వాయిదాలతో వర్షాకాల అసెంబ్లీ ప్రారంభం

 

శాసనసభ వర్షాకాల సమావేశాలు వాయిదాలతో ప్రారంభమయ్యాయి. సభ్యుల గందరగోళం మధ్య తొలిరోజు సోమవారం సమావేశాలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. సభలో తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై చర్చించి తీరాల్సిందే అంటూ ప్రతిపక్షాలు పట్టు వీడకుండా తీవ్ర గందరగోళం సృష్టించాయి. విపక్ష సభ్యుల నినాదాలతో అసెంబ్లీ హాలు దద్దరిల్లిపోయింది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది+.

రాష్ట్రంలోని పేద బీసీ, ఈబీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్_మెంట్ అమలు చేయాలని వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ‌, విద్యుత్ సమస్యపై తెలుగుదేశం పార్టీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తీర్మానం పెట్టాలంటూ టీఆ‌ర్ఎ‌స్, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పెన్షన్లు ఇవ్వాలని సీపీఐ, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా పాటించాలని బీజేపీ, పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబ‌ర్స్_మెంట్ అమలు చేయాలని ఎంఐఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.‌

అయితే, విపక్షాల వాయిదా తీర్మానాలను చర్చకు చేపట్టేది లేదంటూ స్పీకర్ తిరస్కరించారు.‌ తమ వాయిదా తీర్మానాలపై తక్షణమే చర్చ జరగాలంటూ విపక్షాల సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ‌ వెల్‌లోకి దూసుకువచ్చి, స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఫ్లకార్డులు చేత పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను సామరస్యంగా చర్చించుకుందామని, ఆందోళన విరమించాలని స్పీకర్ విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు.‌ విపక్షాల గందరగోళం కారణంగా అసెంబ్లీని స్పీకర్ తొలుత గంట సేపు వాయిదా వేశారు. రోజు మొత్తంలో పట్టుమని పదినిమిషాలు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగలేదు.‌

అసెంబ్లీ మొదటిసారి గంట వాయిదా అనంతరం సభ మళ్ళీ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి విద్యుత్ సమస్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు స్పీక‌ర్ అనుమతి ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.

సభ సజావుగా సాగేందుకు‌ సభ్యులు సహకరించాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేసినా ‌వారు తమ పట్టువీడకపోవటంతో అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. విలువైన సభా సమయం వాయిదాలతోనే మొదటిరోజు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అంతకు ముందు, సోమవారం ఉదయం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు శాసనసభ్యులు వినూత్నరీతిలో హాజరయ్యారు. రాష్ట్రంలోని విద్యుత్‌ కోతలకు నిరసనగా డీజిల్‌ ధర పెంపు, వంట గ్యాస్‌ సిలిండర్లపై పరిమితిని నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆదర్శ్ నగ‌ర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలే, శాసనసభా పక్ష నేత వైయస్‌ విజయమ్మ, మరి కొందరు సభ్యులతో కలిసి ఎడ్ల బండిలో‌ను, మిగతా సభ్యులు సైకిల్‌ రిక్షాల మీద అసెంబ్లీ సమావేశాలకు తరలివచ్చారు. రోడ్లపై వంటావార్పు చేస్తూ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నేతలు సామాన్యుల కష్టాలను ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం తమదైన శైలిలో చేశారు. 



తాజా వీడియోలు

Back to Top