తండ్రికి ఇంగ్లీష్‌ రాదు.. తనయుడికి తెలుగురాదు

  • 36 నెలలు గడిచినా రైల్వేజోన్‌పై అతీగతి లేదు
  • నాయకుల ఉత్తుత్త మాటలతో ప్రజల్లో ఓపిక నశించింది
  • ఏప్రిల్‌ 9న భీమిలీలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు
  • వైయస్‌ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
విశాఖపట్నం: ఆరు నెలల్లో ఇస్తామన్న రైల్వేజోన్‌,  36 నెలలు గడిచినా ఇప్పటి వరకు అతీగతి లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీల కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఆత్మగౌవర యాత్రలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమర్‌ మాట్లాడారు.  సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రజలను మోసం చేసిందన్నారు. మళ్లీ శాసనమండలి ఎన్నికలకు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు ప్రత్యేక రైల్వేజోన్‌ ఇస్తామని ఓట్లు దండుకొని మరోమారు ప్రజలను వంచించారని దుయ్యబట్టారు. నాయకుల ఉత్తుత్త మాటలు విని ఉత్తరాంధ్ర ప్రజల ఓపికంతా పోయిందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తితో, ఆయన చూపించిన పోరాట బాటలో ఆత్మగౌరవ యాత్ర పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. 200 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగుతోందన్నారు. ఏప్రిల్‌ 9వ తేది ముగింపు రోజున వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భీమిలీలో పాల్గొంటారని, అక్కడ ప్రత్యేక రైల్వేజోన్‌పై అధికార పార్టీనేతల ఆగడాలను ఎండగడతారని చెప్పారు. 

తెలుగురాని వ్యక్తికి తెలుగు ప్రజలను పాలించే హక్కుందా?
ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌కు తెలుగు మాట్లాడడం రాదు.. తండ్రికి ఇంగ్లీష్‌ మాట్లాడడం రాదని గుడివాడ అమర్‌ ఎద్దేవా చేశారు. తెలుగురాని నాయకుడికి తెలుగు వారిని పరిపాలించే హక్కుందా అని ప్రశ్నించారు. సరిగ్గా నడవలేని, రాయలేని, చదవలేని వ్యక్తిని మంత్రిని చేయడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. సరిగ్గా ప్రమాణస్వీకారమే చేయరాని లోకేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం రాజకీయాలను కించపరచడమేనని అమర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవ యాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రైల్వేజోన్ సాధించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఎంతవరకైనా పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Back to Top