'వైయస్‌పై కాంగ్రెస్‌ నాయకుల దుష్ప్రచారం'

అనంతపురం, 16 ఏప్రిల్‌ 2013 : దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ హయాంపై కాంగ్రె‌స్ ‌నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి చెందిన అనంతపురం ఎమ్మెల్యే బి. గుర్నాథరెడ్డి మండిపడ్డారు. డాక్టర్ వై‌యస్ సంక్షేమ పథకాలతోనే కాంగ్రెస్ రెండవసారి అధికారంలోకి వచ్చిందన్నారు. వ్యవసాయానికి ‌తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, 30 కిలోల బియ్యం హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాను ఎడారి కాకుండా కాపాడేందుకే మహానేత వైయస్ హంద్రీ‌ - నీవా ప్రాజెక్టు చేపట్టారని చెప్పారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన అమ్మ హస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చలవతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆయన ఆశయాలకే తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. మహానేత వైయస్‌ హయాంలో జరిగిన మంచిని తామే చేశామని, చెడు మాత్రం రాజశేఖరరెడ్డి చేశారంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

అమ్మ హస్తం కార్యక్రమంలో ప్రోటోకాల్‌ సరిగా పాటించలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష జరుగుతోందని దుయ్యబట్టారు. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానమే పంపడం లేదంటూ నిలదీశారు.
Back to Top