టీడీపీ ఓ మాఫియా ముఠా

వైయస్ఆర్ కడపః ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్లి వారిని చైతన్యపరుస్తూ ...దుర్మార్గపు పాలన సాగిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నారని వైయస్సార్సీపీ పొలిటికల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోయాక 20 ఏళ్లు వెనక్కివెళ్లిపోయిందని, దాన్ని అభివృద్ధి బాటలో ఎలా పెట్టాలన్న దానిపై సమీక్షించుకోవడానికి ఆయా వర్గాల ప్రజలు, మేధావులు, వివిధ వృత్తుల్లో ఉన్న వారితో మాట్లాడి ఓ కార్యాచరణ తయారు చేసుకోవడానికి వీలుగా వైయస్ జగన్ పాదయాత్ర చేపడుతున్నారన్నారు.  స్వాతంత్ర్యం వచ్చాక అసలు ప్రభుత్వమనేదే లేని పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడ వచ్చి ఉండదేమోనని, అది ఒక్క ఏపీలో మాత్రే ఉందని సజ్జల ఎద్దేవా చేశారు. టీడీపీ సర్కార్ ఓ మాఫియా ముఠాలా తయారైందని సజ్జల మండిపడ్డారు. వైయస్ఆర్ కడప జిల్లాలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. 

పాలకులు తమ జేబులు నింపుకునేందుకే పనిచేస్తున్నారని, ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని సజ్జల ధ్వజమెత్తారు. చట్టసభల్లో ప్రతిపక్షం ప్రజావాణి వినిపించకుండా ప్రభుత్వం గొంతు నొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ హయాంలో ఐదేళ్లలో 260 రోజులు సభ జరిగితే బాబు పాలనలో  నాలుగేళ్లలో 80రోజులు మాత్రమే అసెంబ్లీ జరిపారన్నారు. ఏనాడు కూడ 20రోజులకు మించి సమావేశాలు జరగలేదన్నారు. జరిగిన నాలుగైదు రోజులు కూడ ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తరపున ప్రతిపక్ష సభ్యులు సభ బయటకు వచ్చి మాట్లాడితే అధికార టీడీపీ నేతలు తొక్కేయడం, అవహేళన చేయడం చేస్తున్నారన్నారు. 

ఉమ్మడి రాజధాని అవకాశం ఉన్నా వేల కోట్లు ఎలా దండుకోవాలన్న ఉద్దేశ్యంతో  చంద్రబాబు విజయవాడకు మకాం మార్చాడన్నారు.   రాజధాని పేరుతో మూడు పంటలు పండే రైతుల భూములను దోచుకున్నాడన్నారు. సింగపూర్ కంపెనీల పేరుతో బినామీ కంపెనీలు తీసుకొచ్చి వేల కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హోదాకు తూట్లు పొడిచాడని ఫైర్ అయ్యారు.  ప్యాకేజీ పేరుతో తూతూమంత్రంగా తీసుకొచ్చారు. పోలవరం, పట్టిసీమ, విదేశీ టూర్ ల పేరుతో వందల కోట్లు దోచేస్తున్నారని, కేంద్ర నిధులను డైవర్ట్ చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 


Back to Top