‘వైయస్’ పథకాలు నిర్వీర్యం: చిట్టబ్బాయి

 
ఆలమూరు: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రస్తుత పాలనలో నిర్వీర్యమై పోయాయని వైయస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి విమర్శించారు. మండలంలోని మూలస్థానం అగ్రహారంలో ఆదివారం ఆయన గడపగడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ ఏజేవీపీ బుచ్చి మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చిట్టబ్బాయి మాట్లాడుతూ రాష్ర్తంలో పాలన అథోగతి పాలయ్యిందని, పేద, మధ్య తరగతి ప్రజలు అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయతే ఆయుధంగా మలుచుకున్న తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ద్వారానే ప్రజలకు సుపరిపాలన అందించడం సాధ్యమవుతుందన్నారు. బుచ్చి మహేశ్వరరావు మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలతో జగన్‌ను జైలుకు పంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలే భూస్థాపితం చేస్తారన్నారు. మహానేత ఆశయసాధనకు పాటుపడుతున్న జగన్‌కు ప్రజలందరూ మద్దతివ్వాలని కోరారు. బోరున వర్షం కురుస్తున్నా అధిక సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో ‘గడపగడపకూ...’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇంటింటికి వెళ్లి పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల్ని ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు. పార్టీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా నాయకులు గొల్లపల్లి డేవిడ్‌రాజు, కర్రి నాగిరెడ్డి, మార్గాని గంగాధరరావు, రెడ్డి చంటి, కముజు సత్యనారాయణ, ముసునూరి వెంకటేశ్వరరావు, కనుమూరి శ్రీనివాసరాజు, బొక్కా వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Back to Top