వైయస్ ప్రతి పథకమూ ఖూనీ!

ఉరవకొండ

3 నవంబర్ 2012 : ఈ ప్రభుత్వం వైయస్ ప్రవేశపెట్టిన ప్రతి ఫథకాన్నీ ఖూనీ చేస్తోందని షర్మిల విమర్శించారు. నిల దీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మూడేళ్లుగా చోద్యం చూస్తోందని ఆమె అన్నారు. "చంద్రబాబు నిద్రపోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిగారు మొద్దు నిద్ర పోతున్నారు. ఇద్దరికిద్దరూ జోడీ బాగా సరిపోయారు." అని ఆమె ఎద్దేవా చేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల ఉరవకొండలో శనివారం రాత్రి జరిగిన ఒక భారీ బహిరంగసభలో ప్రసంగించారు.
"రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు కుయ్..కుయ్..కుయ్ అని ఫోన్ 20 నిమిషాలకే 108 వచ్చేది. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది 108. నిన్నటికి నిన్న ఎర్రన్నాయుడుగారు యాక్సిడెంట్ అయితే 11 సార్లు 108కి ఫోన్ చేశారట. వాళ్లు పలకలేదట. దాంతో ఆక్సిజన్ కూడా లేని సామాన్య అంబులెన్స్‌లో ఆయనను ఆసుపత్రికి తీసుకుపోయారు. దాంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయనే కాదండీ, ప్రతి ప్రాణమూ ముఖ్యం కాదా అని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వానికి పట్టలేదు." అని షర్మిల విమర్శించారు.
 పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న చంద్రబాబు ఎన్టీఆర్ రెండు ప్రధాన వాగ్దానాలను తుంగలో తొక్కారని ఆమె గుర్తు చేశారు. బాబుకు మాట మీద నిలువలేక పోయే దురలవాటుందని ఆమె వ్యంగ్యంగా అన్నారు. నాలుగువేల మంది రైతుల ఆత్మహత్యల పాపం చంద్రబాబుది కాదా అని ఆమె ప్రశ్నించారు. గ్రామాలను నాడు శ్మశానాలుగా మార్చిన బాబు  పాదయాత్ర అంటూ కొత్త నాటకం మొదలుపెట్టి మళ్లీ అవే గ్రామాల గుండా వెళుతున్నారని ఆమె దుయ్యబట్టారు. నాడు బాబు హయాంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరినా ఆయన పాపం పోదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు బాబు అనుకుంటున్నట్లు పిచ్చివాళ్లు, అమాయకులు కారని ఆమె అన్నారు.
విశ్వసనీయత అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదని షర్మిల వ్యాఖ్యానించారు. విశ్వసనీయత అంటే ఏమిటని చంద్రబాబు ఒక ఇంటర్వ్యూలో అడిగారనీ, చంద్రబాబుకు లేనిదీ రాజశేఖర్ రెడ్డిగారికీ, జగనన్నకూ ఉన్నదీ అదేననీ ఆమె వ్యంగ్యంగా అన్నారు.
"విశ్వసనీయత అంటే పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉండే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు తమను సొంతబిడ్డల్లాగా చూసుకుంటాడనే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయితీపరుడనీ, మాట ఇస్తే అది తప్పడనీ, మడమ తిప్పడనీ ఉండే నమ్మకం. చంద్రబాబునాయుడుగారికి విశ్వసనీయత అంటే ఈ జన్మలో అర్థం కాదు" అని షర్మిల వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కై జగనన్నపై దొంగ కేసులు పెట్టాయని ఆమె ఆరోపించారు. ఏ సాక్ష్యాలూ లేకున్నా, సిబిఐని వాడుకుని జైలు పాలు చేసి విచారణ పేరుతో బెయిలు కూడా రానివ్వకుండా చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఇన్ని కుట్రలు పన్ని జగన్ ఎవరి కోసం జైలుకు వెళ్లారని కిరణ్ కుమార్ రెడ్డిగారు అడుగుతున్నారు. అవును. జగనన్న రైతులకోసం, చేనేతల కోసం, విద్యార్థుల కోసం పోరాటాలు చేశారు. అందుకే కక్ష కట్టి జగనన్నను జైలు పాలు చేశారు. రాజశేఖర్ రెడ్డిగారు ఉండి ఉన్నా ఆయనను కూడా జైలులో పెట్టేవారు వీరు" అని షర్మిల వ్యాఖ్యానించారు. వారి ఉద్దేశ్యమైదైనా దేవుడున్నాడనీ, ఈ కుట్రలు ఎంతో కాలం పని చేయవనీ, జగనన్నను దేవుడే బయటకు తీసుకువస్తాడనీ, రాజన్నరాజ్యం కూడా వస్తుందనీ ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
చంద్రబాబు హయాంలో వందలాది మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే, వైయస్ వచ్చాక వారికి లక్షన్నర చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని ఆమె గుర్తు చేశారు.
"చేనేతన్నలు చాలా కష్టపడుతున్నారు. రేట్లు పెరిగాయి. వారి శ్రమ పెరిగింది. ఫలం ఏమీ లేదు. మనిషికి రోజుకి రోజంతా కష్టపడితే రూ.70 వస్తున్నాయట. ఇదెక్కడి న్యాయం? పవర్‌లూమ్స్‌పై పని చేసుకుందామంటే ప్రభుత్వం కరెంటు ఇవ్వటం లేదు. ఇది వారి పొట్టపై కొట్టడం కాదా?" అని ఆమె నిలదీశారు. రాజశేఖర్ రెడ్డిగారు ప్రతి వర్గానికీ మేలు జరగాలనుకున్నారనీ, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తలచారనీ, ప్రతి విషయంలోనూ రాజశేఖర్ రెడ్డిగారు ఆదర్శంగా నిలిచారనీ ఆమె అన్నారు.
"చంద్రబాబు తొమ్మిదేళ్ల తన హయాంలో కేవలం పదివేల కోట్ల రూపాయలే సాగునీటిరంగంపై ఖర్చు చేయగా వైయస్ ఐదేళ్లలోనే యాభైవేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతన్న అంటే రాజశేఖర్ రెడ్డిగారికి అంత ప్రేమ. హంద్రీ-నీవా, పిఎబిఆర్ లాంటి ప్రాజెక్టులు చేయకపోతే ప్రజలు వలసలు పోవాల్సి వస్తుందని వీటిని చేపట్టారు. రెండుసార్లు చంద్రబాబు శిలాఫలకాలు వేసి వదిలేశారు. కానీ వైయస్ ప్రాజెక్టులు మొదలుపెట్టి 95 శాతం పూర్తి చేశారు. కేవలం రూ.45 కోట్లు ఖర్చు చేస్తే చాలు. ఈ ప్రాంతం సస్యశ్యామలమౌతుంది. కానీ మూడేళ్లుగా ఈ ప్రభుత్వానికి పట్టలేదు. తాగునీరూ లేకుండా పోయింది. వైయస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకానికీ ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది." అని షర్మిల విమర్శించారు. ఆరోగ్యశ్రీలోంచి ప్రధాన వ్యాధులను కార్పొరేట్ లిస్టులోంచి తొలగించారనీ, పేదలు ప్రభుత్వాసుపత్రికే పోవాలంటున్నారనీ చెబుతూ ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ పథకానికీ ప్రభుత్వం కత్తెరలు వేస్తోంది. ఇది అన్యాయం కాదా?" అని ఆమె నిలదీశారు.

Back to Top