వైయస్‌ కుటుంబం మాట తప్పదు

       చేవెళ్ల, 27 ఏప్రిల్‌ 2013: మహానేత వైయస్‌ కుటుంబం మాట తప్పదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ స్పష్టంచేశారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శ్రీమతి విజయమ్మ స్వయంగా ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆమె శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలోను, చిట్టెంపల్లిలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ళ అంటే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి ప్రత్యేకంగా అభిమానించిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను మహానేత వైయస్ చేవెళ్ళ నుంచే ప్రారంభించిన విషయాన్ని ఆమె ‌ప్రస్తావించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సిఎం అయ్యాక వృద్ధులు, వితంతువులకు ఏడు వందల రూపాయలు పింఛన్‌ అందిస్తారని శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు. వికలాంగులకు వెయ్యి రూపాయలు పింఛన్‌గా ఇస్తారన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలయ్యేవన్నారు. ఇప్పుడవన్నీ నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఉన్నప్పుడు ఇళ్ళొచ్చాయి.. నీళ్ళొచ్చాయన్నారు. కరెంటు బాగా వచ్చేదన్నారు. ఆయన ఉన్నప్పుడు రేషన్‌కార్డులొచ్చాయి.. రైతులకు ఉచిత విద్యుత్‌ వచ్చిందన్నారు. విద్యుత్‌ చార్జీలు ఒక్క పైస కూడా పెంచలేదన్నారు. ఎరువుల ధరలూ పెరగలేదన్నారు. కరెంటు బకాయిలు మహానేత వైయస్ రద్దుచేశారని గుర్తుచేశారు. నిరుపేదలకు కూడా ఆరోగ్యశ్రీలో మంచి వైద్యం అందేదన్నారు. 108 వాహనానికి ఫోన్‌ చేస్తే.. కుయ్... కుయ్‌మంటూ వచ్చేది ఆ రోజు. ఇప్పుడు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు డాక్టర్‌, ఇంజనీరింగ్‌ లాంటి ఉన్నత విద్యలు చదువుకునేందుకు వైయస్ఆర్ ఫీజు ‌రీయింబర్సుమెంట్‌ పథకాన్ని తెచ్చారని తెలిపారు.

కానీ, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మంచినీళ్ళు రావడంలేదు, రేషన్ కార్డు ‌రావడంలేదు. ఆరోగ్యశ్రీ అందడంలేదు. ఇళ్ళు రావడంలేదు. ఎరువులు, విత్తనాలు ఏవీ అందడంలేదని దుయ్యబట్టారు. పిల్ల చదువులు ఆగిపోయాయి. కిరసనాయిల్‌ దొరకడంలేదని, గ్యాస్‌ ధరలు పెంచారని అన్నారు. నిలిచిపోయిన పథకాలన్నింటినీ జగన్‌బాబు పునరుద్ధరిస్తారన్నారు. జగన్‌బాబు అధికారంలోకి వస్తే.. వైయస్‌ పెట్టిన పథకాలన్నింటినీ అమలు చేస్తారని చెప్పారు. రూ. 185లకే తొమ్మిది రకాల సరుకులు ఇస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పిన 'అమ్మ హస్తం' పథకంలో ఐదు సరుకులే ఇస్తున్నారని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. జగన్‌బాబు అధికారంలోకి వస్తే 'అమ్మ ఒడి' పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలోనే డబ్బులు వేస్తారని చెప్పారు. బెల్టు షాపులను రద్దు చేస్తారన్నారు. మహిళలకు రక్షణ కోసం వెయ్యి మంది ఉన్న గ్రామంలో కూడా పది మంది పోలీసులను నియమిస్తారని చెప్పారు. పంటలకు గిట్టుబాబు ధర కల్పిస్తారన్నారు. వైయస్‌ కుటుంబం మాట తప్పేది కాదన్నారు. జగన్‌బాబు అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని శ్రీమతి విజయమ్మ విజ్ఙప్తి చేశారు. మహానేత వైయస్‌ నాటి సువర్ణయుగాన్ని వైయస్‌ఆర్‌సిపి తీసుకువస్తుందన్నారు.

శ్రీమతి విజయమ్మ రచ్చబండ, ముఖాముఖీ కార్యక్రమాల్లో ఎవరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే వినిపించారు. ఒకరివి కరెంట్ కష్టా‌లు. మరొకరివి రేషన్ ‌ఇబ్బందులు. ఒకరికి పింఛన్‌ కష్టాలు, మరొకరికి ఫీజు రీయింబర్సుమెంట్‌ బాధలు. శ్రీమతి విజయమ్మ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి పెద్ద సంఖ్యంలో  తరలివచ్చిన చేవెళ్ళ, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. కరెంటు ఎల సరఫరా అవుతోంది? ఎన్ని గంటలు ఉంటోందని అడిగారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ తమకు అందుబాటులో లేదని మహళలు ఆవేదన వ్యక్తంచేశారు. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నా.. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో బ్రతుకు భారంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు తమకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేవన్నారు. విద్యుత్‌ ఉదయం పోతే సాయంత్రం వరకూ రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అప్పట్లో తమకు రూ. 60 నుంచి రూ. 90 వరకూ బిల్లు వచ్చేదని, ఇప్పడు మాత్రం రూ. 200 కు పైబడి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. డ్వాక్రా రుణాలు రావడంలేదని కొందరు మహిళలు వాపోయారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నా తమకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలేదని మరికొందరు విచారం వ్యక్తంచేశారు. తాము కూలిపోయే ఇళ్ళలోనే భయంభయంగా బతుకు ఈడుస్తున్నామని కొందరు మహిళలు శ్రీమతి విజయమ్మకు బాధలు చెప్పుకున్నారు. ప్రజల బాధలు సావధానంగా విన్న శ్రీమతి విజయమ్మ వాటిని శ్రీ జగన్‌ దృష్టికి తీసుకువెళతానన్నారు.

చిట్టెంపల్లిలో రైతులతో ముఖామఖీ కార్యక్రమంలో వారి కష్టాలు, కడగండ్లను శ్రీమతి విజయమ్మ విన్నారు. తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో అనాథలైన అక్కా తమ్ముళ్ళ సంఘటన గురించి ఆమె ఆ పిల్లలనే అడిగి తెలుసుకున్నారు. తమ తల్లిదండ్రుల ఆత్మహత్యకు కారణమని తాము అనుమానిస్తున్న వ్యక్తి గురించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వారు శ్రీమతి విజయమ్మ ముందు వాపోయారు. ఈ విషయమై స్థానిక సిఐని పిలిపించి ఆమె కేసు దర్యాప్తు వివరాలు అగిడి తెలుసుకున్నారు. ఆ పిల్లలిద్దరినీ హాస్టల్లో చేర్పించి చదివిస్తామని భరోసా ఇచ్చారు.

జగన్‌బాబు అధికారంలోకి వస్తే.. తెల్ల రేషన్‌కార్డు దారులకు నెలకు 30 కేజీల బియ్యం అందిస్తారని శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తారన్నారు. జగన్‌బాబు అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తారన్నారు. ఈ క్రమంలో వెయ్యిమంది జనాభా ఉన్న గ్రామంలో కూడా 10 మంది కానిస్టేబుళ్ళను నియమిస్తారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారన్న అక్కసుతోనే ఆయనను 11 నెలలుగా అక్రమంగా జైలులో నిర్బంధించారన్నారు.

అంతకు ముందు శనివారం ఉదయం శ్రీమతి విజయమ్మ‌ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసం నుంచి చేవెళ్ల బయల్దేరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు విశేష సంఖ్యలో లోటస్‌పాండ్‌కు తరలివచ్చారు. రాష్ట్ర ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు శ్రీమతి విజయమ్మ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంటలు ఎండిపోయిన రైతుల పొలలాలను, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న దళితుల కాలనీలను శ్రీమతి విజయమ్మ సందర్శించి వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు.
Back to Top