హామీల వైఫల్యాలపై ఉద్యమం...జగన్


హైదరాబాద్, నవంబర్ 4: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బుధవారం నుంచి మూడు నెలల పాటు మూడు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ఫించన్లలో కోత, హుదూద్ తుపాను బాధితుల సమస్యలే ఎజెండాగా ఈ ఆందోళనలు సాగుతాయని తెలిపారు.

బుధవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. వచ్చే నెల అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తామని చెప్పారు. జనవరి 6,7 తేదీల్లో రెండు రోజులపాటు స్వయంగా తానే గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజలందరూ ఆందోళనలు జయప్రదం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు ఎంవీ మైసూరా రెడ్డి, సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలసి శ్రీ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని రైతులు ఇప్పుడు అపరాధ వడ్డీ రూపేణా 28వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొమ్ము నుంచి వడ్డీ చెల్లించుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ఫించను దారులకు వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక 10 లక్షల ఫింఛన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు.

బాబు వల్లే రైతులకు పంట బీమా రాలేదు

"హుదూద్ తుపానులో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారమే 3.03 లక్షల హెక్టార్లలో పంటకు పూర్తిగా నష్టం జరిగింది. మరో 3.09 లక్షల హెక్టార్లలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగింది. చంద్రబాబు రుణమాఫీ హామీ నిలబెట్టుకోని కారణంగా ఈ రైతులందరికీ పంటల బీమా కూడా రాని పరిస్థితి ఏర్పడింది" అని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. "ఎన్నికలకు ముందు తనకు అన్నీ పూర్తిగా తెలుసునంటూ చంద్రబాబు హామీలు ఇచ్చుకుంటూ పోయారు. రైతు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు.

అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనే 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఉన్నాయని లెక్కలు తేల్చారు. రెండు రకాల రుణాలు కలిపితే 1.01 లక్షల కోట్లు అవుతుంది. చంద్రబాబు చెల్లించవద్దన్నందుకు రుణాలు కట్టని కారణంగా ఆయన పుణ్యమా అని వారందరిపై పోయిన ఏడాదికే 14 వేల కోట్ల రూపాయలు అపరాధ వడ్డీగా భారం పడింది.

రుణమాఫీకి ఈ ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయించని కారణంగా ఈ సంవత్సరానికి మరో 14 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. రెండేళ్లకు కలిపి రుణాలపై వడ్డీనే 28 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు మాత్రం రుణమాఫీకి 5 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. అసలు సంగతి దేవుడికే ఎరుక. వడ్డీనే 28 వేల కోట్లు ఉన్నప్పుడు 5 వేల కోట్లతో 20 శాతాం రుణమాఫీ చేస్తున్నానని ఆయన చెప్పుకుంటున్న మాటలను బట్టే చంద్రబాబు ఎంతగా రైతులను మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది.

చంద్రబాబు రుణాలు మాఫీ చేయని కారణంగా ఈ ఏడాది రైతుల రుణాలు తిరిగి రెన్యువల్ కాలేదు. పంటలకు బీమా రావడం లేదు. డ్వాక్రా మహిళలది ఇదే పరుస్థితి. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బు నుంచి బ్యాంకు వడ్డీని జమ చేసుకుంటున్నాయి" అని వివరించారు. ఈ సంధర్భంగా బాబు అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశం తాలూకు పుస్తకాన్ని జగన్ విలేకరులకు చూపించారు.

ఇంకెన్ని ఫింఛన్లకు కోత పెడతారో?

చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 43,11,686 వరకు ఫింఛన్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 10 లక్షల ఫింఛన్లకు ఇప్పటికే కోత పెట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ వెయ్యి రూపాయల ఫింఛను చెల్లిస్తే ఏడాదికి దాదాపు 9,650 కోట్లు అవసరమవుతాయి. అయితే బడ్జెట్ లో 1,338 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.ఫింఛన్లకు కోత పెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు అవసరమైనదాని కంటే బడ్జెట్ లో తక్కువ నిధులు కేటాయించారు. ఫింఛన్ల ఖర్చు రూ. 1338 కోట్లకు పరిమితం చేసేలా మరికొన్ని ఫింఛన్లకు ప్రభుత్వం కోత పెట్టే అవకాశం ఉంది అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై విలేకరులు ప్రశ్నించగా.. దీనిపై వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ గారికి వినతిపత్రం కూడా అందచేశారని శ్రీ జగన్ వివరించారు.

బాబుకు చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం సమస్య వచ్చేది కాదు

రాయలసీమ నీటి అవసరాలపై బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటి సమస్య ఇంత దూరం వచ్చేదే కాదని జగన్ మోహన్ రెడ్డి వ్యఖ్యానించారు. ''ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉన్నప్పుడు చంద్రబాబు రాయలసీమ నీటి అవసరాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ప్రాజెక్టుకు ఎడమవైపు కేసీఆర్ ప్రభుత్వం, కుడివైపు నుంచి చంద్రబాబు ప్రభుత్వం శ్రీశైలం నీటిని ఎడాపెడా తోడేసి విద్యుత్ కోసం వాడటంతో కేవలం 15 రోజుల్లోనే ప్రాజెక్టులో నీరు 858 అడుగులకు పడిపోయింది. సాధారణంగా వ్యవసాయానికి నీటి విడుదలను దృష్టిలో ఉంచుకొని ఇరువైపులా విద్యుత్ ఉత్పత్తి చేసినా పూర్తిగా నిండిన ప్రాజెక్టు 858 అడుగులకు చేరడానికి మూడు నెలల సమయం పడుతుంది.

శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమకు నీరందతుంది. నీటి మట్టం 858 అడుగులకు చేరాక చంద్రబాబుకు రాయలసీమ నీటి అవసరాలు గుర్తొచ్చాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ వైపు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి కేసీఆర్ ను తిట్టడం మొదలుపెట్టారు" అని అన్నారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ వైఖరి ఏంటన్నది తాను ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పానని విలేఖరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గించారని, దానిని తిరిగి 854 అడుగులకు సవరిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి 107 జీవో తీసుకొచ్చారని మరొక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మించమంటే బాబు వినలేదు

"ప్రభుత్వ అటవీ భూములున్న చోటే రాష్ట్ర రాజధానిని నిర్మించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచనను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. దానివల్ల ఇప్పుడు పెద్ద సమస్యలు వస్తున్నాయి. రాజధాని విషయంలో చంద్రబాబుకు అసెంబ్లీలోనే మా వైఖరి స్పష్టంగా చెప్పాం. ఎక్కడైనా 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నచోటే రాజధానిని నిర్మించాలని సూచించాం. ఇవేమి చంద్రబాబు పట్టించుకోకుండా ఇప్పుడు ల్యాండ్ ఫూలింగ్ అని మొదలు పెట్టారు. చివరకు ల్యాండ్ ఫూలింగ్ కాస్తా ల్యాండ్ పూలింగ్(రైతులను ఫూల్స్ చేసేలా) చేసే కార్యక్రమంగా తయారైందని అన్నారు.

మున్సిపల్ సమావేశాల్లో హత్యలు చేసుకుంటారా?

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. మున్సిపల్ సమావేశాల్లో ప్రజల సమస్యలపై ఒకరిపై ఒకరు గొడవ పడినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై పడిన గొడవకే ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రౌడీ షీటు తెరవడమే రాష్ట్రంలో ఆటవిక పాలనకు నిదర్శనం" అని శ్రీ జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. "మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొడవ పడతారే గానీ.. ఎవరైనా, ఎక్కడైనా ఆ సమావేశాల్లో హత్య చేస్తారా? హత్య చేయడానికి పూనుకుంటారా" అని ప్రశ్నించారు. ఎవరిపైనైనా రౌడీ షీటు తెరవాలంటే కనీసం మూడు కేసులు ఉండాలని చట్టం చెబుతోంది. భూమా నాగిరెడ్డిపై ఇంతకు ముందు ఒక్క కేసు కూడా లేదు. మున్సిపల్ సమావేశంలోని సంఘటనను ఆధారంగా చేసుకుని ఆయనపై టపటపా మూడు కేసులు పెట్టి రౌడీషీటు కూడా తెరిచే పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబు ఒక మనిషేనా అనేది అయన తన గుండెలపై చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలి అని అన్నారు.

తెలంగాణ విద్యుత్ సమస్య తీర్చవచ్చిలా..

‘‘తెలంగాణకు విద్యుత్ కొరత ఉన్న మాట నిజమే. అయితే కేసీఆర్ కొంత మానవత్వంతో, వినూత్నంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి కేసీఆర్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య సరఫరా లైన్లు లేవు. లైన్ల నిర్మాణానికి రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ అందదు. తెలంగాణలో ఎన్టీపీసీ ఆధర్యంలోని 2,600 మెగావాట్ల రామగుండం విద్యుత్ ప్రాజెక్టు ఉంది. అందులో ఎన్టీపీసీకి వాటాగా దక్కే 75 శాతం విద్యుత్ను ఆ సంస్థ ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటుంది.

కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో కొనే వెయ్యి మెగావాట్ల విద్యుత్ను అక్కడ ఎన్టీపీసీకి అప్పగించి, రామగుండం ప్లాంట్లో ఎన్టీపీసీ వాటా నుంచి తెలంగాణకు విద్యుత్ను తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలా చేస్తే విద్యుత్ లైన్లు వేసేవరకు ఆగాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు 1,000 మెగావాట్ల సామర్థ్యం గల విశాఖపట్నం సింహాద్రి ప్లాంట్ ఫేజ్-2లో  60 శాతం విద్యుత్ ఎన్టీపీసీ వాటాగా ఉంది. తెలంగాణ ఇక్కడి నుంచి ఎన్టీపీసీ నుంచి విద్యుత్ తీసుకోవచ్చు. దీనికి బదులుగా ఛత్తీస్గఢ్లో కొనుగోలు చేసే విద్యుత్ను ఆ సంస్థకు ఇవ్వవచ్చు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ కొంత చొరవ చూపితే ఈ సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని’ శ్రీ జగన్ తెలిపారు.

Back to Top