంట పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి, సిఇసి సభ్యుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్సులోని లోటస్‌పాండ్‌లో ఉన్న శ్రీమతి విజయమ్మ నివాసంలో ఈ భేటి జరిగింది.<br/> ఈ నెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై ఏకాభిప్రాయం చెప్పాలని టిజెఎసి నాయకులు ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మను కోరారు. ఈ మేరకు శ్రీమతి విజయమ్మకు వారు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ, ఢిల్లీ అఖిలపక్షం భేటిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక నిర్ణయం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలుస్తున్నట్లు తెలిపారు.<br/>కాగా, తెలంగాణ జేఏసీ ప్రతినిధులు శ్రీమతి విజయమ్మకు అందజేసిన వినతిపై తమ పార్టీలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి తెలిపారు.<br/>