టిడిపిలో చంద్రబాబు హిట్లర్‌ : షర్మిల

మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా), 11 డిసెంబర్‌ 2012: తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడు హిట్లర్‌ లాంటి వారని, ఆయనకు తెలియకుండా ఏదీ జరగదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కు అయ్యారనడానికి ఎఫ్‌డిఐలకు మద్దతు ఇవ్వడంతోనే స్పష్టమైందన్నారు. అయితే, తనకు తెలియకుండానే తమ ఎంపీలు ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో ఓటింగ్‌కు గైర్హాజరయ్యారంటూ ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సొంత డెయిరీ కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేశారని నిప్పులు చెరిగారు. తన డెయిరీకి లబ్ధి చేకూర్చుకునేందుకే ఆయన ఎఫ్‌డిఐలకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.

అసమర్థ కాంగ్రెస్‌ పార్టీ తీరుకు, దానికి వత్తాసుగా ఉన్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల ఈ చరిత్రాత్మక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మన్సాన్‌పల్లికి చేరుకుంది. మన్సాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల మాట్లాడుతూ, చంద్రబాబు తీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఉందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. 'దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతుల రుణాలు మాఫీ చేశారు కదా తానూ చేస్తానంటున్నారు. ఆయనకు నిజంగా రుణ మాఫీ చేసే ఉద్దేశమే ఉంటే తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే దానికి ఆయన సమాధానం చెప్పలేరు.  రాజశేఖరరెడ్డిగారు విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్‌ చేశారు కదా... నేను కూడా ఉచితంగా చదువు చెప్పిస్తానంటూ ఆయన తిరుగుతున్నారు.  మహానేత వైయస్‌ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే నేను కూడా చేస్తానంటున్నారిప్పుడు చంద్రబాబు నాయుడుగారు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే... పులి.. పులే' అని ఎద్దేవా చేశారు.

పేరుకు మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ అసమర్థ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఇది తుగ్లక్‌ పాలన అంటున్నారని, ఒక్క రోజు కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి వీల్లేదని చెప్పకుంటూ తిరుగుతున్నారన్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబు నాయుడే అన్నారు. నిజానికి చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌రెడ్డి ఒకరి ఒకరు కాపాడుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు కేసులపై విచారణ జరగకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రక్షిస్తుంటే, చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా కాపాడుతున్నారన్నారు.

తెలంగాణ అంటే మహానేత వైయస్‌కు ఎంతో ప్రేమ అన్నారు. అలాగే రాజన్న రాజన్నకు రంగారెడ్డి జిల్లా అన్నా మరింత అభిమానం అన్నారు. ఈ జిల్లాను తన సొంత జిల్లాగా చూసుకున్నారన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించిన విషయాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. ఏ పథకాన్నయినే తెలంగాణ నుంచే ప్రారంభించారని గుర్తుచేశారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాలను రంగారెడ్డి నుంచే ప్రారంభించారని వివరించారు. జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలు తీర్చేందుకే అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రాణహిత - చేవెళ్ళ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మరణంతో ఈ పథకం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే మన రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తిందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. విద్యుత్‌ సరఫరా లేక పరిశ్రమలు మూతపడిపోతున్నాయని, దీనితో వేలాది మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ప్రజలు సాగునీరు, తాగునీటి కోసం అల్లాడుతున్నారని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తం చేశారు.

 ప్రజలు తాగడానికి కనీసం కూడా నీళ్ళు ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఉన్నట్టా చచ్చినట్టా అని శ్రీమతి షర్మిల నిప్పుల చెరిగారు. జగనన్నపై కాంగ్రెస్‌ - టిడిపిలు కుమ్మక్కై జైలులో పెట్టించాయని ఆరోపించారు. జగనన్న ఏ తప్పూ చేయలేదు. త్వరలోనే బయటికి వస్తారని శ్రీమతి షర్మిల ధీమాగా చెప్పారు.
 
ఈ పాదయాత్రలో పార్టీ నాయకులు వైయస్ వివేకానందరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధ‌న్, గట్టు రామచంద్రరావు, బెక్కరి జనార్ద‌న్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, దే‌ప భాస్కర్‌రెడ్డి, వెంకటప్రసాద్, కొలను శ్రీనివా‌స్‌రెడ్డి తదితురులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top