'చంద్రబాబు రాజకీయ పుట్టుకే సంకరజాతి పుట్టుక'

శ్రీకాకుళం: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయ పుట్టుకే సంకరజాతి పుట్టుకని వైస్సార్‌సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీని నాయకుల తయారీ కేంద్రంగా అభివర్ణించడం సిగ్గు చేటన్నారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రూపొందించిన స్వచ్ఛమైన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కలుషితం చేశారని విమర్శించారు. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడిన బాబు ఎన్టీఆర్ ఫొటో లేకుండా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చూశారని, ఆ సమయంలో దాన్ని వ్యతిరేకించినందుకు తనతో విరోదమయ్యారన్నారు.

నిధుల కోసం ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతూ చెక్కభజన చేస్తున్న పచ్చి అవకాశవాది చంద్రబాబని ధ్వజమెత్తారు. దీన్నంతటినీ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ, చంద్రబాబు నామరూపాలు లేకుండా పోతారన్నారు. తెలంగాణ లో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు టీఆర్‌ఎస్ బాటలో నడుస్తున్నారన్నారు. ఆంధ్రాలో అధికారం ఉండడంతో ఆ పార్టీ నేతలు నోరు మెదపకుండా ఉన్నారని, వారంతా వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపిస్తున్నారని, ఆ రోజు దగ్గరలోనే ఉందని సీతారాం అన్నారు.

తాజా వీడియోలు

Back to Top